
Seema Pahuja : సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసులో సీబీఐ దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ కేసులో ఇటీవల సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి చెందిన సీమా పహూజా చేపట్టనున్నారు. దిశా సాలియన్ తండ్రి సతీశ్ సాలియన్ చేసిన ఫిర్యాదులను పరిశీలించిన తర్వాత సీబీఐ ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఆయన ఫిర్యాదులో శివసేన (యూబీటీ) నేత ఆదిత్య ఠాక్రే, నటుడు డినో మోరియా తదితరుల పేర్లు కూడా ఉన్నాయి.
దిశా సాలియన్ 2020 జూన్ 8న ముంబైలోని మలాడ్ ప్రాంతంలోని ఓ నివాస భవనం 14వ అంతస్తు నుంచి కిందపడిపోయి మృతి చెందారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ముంబైలోని బాంద్రా ఫ్లాట్‌లో మృతి చెందడానికి కొన్ని రోజుల ముందే దిశా మరణించారు. తొలుత దిశా మృతిని పోలీసులు యాక్సిడెంటల్ డెత్ రిపోర్ట్ గా నమోదు చేశారు.
అయితే పోలీసుల విచారణ తర్వాత దిశా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గతంలో తెలిపారు. దీనిపై దిశా తండ్రి సతీశ్ సాలియన్ గతేడాది బాంబే హైకోర్టును ఆశ్రయించారు. తన కుమార్తెపై సామూహిక అత్యాచారం చేసి, ఆ తర్వాత హత్య చేశారని ఆయన పిటిషన్లో ఆరోపించారు. ఈ పిటిషన్‌ను పరిశీలించిన బాంబే హైకోర్టు.. దిశా సాలియన్ మృతికి సంబంధించిన పరిస్థితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయాలని సీబీఐని ఆదేశించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది.
Also Read : MLA మేనకోడలు.. డ్యూటీకి వెళ్ళకుండానే నెలకు రూ. 70 వేల జీతం!
ఎవరీ సీమా పహూజా?
సీమా పహూజా ప్రస్తుతం ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో స్పెషల్ క్రైమ్ యూనిట్లో సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా పనిచేస్తున్నారు. దిశా సాలియన్ మృతి కేసు దర్యాప్తులో ఆమెతో పాటు మరికొందరు సీబీఐ అధికారులు కూడా పాల్గొంటారు. దర్యాప్తు అధికారిగా డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పురణ్ కుమార్ కూడా ఈ కేసులో పనిచేయనున్నారు. క్లిష్టమైన క్రిమినల్ కేసులు, ఫోరెన్సిక్ ఆధారాలతో కూడిన దర్యాప్తుల్లో సీమా పహూజాకు అనుభవం ఉంది. గతంలో పలు సంచలనాత్మక, సున్నితమైన కేసుల దర్యాప్తులో ఆమె పనిచేశారు. 2024లో కోల్‌కతాలోని ఆర్జీ కర్ ఆస్పత్రిలో జరిగిన అత్యాచారం, హత్య కేసును దర్యాప్తు చేసిన సీబీఐ బృందంలో సీమా పహూజా కూడా ఉన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ కేసు దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన 15 మంది సభ్యుల సీబీఐ బృందంలోనూ ఆమె పనిచేశారు. ఉనావ్ అత్యాచారం కేసు దర్యాప్తులో కూడా ఆమె కీలక పాత్ర పోషించారు. హిమాచల్‌ప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన గుడియా కేసు దర్యాప్తు బాధ్యతలను కూడా సీబీఐ సీమా పహూజాకు అప్పగించింది. షిమ్లాలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన కేసు దర్యాప్తులోనూ ఆమె పాల్గొన్నారు. 2021లో సీమా పహూజాకు బెస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్‌గా గోల్డ్ మెడల్ లభించింది.
Also Read : కేంద్రం సంచలనం.. పీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు









