MLA Konda Surekha : తెలంగాణ అధికార కాంగ్రెస్‌ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌ కు గురైన మాజీమంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. ఆమెను వెంటనే ఢిల్లీకి రావాలని పార్టీ పెద్దలు పిలిచినట్లు ప్రచారం సాగుతోంది. మంత్రి పదవి కోల్పోయిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్ర స్థాయిలో ఫైర్‌ అయిన సురేఖ ఆ తర్వాత సైలెన్స్‌గానే ఉన్నారు. అయితే కొండా సురేఖను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేసినప్పటికీ ఆమెను వదులుకోవడం ఇష్టం లేని పార్టీ పెద్దలు నిన్న తెలంగాణ పార్టీ వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్ ను సురేఖతో మాట్లాడించినట్లు తెలుస్తోంది. స్వయంగా మీనాక్షి మాట్టాడడమే కాకుండా సురేఖకు కేబినెట్‌ స్థాయి పదవి ఇచ్చే విషయమై చర్చించినట్లు తెలుస్తోంది. దీంతో సురేఖకు త్వరలోనే కీలక పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : చదువు ఒక్కటే మన తలరాతను మార్చగలదు.. సీఎం రేవంత్‌ కీలక వ్యాఖ్యలు!

కాగా, ఇటీవల వరంగల్ జిల్లా గీసుకొండలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండా సురేఖ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె కుమార్తె సుస్మిత పటేల్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డితోపాటు పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్‌ రెడ్డి ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాక పరకాల అసెంబ్లీ స్థానం తనదేనని స్పష్టం చేశారు. ఆ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీలో తీవ్ర విమర్శలు చెలరేగాయి. దాంతో పార్టీ క్రమశిక్షణ కమిటీ కొండా సురేఖను వివరణ కోరింది. ఈ సందర్భంగా కమిటీకి ఆమె రెండు లేఖలు రాశారు. అందులో తన కూతురు చేసిన వ్యాఖ్యలకు తనకు ఎలాంటి సంబంధం లేదని సురేఖ పేర్కొన్నారు.

అయితే ఆమె వివరణతో సంతృప్తి చెందని క్రమశిక్షణ కమిటీ విచారణ జరిపి పీసీసీ చీఫ్‌కు నివేదిక అందించింది. ఈ నివేదికను తెలంగాణ పీసీసీ చీఫ్ పార్టీ అధిష్ఠానానికి అందజేశారు. ఈ నివేదిక ఆధారంగా అధిష్టానం ఆమెపై చర్యలు తీసుకుంది. అందులో భాగంగా ఆమెను మంత్రి పదవి నుంచి బర్త్‌రఫ్ చేశారు. అయితే తాను పార్టీ మారబోనని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యేగానే కొనసాగుతానని స్పష్టం చేశారు. నిత్యం ప్రజల మధ్య ఉంటానని కూడా స్పష్టం చేశారు. ఈ క్రమంలో అధిష్టానం ఆమెను పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇదిలా ఉండగానే ఫేస్‌బుక్‌ వేదికగా ‘బిగ్‌ అప్డేట్ కమింగ్ సూన్’ అంటూ ఆమె పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారటం గమనార్హం. అయితే ఆ పోస్టుతో తనకు సంబంధం లేదని కొండా సురేఖ ఇప్పటికే వివరణ ఇచ్చినీ సంగతి తెలిసిందే. ఈ సమయంలో కొండా సురేఖను పార్టీ అధిష్ఠానం ఢిల్లీ రావాలంటూ పిలవడం వెనుక ఏదో బలమైన కారణం ఉండి ఉంటుందనే ఓ ప్రచారం సాగుతోంది. ఆమెకు కీలక పదవి ఇచ్చి పార్టీ మారే ఆలోచన నుంచి డైవర్ట్‌ చేయాలనే ఉద్దేశంతోనే ఆమెను పిలిపించి ఉంటారని ఆమె అభిమానులు అంటున్నారు.

Also Read : భారత్ ఆతిథ్యంలో బ్రిక్స్‌ సమ్మిట్‌.. ఆ అంశాలపైనే ప్రధాన చర్చ..

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.