
US General Election : అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటు వేసేందుకు తాను అమెరికా పౌరుడినంటూ తప్పుడు సమాచారం ఇచ్చిన భారతీయుడిపై కేసు నమోదైంది. 2024లో జరిగిన అమెరికా సాధారణ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తాను అమెరికన్ పౌరుడినని చెప్పి మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. భారత్‌కు చెందిన ముకేశ్‌కుమార్ సోమాభాయ్ చౌదరిపై ఈ కేసు నమోదైంది. అమెరికా పౌరుడు కాకపోయినప్పటికీ.. 2024 నవంబర్ 5న జరిగిన సాధారణ ఎన్నికల్లో ఓటు వేసేందుకు తాను అమెరికా పౌరుడినని చెప్పినట్లు అధికారులు ఆరోపించారు.
ఈ కేసులో మిన్నెసోటా జిల్లాకు చెందిన ఫెడరల్ గ్రాండ్ జ్యూరీ గురువారం రెండు అభియోగాలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఈ విషయాన్ని అమెరికా న్యాయశాఖ వెల్లడించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. 2024 నవంబర్ 5న ఎన్నికల్లో ఓటు వేసే సమయంలో చౌదరి మిన్నెసోటా చట్టం ప్రకారం అవసరమైన ఓటర్ సంతకం పత్రంపై సంతకం చేశాడు. ఆ పత్రంలో తాను అమెరికా పౌరుడినని ప్రమాణం చేయాలి.
Also Read : హెచ్1బీ వీసాదారులకు ట్రంప్ బిగ్ షాక్.. ఉద్యోగం పోతే అంతే సంగతులు.. అమెరికాకు ప్యాకప్ చెప్పాల్సిందే!
అయితే చౌదరి అమెరికా పౌరుడు కాదని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ తాను అమెరికా పౌరుడినని తెలిసే తప్పుడు ప్రకటన చేసి ఓటు వేసినట్లు అభియోగాలు నమోదయ్యాయి. ఈ వ్యవహారంపై అమెరికా న్యాయశాఖ సివిల్ రైట్స్ డివిజన్ అసిస్టెంట్ అటార్నీ జనరల్ హర్మీత్ కె. ధిల్లాన్ స్పందించారు. అమెరికా పౌరుడిగా ఓటు హక్కు చాలా ముఖ్యమైనదని ఆమె అన్నారు. అర్హత ఉన్న ప్రతి ఓటరు ఓటు హక్కు సురక్షితంగా ఉండేలా ఎన్నికల వ్యవస్థ ఉండాలని పేర్కొన్నారు.
ఓటు వేసేందుకు కావాలనే తప్పుడు పౌరసత్వ వివరాలు ఇచ్చే వారిపై చర్యలు తీసుకుంటామని ధిల్లాన్ స్పష్టం చేశారు. అర్హత ఉన్న అమెరికా పౌరులు మాత్రమే ఓటు వేసేలా చూడటం, వారి ఓట్లు సరిగ్గా లెక్కించేలా చేయడం ఎన్నికల వ్యవస్థకు చాలా ముఖ్యమని చెప్పారు. చౌదరిపై రెండు అభియోగాలు నమోదయ్యాయి. తప్పుడు సమాచారం ఇవ్వడం ఒకటి కాగా.. ఓటు నమోదు చేసుకునేందుకు, ఓటు వేసేందుకు తాను అమెరికా పౌరుడినని తప్పుడు ప్రకటన చేయడం మరో అభియోగం. ఈ రెండు కేసుల్లోనూ నేరం రుజువైతే ఒక్కో అభియోగానికి గరిష్ఠంగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
Also Read : కార్గో నౌకలో అగ్నిప్రమాదం.. 20 మంది మృతి









