Indonesian Ship : ఇండోనేషియాలో భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉందన్న ఆందోళన నెలకొంది. 241 మంది ప్రయాణికులు, సిబ్బందితో వెళ్తున్న ఓ ప్యాసింజర్‌ షిప్‌ జావా సముద్రంలో కనిపించకుండా పోయింది. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఆ నౌకతో సంబంధాలు తెగిపోయినట్లు అధికారులు తెలిపారు. విర్గో ట్రాన్స్‌పోర్ట్‌ 8 అనే ఈ నౌక తూర్పు జావా ప్రావిన్స్‌లోని సురబయా నుంచి సౌత్‌ కాలిమంతన్‌ ప్రావిన్స్‌లోని బంజర్మసిన్‌ వైపు వెళ్తోంది. శనివారం ఉదయం 10.13 గంటలకు సురబయా నుంచి బయలుదేరినట్లు నౌక నిర్వాహక సంస్థ తెలిపింది.

Also Read : ఇరాన్ సుప్రీం లీడర్ మోజ్తాబా ఖమేనీ బతికే ఉన్నాడు.. మసూద్ పెజెష్కియన్‌

నౌకలోని 241 మంది ప్రయాణికులు, సిబ్బందితో సంబంధాలు తెగిపోయిన విషయం ఆలస్యంగా అధికారులకు తెలిసింది. నౌకకు చెందిన వారు చెడు వాతావరణంలో చిక్కుకున్నట్లు సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నౌక చివరిసారిగా జావా సముద్రంలో బంజర్మసిన్‌లోని ఓ నౌకాశ్రయానికి సుమారు 148 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే సహాయక చర్యలు ప్రారంభించిన అధికారులు.. నౌక చివరిసారిగా కనిపించిన ప్రాంతానికి రెస్క్యూ బోట్‌ను పంపించారు.

అదే సమయంలో బంజర్మసిన్‌లోని బసిరిహ్‌ సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ కేంద్రానికి కూడా ప్రత్యేక బృందాన్ని పంపించారు. నౌకలో పెద్ద సంఖ్యలో ప్రయాణికులు, సిబ్బంది ఉండటంతో అందుబాటులో ఉన్న అన్ని రెస్క్యూ బృందాలు, వనరులను రంగంలోకి దింపుతున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం సముద్రంలో వాతావరణ పరిస్థితులను కూడా అధికారులు నిశితంగా గమనిస్తున్నారు. నౌక కోసం సముద్ర, ఇతర సంబంధిత శాఖలతో కలిసి గాలింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు.

Also Read : రాత్రికి రాత్రే ఎండిపోయిన సముద్రం.. అసలు నిజం ఏంటో తెలుసా?

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.