
Police Notice:తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి రాకుండా అడ్డుకున్న ఘటన సంచలనంగా మారగా, ఈ సందర్బంగా స్పీకరపై చేసిన అనుచిత వ్యాఖ్యలు వివాదంగా మారిన విషయం తెలిసిందే. అనంతరం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను శాసనసభ నుంచి బహిష్కరించిన ప్రభుత్వం ఆ రోజు అసెంబ్లీ ముందు జరిగిన వివాదానికి సంబంధించి విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పీఏ, పీఆర్‌ఓకు పోలీసులు నోటీసులు జారీ చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కేటీఆర్ పీఏ మహేందర్‌రెడ్డి, పీఆర్‌ఓ మహేష్‌కు సైఫాబాద్ పోలీసులు ఈ మేరకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. అసెంబ్లీ గేట్-3 వద్ద ఈ నెల 7న చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించి నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా ఈ నోటీసులు జారీ చేసినట్లు పోలీసులు పేర్కొంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించే పనిలో భాగంగా పోలీసులు ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.
నోటీసులో పేర్కొన్న వివరాల మేరకు ఈ రోజు మహేందర్‌రెడ్డి, మహేష్ సైఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరుకావాలని పోలీసులు తెలిపారు. అసెంబ్లీ గేట్-3 వద్ద జరిగిన ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఆ ఘటన సమయంలో ఏం జరిగింది? అక్కడ ఎవరు ఉన్నారు? ఘటనకు దారితీసిన పరిస్థితులు ఏమిటి? అనే అంశాలపై పోలీసులు వివరాలు సేకరించడంలో భాగంగా ఈ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ రోజు విచారణలో పోలీసులు ఏ అంశాలపై ప్రశ్నలు అడగనున్నారనేది ఆసక్తికరంగా మారింది. కాగా, ఈ ఘటనపై బీఆర్‌ఎస్ వర్గాలు ప్రభుత్వం పై విమర్శలు ఎక్కుపెట్టారు.









