Rahul Gandhi: ఢిల్లీలో గత రెండు రోజులుగా సాగుతున్న 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఏర్పాటుచేసిన విందు కార్యక్రమం రాజకీయ చర్చకు దారితీసింది. బ్రిక్స్‌ సదస్సులో పాల్గొన్న వివిధ దేశాల అతిథులకు ప్రధాని నరేంద్ర మోదీ ఏర్పాటు చేసిన విందులో పూర్తిగా శాకాహారమే వడ్డించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్‌ అయ్యారు. మన దేశంలో పెద్ద సంఖ్యలో ప్రజలు మాంసాహారం తీసుకుంటారని ప్రస్తావించిన ఆయన.. భారతీయ నాన్‌వెజిటేరియన్ వంటకాలకూ అంతర్జాతీయ వేదికపై చోటు దక్కకపోవడం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. ’80 శాతం మంది భారతీయులు మాంసాహారులు. భారతీయ నాన్‌వెజ్ వంటకాలు రుచిగా ఉంటాయి. అలాగే నా సోదరి చోలే భటూరే కూడా’ అంటూ తన వ్యాఖ్యకు సరదా టచ్ ఇస్తూ చోలే భటూరేను ప్రస్తావించారు రాహుల్ గాంధీ. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో ఈ డిన్నర్ మెనూపై రాజకీయంగా మాటల యుద్ధం స్టార్టయింది.

ఈ సందర్భంగా ఆయన చోటే భటూరే ఫోటోను కూడా షేర్ చేశారు. రాహుల్ వ్యాఖ్యలకు మరో కాంగ్రెస్ నేత పవన్ ఖేరా కూడా మద్దతు తెలిపారు. భారతదేశంలోని వంటకాల వైవిధ్యంలో ప్రపంచ స్థాయి మాంసాహార వంటకాలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు. అలాంటి వంటకాలను విదేశీ నేతలకు ఎందుకు పరిచయం చేయలేదని ఆయన ప్రశ్నించారు. భారతీయులపై బీజేపీ తన ఆహారపు అభిరుచుల్ని రుద్దుతోందని ఆరోపించారు. ఇప్పుడు విదేశీ నేతలు, అతిథులపై కూడా ఇదే జరుగుతోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు.

అయితే, రాహుల్‌ కామెంట్లకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఘాటుగా స్పందించారు. బ్రిక్స్ దేశాల అధినేతలు భారతీయ శాఖాహార వంటకాలను ఆస్వాదించారని పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాల నేతలకు వడ్డించిన ఆహార మెనూపై కాంగ్రెస్ రాజకీయాలు చేస్తుందంటే నమ్మలేకపోతున్నాను అంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. దేశంలో వివిధ ప్రాంతాలను ప్రతిబింబించేలా ఈ శాఖాహార మెనూను రూపొందించినట్లు ఆయన వెల్లడించారు. రుచితో పాటు పోషక విలువలకు కూడా ప్రాధాన్యం ఇచ్చామని వివరించారు.

విందు మెనూలో ఏమున్నాయంటే?
బ్రిక్స్ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ అతిథులకు ఇచ్చిన విందులో పూర్తిగా శాఖాహార వంటకాలను మాత్రమే వడ్డించారు. వాటిలో ఖాండ్వీ, పనీర్ లబాబ్దార్, గుచ్చి మార్మిక్, మిల్లెట్ పులావ్, మష్రూమ్ గలౌటీ, జిలేబీ వంటి వంటకాలు ఉన్నాయి.ఈ మెనూలో మిల్లెట్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. భారత్ ప్రోత్సహిస్తున్న ‘‘శ్రీ అన్న’’ తో పాటు సుస్థిర ఆహార విధానాన్ని కూడా ఈ మెనూలో ప్రతిబింబించేలా రూపొందించారు.

ప్రధాన వంటకాలలో పన్నీర్ లబాబ్దార్, గుచ్చి మార్మిక్, క్యారెట్ బీన్ పొరియల్, థక్కాళి బెల్లె సారు తదితరాలు ఉన్నాయి. వీటితో పాటు మిల్లెట్ పులావ్, బీట్‌రూట్ రాయితా, వివిధ రకాల భారతీయ రొట్టెలు ఏర్పాటు చేశారు. మెనూలో ముఖ్యంగా చిరుధాన్యాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. పులావ్‌లో సజ్జలు, రొట్టెల్లో జొన్నలు, డెజర్ట్‌లో కొర్ర వంటి చిరుధాన్యాలను ఉపయోగించినట్టు తెలుస్తోంది. పోషకాహారం, స్థిరమైన వ్యవసాయం, వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో చిరుధాన్యాల ప్రాధాన్యాన్ని చాటేలా మెనూను రూపొందించారు. ఇక భోజనం చివర్లో భారతీయతకు పెద్దపీట వేస్తూ.. ఓల్డ్ ఢిల్లీ ఫ్రూట్ క్రీమ్‌తో జిలేబీ, షాహ్తూత్ ఫిర్నీ వంటి స్వీట్లను అందించారు. మల్బెర్రీ పండ్లతో కూడిన ఫిర్నీకి ఆధునిక రూపాన్నిచ్చారు.

కాగా, అంతర్జాతీయ నేతలు పాల్గొన్న విందులో భారతీయ ఆహార సంస్కృతిలో ముఖ్య భాగమైన నాన్‌వెజ్ వంటకాలూ కూడా ఉండాల్సిందన్న రాహుల్ వ్యాఖ్యలు అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. దీంతో ఆహారపు అలవాట్లపై మొదలైన చర్చ కాస్తా రాజకీయ రంగు పులుముకోవడం గమనార్హం. రాహుల్ పోస్ట్‌పై అధికారపక్షం స్పందిస్తూ.. విందు మెనూను రాజకీయ అంశంగా మార్చుతున్నారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తప్పుపట్టారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, సాంకేతికత, ఆరోగ్యం, గ్లోబల్ సౌత్ వంటి కీలక అంశాలపై చర్చలకు ప్రధాన వేదికైన బ్రిక్స్‌ కూటమి సదస్సు చివరి రోజున.. అనూహ్యంగా ‘వెజ్ వర్సెస్ నాన్‌వెజ్’ మెనూ హాట్ టాపిక్‌గా మారింది.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.