
Donald Trump : ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. నవంబర్‌లో జరిగే అమెరికా మధ్యంతర ఎన్నికలు ముగిసిన వెంటనే ఇరాన్‌తో యుద్ధం వెంటనే ముగిసిపోతుందని అంచనా వేశారు. అమెరికా ఆర్థిక ఒత్తిడిని ఇరాన్ ఇక ఎక్కువ కాలం తట్టుకోలేదని, అందుకే ఎన్నికలపై ప్రభావం చూపేందుకు ప్రయత్నిస్తోందని ట్రంప్ అన్నారు. డల్లాస్‌లో జరిగే రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌కు బయలుదేరే ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడారు.
ఇరాన్‌తో ట్రంప్ ప్రారంభించిన యుద్ధం ఇప్పటికే ఏడో నెలలోకి ప్రవేశించింది. అయితే ఇప్పటివరకు యుద్ధం ముగిసే పరిస్థితులు కనిపించడం లేదు. సెప్టెంబర్ 9న హోర్ముజ్ జలసంధి సమీపంలో ఇరాన్ 10 నౌకలపై దాడి చేసినట్లు ప్రకటించింది. అంతకుముందు అమెరికా ఐదు ఇరాన్ చమురు ట్యాంకర్లను ముంచింది. దీంతో ఇరాన్-అమెరికా మధ్య పోరు మరోసారి తీవ్రరూపం దాల్చింది.
Also Read : షేక్ హసీనా కుమార్తె సంచలన నిర్ణయం.. WHO పదవికి రాజీనామా!
ఈ పరిణామాల ప్రభావం చమురు ధరలపై కూడా పడింది. అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లకు పైగా చేరింది. జులై తర్వాత తొలిసారిగా ఈ స్థాయికి చమురు ధర చేరింది.
ఇదిలా ఉంటే ఇరాన్‌తో యుద్ధం, పెరుగుతున్న జీవన వ్యయంపై అమెరికా ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోంది. దీంతో ట్రంప్ ఆమోద రేటింగ్ కూడా ఇటీవల రికార్డు స్థాయిలో పడిపోయింది. నవంబర్ 3న అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. సాధారణంగా ఈ ఎన్నికలు అధికారంలో ఉన్న అధ్యక్షుడి పాలనపై ప్రజల అభిప్రాయానికి ఒక పరీక్షగా భావిస్తారు.
ఎన్నికల తర్వాత యుద్ధం ముగిస్తే చమురు ధరలు కూడా వెంటనే తగ్గిపోతాయని ట్రంప్ చెప్పారు. అయితే ఇరాన్‌తో చర్చలకు అవకాశం ఉందని అంగీకరించినప్పటికీ, ప్రస్తుతం తాము చర్చల వైపు చూడటం లేదని స్పష్టం చేశారు. చర్చలు జరిగే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం మేము దానిని పరిశీలించడం లేదు అని ట్రంప్ తెలిపారు.









