
Nepal : నేపాల్‌లో భారీ వరదలు బీభత్సం సృష్టిస్తున్న సమయంలో ఓ బ్యాంక్ ఇనుప పెట్టె వరద నీటిలో కొట్టుకుపోయింది. కొన్ని కిలోమీటర్ల దూరంలో ఆ ఇనుప పెట్టె దొరకడంతో.. స్థానికులు దాన్ని పగలగొట్టి లోపల ఉన్న డబ్బును తీసుకెళ్లినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో 29 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రసువా జిల్లాలోని భోటేకోషి ప్రాంతంలో సెప్టెంబర్ 10న వరదల్లో బ్యాంక్ ఇనుప పెట్టె కొట్టుకుపోయినట్లు సమాచారం.
ఆ తర్వాత అది ధాదింగ్ జిల్లాలోని గల్చీ రూరల్ మున్సిపాలిటీ-4లోని బెల్‌ఖుఖోలా సమీపంలో త్రిశూలి నది ఒడ్డున కనిపించింది. సెప్టెంబర్ 12న కొంతమంది స్థానికులు ఇనుప పెట్టెను పగలగొట్టి అందులో ఉన్న నగదును తీసుకెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
Also Read : కీవ్‌పై రష్యా దాడి.. 27 మంది మృతి!
ప్రాథమిక దర్యాప్తులో 29 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 92,68,505 నేపాలీ రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మొత్తం భారత కరెన్సీలో సుమారు రూ.57 లక్షలు ఉంటుందని సమాచారం. అదుపులోకి తీసుకున్న వారిలో ఎక్కువ మంది గల్చీ-4లోని మస్తార్ ప్రాంతానికి చెందినవారే ఉన్నారు. మరికొందరు గల్చీ-6లోని ఆదమ్‌ఘాట్, సిద్ధలేఖ్-7లోని ఆదమ్‌టార్ ప్రాంతాలకు చెందినవారు. మరికొందరు చిత్వాన్, పర్సా ప్రాంతాలకు చెందినప్పటికీ ప్రస్తుతం ధాదింగ్‌లో నివసిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అదుపులోకి తీసుకున్న వారి వయసు 19 నుంచి 49 ఏళ్ల మధ్య ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న డబ్బు అసలు ఎవరిది, ఈ ఘటనలో ఇంకా ఎవరెవరికి సంబంధం ఉందనే విషయాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. నేపాల్‌లోనే మరో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. నరాయణి నదిలో వరదలకు కొట్టుకుపోయిన ఓ మహిళ మృతదేహం నుంచి బంగారు చెవిపోగులు దొంగిలించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
వరదల్లో కొట్టుకుపోతున్న ఓ మహిళ మృతదేహం నుంచి ఇద్దరు వ్యక్తులు బంగారు చెవిపోగుల్లా కనిపిస్తున్న వస్తువులను తీస్తున్నట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియో ఆధారంగా పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు సమాచారం.
Also Read : నేపాల్‌లో పెను విలయం.. ఐదు నెలల ముందే హెచ్చరించిన ICIMOD









