
Ganesh Chaturthi 2026 : రేపే వినాయక చవితి.. ప్రతి ఇంట్లో గణపయ్యను కొలిచేందుకు భక్తులు సిద్ధమవుతున్నారు. వినాయకుడిని ఇంట్లో ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే విగ్రహ ప్రతిష్ఠాపన, పూజకు సరైన సమయం ఎప్పుడా అనే ఆసక్తి చాలామందిలో ఉంటుంది. పండితుల సూచనల ప్రకారం 2026 సెప్టెంబర్ 14వ తేదీన ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల మధ్య వినాయక పూజ, విగ్రహ ప్రతిష్ఠాపనకు శుభ సమయంగా చెబుతున్నారు.
ఈ సమయంలో గణపయ్యను ఇంట్లో ప్రతిష్ఠించి భక్తిశ్రద్ధలతో పూజ చేసుకోవచ్చు. పూజ సమయంలో వినాయకుడికి ఇష్టమైన పూలు, పత్రి, పండ్లు, ఉండ్రాళ్లు, కుడుములు వంటి నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు. తమ కుటుంబ ఆచారాలు, సంప్రదాయాలను బట్టి పూజా విధానాన్ని పాటించవచ్చు. ఇక వినాయకుడిని ఎన్ని రోజులు పూజించాలనే విషయంలో కూడా భక్తులకు వెసులుబాటు ఉంది. తమ ఆచారాలు, సౌకర్యాన్ని బట్టి 1, 3, 5, 7 లేదా 9 రోజులు గణపయ్యను పూజించి అనంతరం నిమజ్జనం చేసుకోవచ్చు. ఏన్ని రోజులు పూజ చేసినా భక్తితో, శ్రద్ధతో గణపయ్యను కొలవడమే ముఖ్యమని పండితులు చెబుతున్నారు.
మొత్తంగా రేపు వినాయక చవితి సందర్భంగా ప్రతి ఇంటా గణపయ్య నామస్మరణతో పండుగ వాతావరణం కనిపించనుంది. ఉదయం నుంచే పూజా కార్యక్రమాలకు సిద్ధమవుతున్న భక్తులు, ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల మధ్య విగ్రహ ప్రతిష్ఠాపన, పూజ చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ తప్పులు చేయకండి..
పూజకు ముందు ఇల్లు, పూజ చేసే ప్రదేశాన్ని శుభ్రంగా ఉంచకపోవడం మంచిది కాదు. గణపయ్యను ప్రతిష్ఠించిన తర్వాత పూజ, నైవేద్యం లేకుండా వదిలేయకూడదు. పూజలో నైవేద్యం, పూజా సామగ్రి విషయంలో మీ ఇంటి ఆచారాలను పాటించాలి. వినాయకుడికి తులసి ఆకులు సమర్పించకూడదని సంప్రదాయంగా చెబుతారు. పూజ సమయంలో అశ్రద్ధగా, తొందరగా కార్యక్రమాన్ని ముగించకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవడం మంచిది. ఇంట్లో వినాయకుడిని ప్రతిష్ఠించిన తర్వాత కుటుంబ ఆచారం ప్రకారం నిర్ణయించిన రోజులు పూజ చేసి నిమజ్జనం చేయాలి.
వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే అపవాదాలు, నిందలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని పురాణ విశ్వాసం. అందుకే ఈ రోజున చంద్రుడిని చూడకుండా ఉండాలని పెద్దలు చెబుతారు. పొరపాటున చంద్రుడిని చూసినట్లయితే కొన్ని సంప్రదాయాల్లో శమంతక మణి కథను చదవడం లేదా వినడం పరిహారంగా చెబుతారు.









