CM Revanth Reddy : శాసనసభ స్పీకర్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. స్పీకర్‌పై అసభ్య పదజాలం ఉపయోగించడం దుర్మార్గమని మండిపడ్డారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 80 ఏళ్లలో ఎవరూ స్పీకర్‌పై ఇలాంటి భాష ఉపయోగించలేదని అన్నారు. స్పీకర్‌ను అవమానించేలా మాట్లాడిన తాతా మధుపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ భాషను ఉపయోగించినందుకు బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ క్షమాపణ చెప్పాలని కోరారు. తాతా మధును వెంటనే పార్టీ నుంచి డిస్మిస్ చేయాలని, లేదంటే శాసనమండలి చైర్మన్ ఆ సభ్యుడిపై చర్యలు తీసుకుని బర్తరఫ్ చేయాలని కోరుతున్నట్లు తెలిపారు.

బీజేపీ తన చీకటి మిత్రులను కాపాడుతోందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ముందుగా సభకు జరిగిన అవమానంపై చర్చ జరగాలని, ఆ తర్వాత మిగతా సమస్యలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. తాతా మధు వ్యాఖ్యలు దళితులు, గిరిజనులకే కాకుండా సభ్య సమాజానికే ఘోర అవమానమని సీఎం వ్యాఖ్యానించారు.

గతం ప్రభుత్వంలో దళితులు, గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ ఆరోపించారు. ఎలాంటి కారణం లేకుండా దళిత మంత్రిని బర్తరఫ్ చేశారని, దళితుడిని సీఎం చేస్తామని ఇచ్చిన హామీని కూడా తుంగలో తొక్కారని విమర్శించారు. గిరిజనుల చేతులకు బేడీలు వేసిన ఘటనలు కూడా ఉన్నాయని గుర్తుచేశారు.

తమ ప్రభుత్వం కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం సంయమనం పాటిస్తుందని, దాన్ని చేతగానితనంగా భావించవద్దని సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. స్పీకర్‌పై తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. తాతా మధుపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. దీంతో స్పీకర్‌పై వ్యాఖ్యల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడిని పెంచింది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.