CM Revanth Reddy :  హైదరాబాద్‌ పాతబస్తీ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. నల్గొండ ఎక్స్‌ రోడ్డు నుంచి ఒవైసీ జంక్షన్‌ వరకు నిర్మించిన భారీ స్టీల్‌ ఫ్లైఓవర్‌ను సీఎం ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో సీఎం రేవంత్‌ మాట్లాడారు. సైదాబాద్‌ స్టీల్‌ బ్రిడ్జికి గత ప్రభుత్వం కొబ్బరికాయ కొట్టిందని, కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని సీఎం విమర్శించారు. తాను సీఎం అయ్యాక అక్బర్‌, అసదుద్దీన్‌తో పాతబస్తీ అభివృద్ధిపై చర్చించానని చెప్పారు. ఇన్నేళ్లలో ఎంతమంది సీఎంలు పాతబస్తీకి వచ్చారని ప్రశ్నించారు. పాతబస్తీ గల్లీల్లోకి తానే వచ్చానని రేవంత్‌ అన్నారు.

పాతబస్తీ అభివృద్ధికి సంబంధించి అసదుద్దీన్‌ ఒవైసీ ఏం చెప్పినా వెంటనే పరిశీలించి మంజూరు చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశిస్తున్నట్లు సీఎం తెలిపారు. చదువు కోసం ప్రభుత్వం ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకాడదని రేవంత్‌ అన్నారు. చదువుకుంటేనే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని చెప్పారు. పాతబస్తీ నుంచి సోదరీమణులు లాయర్లు, ఇంజినీర్లు, డాక్టర్లు కావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

అసదుద్దీన్‌, ఎంఐఎం దేశానికి వ్యతిరేకమంటూ కొందరు ప్రచారం చేశారని రేవంత్‌ అన్నారు. దేశభక్తి విషయంలో అసదుద్దీన్‌ ఎక్కడా తక్కువ కాదని, అమిత్‌ షా, మోదీకి కూడా ఆయన దేశభక్తిలో తీసిపోరని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ అభివృద్ధి కోసం ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే విపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని సీఎం ఆరోపించారు. నగరంలో లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం తమ లక్ష్యమని చెప్పారు.

గంగా, యమున రివర్‌ ఫ్రంట్‌కు బీజేపీ, బీఆర్‌ఎస్‌ మద్దతు ఇచ్చాయని.. అదే మూసీ రివర్‌ ఫ్రంట్‌ విషయంలో మాత్రం విమర్శలు చేస్తున్నాయని రేవంత్‌ అన్నారు. ఈ సందర్భంగా తనను ఎవరూ బెదిరించవద్దని సీఎం స్పష్టం చేశారు. బెదిరిస్తే భయపడను. స్నేహంతోనే నన్ను గెలవగలరు. నేను ఎవరికీ గులామ్‌ను కాదు.. దోస్తీకి మాత్రమే గులామ్‌ను అని అన్నారు. ఎన్నికలు వస్తుంటాయని, పోతుంటాయని.. గెలుపోటములు సహజమేనని చెప్పారు.

మరోవైపు అసదుద్దీన్‌ ఒవైసీ కూడా హైదరాబాద్‌ అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తామని తెలిపారు. సీఎం రేవంత్‌ నాయకత్వంలో తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. రేవంత్‌ పనితీరును చూసే కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నామని చెప్పిన అసదుద్దీన్‌.. సీఎం తనదైన పద్ధతిలో పాలన కొనసాగించాలని అన్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.