
Konda Couples : తాను ఎంపీపీ స్థాయి నుంచి మంత్రివరకు ఎదిగానని, పదవులు తమకు కొత్తకాదని కొండా దంపతులు అన్నారు. తనను మంత్రి పదవి నుంచి తొలగించినందుకు ఎలాంటి బాధ లేదన్న కొండా సురేఖ, అకారణంగా తొలగించడం బాధ కలిగిస్తోందని అన్నారు. పదవులు కాదు.. ప్రజల్లో చిరస్థాయిగా ఉండటమే లక్ష్యమని చెప్పారు. మంత్రిగా బర్తరఫ్ అయిన తర్వాత వరంగల్‌లో కాంగ్రెస్ కార్యకర్తలతో తొలిసారిగా కొండా సురేఖ దంపతులు సమావేశమవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా సురేఖ మాట్లాడుతూ.. ప్రస్తుతం అవకాశవాద రాజకీయాలు ఎక్కువయ్యాయని వ్యాఖ్యానించారు. తన బర్తరఫ్ తర్వాత అల్లర్లు చేయాలా అని కొందరు మాకు ఫోన్ చేశారన్నారు. కానీ, అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని వారికి చెప్పానని. మా నిర్ణయానికి కట్టుబడి ఉన్నందుకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు కొండా దంపతులు. కార్యకర్తలే తమ బలం, బలహీనత అని కొండా మురళి స్పష్టం చేశారు. వాళ్ళ కోసం ఏమైనా చేస్తానని అన్నారు. అవసరం అయితే వాళ్ళ కోసం మరో 10 ఎకరాలు అమ్ముతానని తెలిపారు. బీసీల కోసం ముందుకు వచ్చే నాయకులే లేరని అన్నారు. పార్టీలో ఉండి పార్టీకి వెన్నుపోటు పొడవద్దని ఆయన సూచించారు. కొండా మురళి కబ్జాలు చేసినట్టు నిరూపిస్తే రాజకీయాల నుండి బయటకు వెళ్తా అని ఛాలెంజ్ చేశారు.
కొందరు ఉదయం ఒకపార్టీలో ఉండి.. మధ్యాహ్నం మరో పార్టీలోకి వెళ్తున్నారు. మేం నమ్మిన రాజశేఖర్‌రెడ్డి కోసం గతంలో మంత్రి పదవికి రాజీనామా చేశానని కొండా సురేఖ గుర్తు చేశారు. కొందరు వార్డు మెంబర్‌గా కూడా రాజీనామా చేయరని ఎద్దేవా చేశారు. గతంలో కొందరు గుంటనక్కలు మాకు టికెట్ రాకుండా చేశారు. కాంగ్రెస్‌లో టికెట్ రాకపోతే.. కేసీఆర్ పిలిచి వరంగల్ ఈస్ట్ టికెట్ ఇచ్చారు. కేసీఆర్ టికెట్ ఇచ్చినందుకు నాడు మంత్రిగా ఉన్న వ్యక్తిని ఓడించామని తేల్చి చెప్పారు. వరంగల్ ఈస్ట్‌లో మేం గెలిచినందునే ప్రజలు ప్రశాంత జీవితం గడిపారని. కొండా మురళి ఉన్నారనే ధైర్యంతో ఉండేవారన్నారు. రేవంత్‌రెడ్డి రైతుల కోసం పాదయాత్ర చేశారు. రేవంతన్నా.. నీలాంటి మాస్ లీడర్ కాంగ్రెస్‌కు అవసరమని చెప్పిన మొదటి వ్యక్తిని నేను అని సురేఖ అన్నారు. అదృష్టవశాత్తు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. నాకు మంత్రి పదవి వచ్చింది. పదవి అనేది అలంకారమే.. పదవి లేకున్నా పనులు చేయొచ్చు. మంత్రి పదవి పోయిందని ఇంట్లో కూర్చోం. ప్రజల్లోనే ఉంటాం. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో అన్ని సీట్లూ గెలుస్తాం’’ అని సురేఖ తేల్చి చెప్పారు.
గతంలో ఒక నాయకుడిని నమ్ముకుంటే ఆ బంధం అలా కొనసాగేదని.. ఇప్పుడు అవకాశవాద రాజకీయం పెరిగిపోయిందని కొండా సురేఖ ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కొండా ఫ్యామిలీకి గుర్తింపు ఉందన్నారు. వైఎస్ జగన్ కోసం క్షణం ఆలోచించకుండా మంత్రి పదవికి రాజీనామా చేశానని తెలిపారు. వైఎస్ ఉన్నన్నాళ్లు తమను కంటికిరెప్పలా కాపాడారని గుర్తు చేసుకున్నారు. తనపై ఢిల్లీ (Delhi)కి ఫిర్యాదులు ఇచ్చేవాళ్లు ఉన్నారని వైఎస్ అనేవారని, ఆయన చనిపోయాక పార్టీలోని కొందరు తమను టార్గెట్ చేశారని ఆరోపించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే వాళ్ళకే టికెట్లు ఇస్తామన్నారు. మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో 24మంది కార్పొరేటర్ లను గెలిపిస్తానని శపథం చేశారు. వరంగల్ తూర్పు బాధ్యతలు నవీన్ రాజుకు అప్పగిస్తున్నానని ఈ సందర్భంగా తెలిపారు. కాగా, ఈ సమావేశానికి కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై దంపతులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మళ్ళీ కొండా సురేఖకు మంత్రి పదవి ఇవ్వాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా కొండా దంపతులు ఇకపై కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని స్పష్టం చేశారు.









