SIIMA Awards 2026 : బెంగళూరులో సైమా అవార్డ్స్‌-2026 వేడుక గ్రాండ్‌గా జరుగుతోంది. కోరమంగళ ఇండోర్‌ స్టేడియంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి దక్షిణాది సినిమా తారలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. రెండు రోజుల పాటు జరిగే ఈ వేడుకలో తెలుగు, కన్నడ సినిమాల్లో మంచి నటన కనబరిచిన నటీనటులు, ఇతర విభాగాల్లో ప్రతిభ చూపిన వారికి అవార్డులు అందిస్తున్నారు. ఈసారి సైమా వేడుక సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో జరుగుతోంది.

తెలుగు సినిమాల విషయానికి వస్తే మిరాయ్‌ సినిమాతో తేజ సజ్జా ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. 2025లో విడుదలైన సినిమాల కోసం జరిగిన ఈ అవార్డుల పోటీలో మిరాయ్‌ 11 విభాగాల్లో నామినేషన్లు సాధించి ముందంజలో నిలిచింది. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో తన నటనతో ఆకట్టుకున్న ఐశ్వర్య రాజేశ్‌ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. ఇదే సినిమాకు చెందిన బుల్లిరాజు పాత్రలో నటించిన భీమల రేవంత్‌ ఉత్తమ హాస్య నటుడి అవార్డును సొంతం చేసుకున్నారు.

Also Read : శివాజీ నటుడు కన్నుమూత… రజినీకాంత్ సంతాపం!

సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు మరో అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమాలోని పాటలకు రమణ గోగుల అందించిన గానం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆయన ఉత్తమ నేపథ్య గాయకుడి అవార్డును అందుకున్నారు. కోర్టు సినిమాకు కూడా అవార్డు దక్కింది. ఈ సినిమాలోని పాటకు గాను సమీరా భరద్వాజ్‌ ఉత్తమ నేపథ్య గాయని అవార్డును అందుకున్నారు. ఇక కొత్త నటిగా సాక్షి మడోల్కర్‌ అవార్డు అందుకున్నారు. మోగ్లీ సినిమాలో ఆమె నటనకు ఈ అవార్డు దక్కింది.

కన్నడ సినిమా నుంచి రిషబ్‌ శెట్టి మరోసారి సైమా వేదికపై సత్తా చాటారు. కాంతార: చాప్టర్‌ 1 సినిమాలో నటనకు గాను ఆయన ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి కలిగించగా, ఇప్పుడు అవార్డుల్లోనూ తన ప్రభావాన్ని చూపిస్తోంది. ఈసారి సైమా అవార్డుల పోటీలో తెలుగు సినిమాల్లో మిరాయ్‌ 11 నామినేషన్లతో మొదటి స్థానంలో ఉండగా, సంక్రాంతికి వస్తున్నాం 10 నామినేషన్లతో తర్వాతి స్థానంలో నిలిచింది. తండేల్‌, కోర్టు సినిమాలు చెరో 9 నామినేషన్లతో పోటీలో నిలిచాయి.

Also Read : ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’ మూవీ రివ్యూ.. ఆనంద్, వైష్ణవిల న్యూ ఏజ్ లవ్ డ్రామాతో మెప్పించారా?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.