Wife Attacks Husband : అప్పటివరకు డప్పు చప్పుళ్లతో, వేద మంత్రాలతో ఆనందంగా సాగుతున్న పెళ్లి మండపంలో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య మూడేళ్లుగా కొనసాగుతున్న వివాదం.. చిలికి చిలికి గాలివానగా మారింది. భర్త చెల్లెలి పెళ్లి జరుగుతున్న పెళ్లి మండపానికి చేరుకున్న భార్య బంధువులు భర్త శ్రావణ్ కుమార్‌పై దాడి చేయడంతో పాటు, అతడిని కిడ్నాప్‌ చేసి కారులో తీసుకెళ్లేందుకు ప్రయత్నించడంతో గందరగోళం నెలకొని పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుంది. శ్రావణ్‌ కుమార్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజన్న జిల్లా సిరిసిల్ల పట్టణం బీవై నగర్‌కు చెందిన కస్తూరి శ్రావణ్ కుమార్‌కు మూడేళ్ల క్రితం గోదావరిఖనికి చెందిన ఒడ్నాల సౌమ్య అనే యువతితో వివాహం జరిగింది. అయితే పెళ్లైన కొద్ది నెలలకే భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో సౌమ్య గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో శ్రావణ్ కుమార్‌తో పాటు అతని కుటుంబ సభ్యులపై గృహహింస, వరకట్నం ఆరోపణలతో కేసు పెట్టింది. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది.

Also Read : హైదరాబాద్‌వాసులకు గుడ్‌న్యూస్… అందుబాటులోకి మరో హై లెవల్‌ బ్రిడ్జ్‌..ప్రత్యేకతలెంటంటే?

ఈ నేపథ్యంలో భార్యభర్తలు ఎవరికీ వారు ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. శ్రావణ్ కుమార్ చెల్లెలు కస్తూరి స్వాతి వివాహం పటాన్‌చెరువుకు చెందిన శ్రీకాంత్‌తో నిశ్చయమైంది. పెళ్లి విషయం తెలుసుకుని సౌమ్య కుటుంబ సభ్యులతో మండపానికి వెళ్లింది. ఈ క్రమంలో సిరిసిల్ల శివనగర్‌లోని శివాలయంలో ఈ రోజు ఉదయం పెళ్లి వేడుక కొనసాగుతున్న సమయంలో సౌమ్య, ఆమె తల్లిదండ్రులు, అన్నతో పాటు మరికొందరు అక్కడికి వచ్చారు. శ్రావణ్ కుమార్ తో వారు వాగ్వివాదానికి దిగడంతో పాటు ఆయనను బలవంతంగా బయటకు ఈడ్చుకుపోయారు. అతని గట్టిగా పట్టుకుని దాడి చేయడంతో పాటు సౌమ్యను కాపురానికి ఎందుకు తీసుకెళ్లడం లేదంటూ శ్రావణ్ కుమార్‌తో పాటు అతని బంధువులతో వారు గొడవకు దిగారు. అనంతరం అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేశారు. సౌమ్యను కాపురానికి తీసుకెళ్లకపోతే చంపుతామని బెదిరించడంతో పాటు ఆయనను తమ వెంట తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

కాగా,.. సుమారు 20 మంది వ్యక్తులు ఒక్కసారిగా పెళ్లి మండపానికి చేరుకుని శ్రావణ్ కుమార్‌పై దాడి చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా అతడిని బలవంతంగా కిడ్నప్‌ చేసి కారులో తీసుకెళ్లేందుకు ప్రయత్నించారని, అడ్డుకునేందుకు వచ్చిన మహిళలు, చిన్నారులపైనా కూడా దాడి చేశారని వారు ఆరోపించారు. దీంతో పెళ్లి వేడుకలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అక్కడున్న వారు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. శ్రావణ్ కుమార్‌ను వారి నుంచి రక్షించి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కాగా ఈ ఘటనలో శ్రావణ్‌ కుమార్‌పై దాడికి పాల్పడ్డారనే ఆరోపణలతో నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రావణ్ కుమార్ ఫిర్యాదు మేరకు సిరిసిల్ల పోలీస్ స్టేషన్‌లో పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read : ఎమ్మెల్సీ మీర్జా రహమత్ బేగ్‌ కు మరో షాక్​.. ఎంఐఎం పార్టీ సభ్యత్వం రద్దు ?

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.