
Ankit Baliyan : హర్యానాకు చెందిన ప్రముఖ గాయకుడు, యూట్యూబర్ అంకిత్ బలియాన్ దారుణ హత్యకు గురవ్వడం కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు ఆయనపై కాల్పులు జరపడంతో అంకిత్ అక్కడికక్కడే మరణించాడు.ఉత్తరప్రదేశ్‌లోని షామ్లీ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. 35 ఏళ్ల అంకిత్ బలియాన్ జిమ్‌లో కసరత్తు ముగించుకుని బయటకు వచ్చి తన కారు వద్దకు వెళ్తుండగా గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఆయనపై సుమారు 20 రౌండ్ల కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యారని స్థానికులు వెల్లడించారు.
ఎకధాటిగా 20 రౌండ్లు కాల్పులు జరపడంతో అంకిత్ తలకు బుల్లెట్ గాయం కావడంతో పాటు శరీరంలోని పలు ప్రాంతాల్లో బుల్లెట్ గాయాలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేసరికే ఆయన మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. జిమ్‌కు కేవలం 20 నుంచి 25 మీటర్ల దూరంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాగా, నిందితులు ఎవరు, ఎందుకు ఈ హత్యకు పాల్పడ్డారనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అయితే. అంకిత్ బలియాన్ హత్యకు తామే బాధ్యులమంటూ గోగి గ్యాంగ్ ప్రకటించినట్లు తెలుస్తోంది. బలియాన్ కు తమ ప్రత్యర్థులతో సంబంధాలు ఉన్నాయని, తమ గ్యాంగ్‌కు సంబంధించిన ఓ ఘటనపై పాట కూడా రాశాడని ఆ ముఠా ఆరోపించడం గమనార్హం. గ్యాంగ్‌తో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న భోలు షాపురియా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో బెదిరింపు మెస్సెజ్ కూడా ఉంది. అయితే ఈ ప్రకటనల నిజానిజాలను పోలీసులు అధికారికంగా నిర్ధారించాల్సి ఉంది.
Also Read : యూపీ ఎన్నికల వేళ అఖిలేష్ యాదవ్ సంచలన హామీ.. మహిళలకు ఏకంగా రూ. 40 వేలు!
మరోవైపు అంకిత్ బలియాన్ హత్యపై కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హంతకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి ఢిల్లీ-ముజఫర్‌నగర్ రహదారిని దిగ్బంధించారు. నిందితులు పట్టుబడే వరకు అంత్యక్రియలు నిర్వహించబోమని స్పష్టం చేయడంతో ఉద్రిక్తత నెలకొంది.
‘భారీ కోర్ట్ మే గోలీ మారేంగే మేరీ జాన్’ పాటతో బలియాన్ బాగా గుర్తింపు పొందారు. తుపాకీ సంస్కృతి, స్థానిక రాజకీయాలు, గ్రామీణ జీవనశైలి వంటి అంశాలతో కూడిన హర్యానా పాప్ పాటలతో పాటు యూట్యూబ్ కంటెంట్, పాడ్‌కాస్ట్‌లు, వ్లాగింగ్ ద్వారా ఆయన వందలాది మంది అభిమానులను సంపాదించుకున్నారు. మసూమ్ శర్మ, రాజు పంజాబీ, ఆశు ట్వింకిల్ వంటి కళాకారులతో కలిసి ఆయన పనిచేశారు.
ప్రస్తుతం పోలీసులు పాత కక్షలు, స్థానిక రాజకీయ విభేదాలు, రాబోయే పంచాయతీ ఎన్నికలతో సంబంధం సహా అన్ని కోణాల్లో హత్యపై దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ, ప్రత్యక్ష సాక్షుల వివరాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ హత్య వెనుక అసలు కారణం, కాల్పులకు పాల్పడిన వ్యక్తుల వివరాలు దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు.
Also Read : TMC రెబల్ ఎంపీలకు బిగ్ షాక్.. లోక్‌సభ నోటీసులు!









