
ఇటీవల వచ్చిన హఠాత్తు వరదలతో పూర్తిగా దెబ్బతిన్న నేపాల్ దేశానికి మళ్లీ పెద్ద ప్రమాదం వచ్చిపడేలా ఉంది. ఇప్పటికే వందలాది ఇళ్లు నీటిలో కొట్టుకుపోయి, వందల మంది ప్రాణాలు కోల్పోగా.. రాబోయే రెండు మూడు రోజుల్లో మరింత పెద్ద వరద విరుచుకుపడే అవకాశం ఉందని పొరుగున ఉన్న చైనా ప్రభుత్వం సంచలన హెచ్చరికలు జారీ చేసింది. నేపాల్ సరిహద్దుకు చాలా దగ్గరలో, రసువా జిల్లా పరిధిలోని భోటే కోషి అనే నది మొదలయ్యే చోట హఠాత్తుగా ఒక కొత్త సరస్సు తయారైంది. టిబెట్ వైపు కొండచరియలు, రాళ్లు, మట్టి పెద్ద ఎత్తున విరిగిపడి నది ప్రవాహానికి అడ్డుగా పడటంతో నీరు బయటకు పోలేక అక్కడ ఒక పెద్ద సరస్సులా మారిపోయింది.
ప్రస్తుతం ఆ సరస్సులో దాదాపు 20 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు వచ్చి చేరింది. అయితే రాబోయే మూడు రోజుల్లో కొండలపై నుంచి మరో 30 లక్షల క్యూబిక్ మీటర్ల నీరు ఆ సరస్సులోకి వచ్చే అవకాశం ఉందని చైనా వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంత నీటి ఒత్తిడిని ఆ మట్టి కట్ట తట్టుకోలేక తెగిపోతే.. ఆ సరస్సులోని నీరంతా ఒక్కసారిగా కిందకు దూసుకొస్తుంది. అదే జరిగితే దిగువన ఉన్న నేపాల్ గ్రామాలపైకి నీరు రాకాసి అలలా విరుచుకుపడి ఊహించని నష్టం జరుగుతుందని ఆందోళన చెందుతున్నారు.
చైనా విదేశాంగ శాఖ నుంచి ఈ అత్యవసర సమాచారం రాగానే నేపాల్ ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. నేపాల్ వాతావరణ శాఖ అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా భోటేకోషి, త్రిశూలి నదుల ఒడ్డున నివసించే ప్రజలంతా ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా తమ ఇళ్లను వదిలి సురక్షితమైన ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని స్పష్టం చేసింది. అక్కడ ప్రస్తుతం రక్షణ చర్యల్లో ఉన్న సైనిక బృందాలు, సహాయక సిబ్బంది, ప్రయాణికులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పింది. ఇంకోవైపు చైనా అధికారులు కూడా సాటిలైట్ల సహాయంతో ఆ సరస్సును నిమిష నిమిషం గమనిస్తూ, ఏమాత్రం ప్రమాదం అనిపించినా వెంటనే నేపాల్‌కు సమాచారం ఇస్తామని తెలిపారు.
ఇప్పటివరకు 359 మందికి పైగా చనిపోయినట్లు నేపాల్ పోలీసులు అధికారికంగా చెప్పారు. ఒక్క చిత్వాన్ జిల్లాలోనే దాదాపు 132 మృతదేహాలు బయటపడ్డాయి. ఇప్పటికీ వందలాది మంది దొరకకుండా పోయారు. బాధితుల కుటుంబాలు తమ వారి కోసం కన్నీరు మున్నీరవుతున్నారు. ఇలాంటి సమయంలో మళ్లీ కొండల్లో ఏర్పడిన ఈ కొత్త సరస్సు కట్ట తెగుతుందనే ప్రజలు భయపడుతున్నారు.









