CM Revanth Reddy : చదువు ఒక్కటే మన జీవితాలను మార్చగలదని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. పేదలు, వెనుకబడిన వర్గాలు ఉన్నత స్థాయికి ఎదగాలంటే విద్య చాలా ముఖ్యమని చెప్పారు. విద్యతో పాటు విద్యార్థులకు అవసరమైన నైపుణ్యాలను కూడా నేర్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచం వేగంగా మారుతున్న నేపథ్యంలో మన విద్యా విధానంలోనూ మార్పులు రావాలని పేర్కొన్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ మాట్లాడారు.

తెలంగాణలో విద్య, సాగునీటి రంగాలకు తమ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇస్తోందని సీఎం చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు పూర్తయిన తర్వాత ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించి విద్యా విధానంపై వారి అభిప్రాయాలు తీసుకుంటామని తెలిపారు. గతంలో అవకాశాలు ఒక పరిమిత ప్రాంతం వరకే ఉండేవని రేవంత్‌రెడ్డి అన్నారు. అప్పట్లో జోనల్‌ వ్యవస్థ వరకు మాత్రమే పోటీ ఉండేదని చెప్పారు. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, ప్రపంచంతోనే పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అందుకే విద్యార్థులకు పుస్తకాల చదువుతో పాటు సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యాలు కూడా అందించాలని చెప్పారు. ప్రపంచంలో వస్తున్న మార్పులకు తగ్గట్టుగా తెలంగాణ విద్యా విధానాన్ని మార్చాల్సిన అవసరం ఉందన్నారు.

Also Read : బడా గణేశ్‌ దర్శనానికి వెళ్తున్నారా?.. ఈ రూట్లలో ట్రాఫిక్‌ బంద్‌!

తెలంగాణలో తొలిసారిగా విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి విద్యా కమిషన్‌ లేదన్నారు. రాష్ట్రానికి మంచి విద్యా విధానం తీసుకురావడమే ఈ కమిషన్‌ లక్ష్యమని చెప్పారు. విద్యా రంగంలో ఉన్న సమస్యలు, లోటుపాట్లను గుర్తించి వాటిని సరిచేయాలని సూచించారు. అన్ని వర్గాల నుంచి సలహాలు, సూచనలు తీసుకుని తెలంగాణకు అత్యుత్తమ విద్యా విధానాన్ని రూపొందిస్తామని తెలిపారు.

విద్యాశాఖకు ప్రభుత్వం ప్రతి ఏడాది బడ్జెట్‌ కేటాయింపులు పెంచుతోందని రేవంత్‌రెడ్డి తెలిపారు. 2023-24లో విద్యాశాఖకు 6.53 శాతం నిధులు కేటాయించామని చెప్పారు. 2024-25లో విద్యకు 7 శాతానికి పైగా, 2025-26లో 8 శాతానికి పైగా ఖర్చు చేశామని వివరించారు. 2025-26లో విద్యాశాఖకు రూ.23,729 కోట్లు కేటాయించామని, 2026-27లో ఈ మొత్తాన్ని రూ.27,663 కోట్లకు పెంచామని తెలిపారు. భవిష్యత్‌లో రాష్ట్ర బడ్జెట్‌లో విద్యాశాఖకు 15 శాతం నిధులు కేటాయించాలన్నది తన లక్ష్యమని సీఎం చెప్పారు. గత మూడేళ్లలో విద్యాశాఖ కోసం అదనంగా రూ.7,554 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. 2023-24లో అప్పటి బీఆర్ఎస్‌ ప్రభుత్వం విద్యకు రూ.18,955 కోట్లు కేటాయించిందని.. తమ ప్రభుత్వం 2025-26లో రూ.23,729 కోట్లు, 2026-27లో రూ.27,663 కోట్లు కేటాయించిందని వివరించారు.

విద్యాశాఖపై తనకు ఉన్న ఆసక్తి కారణంగానే ఆ శాఖను తన దగ్గరే ఉంచుకున్నానని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. విద్యాశాఖపై తాను సమీక్ష నిర్వహిస్తే విద్యాశాఖ మంత్రి సమీక్ష అని కాకుండా ‘సీఎం సమీక్ష’ అని అంటున్నారని చెప్పారు. పూర్తిస్థాయి విద్యాశాఖ మంత్రి లేరని కొందరు విమర్శిస్తున్నారని.. అయితే విద్యాశాఖపై తానే ప్రత్యేకంగా దృష్టి పెట్టి పనిచేస్తున్నానని తెలిపారు. పేదలకు మంచి విద్య అందించాలనే ఉద్దేశంతోనే విద్యాశాఖను తన వద్ద ఉంచుకున్నానని స్పష్టం చేశారు.

తెలంగాణలో మొత్తం 24,966 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని సీఎం తెలిపారు. వీటిలో 19,79,614 మంది విద్యార్థులు, 1,24,456 మంది ఉపాధ్యాయులు ఉన్నారని వివరించారు. అలాగే రాష్ట్రంలో 444 ప్రభుత్వ ఇంటర్మీడియట్‌ కళాశాలలు ఉన్నాయని చెప్పారు. వీటిలో సుమారు 1.95 లక్షల మంది విద్యార్థులు, 6,359 మంది లెక్చరర్లు ఉన్నారని తెలిపారు.

Also Read : సీఎంకు నాకు ఉన్నది అభిప్రాయభేదాలు మాత్రమే… రాజగోపాల్‌ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.