Palampet Gollala Gudi : తెలుగు నేలకు కాకతీయులు ఎనలేని గుర్తింపు తీసుకువచ్చారు. వారి పాలన కాలంలో ఈ నేలకు అపూర్వమైన శిల్పకళను, సాగునీటి చెరువుల వ్యవస్థను అందించారు. నేటి తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ,కర్ణాటక, తమిళనాడు, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లోనూ వీరి సామ్రాజ్యం విస్తరించి ఉండేది. వీరు నిర్మించిన ఎన్నో దేవాలయాలు ప్రపంచ ప్రఖ్యాతిగాంచాయి. అందులో రామప్ప దేవాలయం కూడా ఒకటి. ఆ దేవాలయం యునేస్కో గుర్తింపు పొందగా తాజగా దాని సరసన ఇప్పుడు గొల్లల గుడికి జాతీయ గుర్తింపు లభించింది. దీంతో తెలంగాణ ములుగు జిల్లా పరిధిలోని పర్యాటక రంగానికి మరింత గుర్తింపు లభించనుంది. శతబ్దాల చరిత్రను తనలో దాచుకున్న గొల్లల గుడికి ఇప్పుడు జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపునిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.

రామప్పకు చేరువులోనే పాలంపేటలో ఉన్న ‘గొల్లల గుడి’ని జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ పరిధిలోని భారత పురావస్తు అధ్యయన విభాగం (ఏఎస్‌ఐ) జారీ చేసిన గెజిట్ ఆఫ్ ఇండియా (ప్రత్యేక సంచిక) పార్ట్‌- IIలోని సెక్షన్‌ 3 ఉప సెక్షన్‌ (ii) కింద ఈ విషయం ప్రచురితమైంది. ఈ మేరకు ప్రాధాన్యం కలిగిన కట్టడంగా (Monument of National Importance) ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) అధికారికంగా ప్రకటించింది.

“ప్రాచీన కట్టడాలు -పురావస్తు ప్రదేశాలు -అవశేషాల చట్టం-1958” (1958నాటి 24వ చట్టం)లోని సెక్షన్ 4, ఉప-సెక్షన్ (3) కింద సంక్రమించిన అధికారాల మేరకు ‘ఏఎస్‌ఐ’ ఈ ప్రకటన జారీ చేసినట్లు ప్రకటించింది. ములుగు జిల్లా పాలంపేట గ్రామంలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ‘కాకతీయ రుద్రేశ్వర’ (రామప్ప) ఆలయానికి నైరుతి దిశలో ఈ ‘గొల్లల గుడి’ ఉంది. ఇది తూర్పు ముఖంగా గల మండపం, దాని చుట్టూ మూడు గర్భాలయాలతో కూడిన ‘త్రికూటాలయం’గా ఉంటుంది. దీని ప్రహరీ శిల్పాలంకృతమై, పైకప్పు అంచు నిర్మాణం, ద్వారబంధాల వద్ద చెక్కిన హంసల వరుసతో, ‘సునిశిత రంధ్రాల వల’ పనితనంతో ఈ ఆలయం ఎంతో విశిష్టమైనదిగా అలరారుతోంది. అలాంటి ఆలయానికి కేంద్రం గుర్తింపు నివ్వడం విశేషం.

ఇంకా ప్రధాన ఆలయానికి ముందు వైపున రెండు ప్రత్యేక ఉప ఆలయాలు ఎంతో అందంగా చెక్కిన ద్వారపాలకుల విగ్రహాలతో అందంగా అలంకృతమై ఉంటాయి. వీటికి ముందు గల అంతరాలయాల అంచులు కూడా చక్కని తెరలతో శోభాయమానంగా కనిపిస్తుంటాయి. ప్రధాన ఆలయ నిర్మాణం ముందు భాగాన మండపం గుండా మధ్యలో గల ప్రధాన మందిరానికి మార్గం ఉంది. దీనికి ఉత్తర, దక్షిణ, పశ్చిమ దిశలలో అంతరాలయాలతో మూడు గర్భాలయాలు కూడా ఉన్నాయి. ఆలయ కుడ్యాలపై కనిపించే వివిధ గూళ్లలో విష్ణుమూర్తి, లక్ష్మి, గణేశుడు, మహిషాసురమర్దిని విగ్రహాలు దర్శనమిస్తాయి. జంతువుల ఆకారాలు, పుష్పాలంకరణతో కూడిన ఎత్తయిన వేదికపై ఈ ఆలయం నిర్మితమై ఉంది.

కాగా, జాతీయ చిహ్నంగా ఈ దేవాలయాన్ని ప్రకటించిన నేపథ్యంలో ఈ ఆలయ సంరక్షణకు ఏఎస్‌ఐ సమగ్ర కార్యాచరణను రూపొందించనుంది. ఆలయ పైకప్పు మరమ్మతులు, వాటర్‌ప్రూఫింగ్ పనులు చేపడుతారు. చుట్టూ ఉన్న నేలను సమతలం చేయడం, దెబ్బతిన్న రాతి ఫ్లోరింగ్‌ను పునరుద్ధరిస్తారు. పర్యాటకులు, పరిశోధకులు సులభంగా రాకపోకలు సాగించేలా ప్రత్యేక మౌలిక వసతులు కల్పించనున్నారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.