CM Revanth Reddy :  ఎర్రవల్లిలో మాజీ సీఎం కేసీఆర్‌కు ఉన్నట్లు చెబుతున్న ఫామ్‌హౌస్‌పై విచారణకు సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. 30 రోజుల్లో విచారణ పూర్తి చేసి వాస్తవాలు తేల్చాలని అసెంబ్లీలో అధికారులను ఆదేశించారు. ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌ మొత్తం 700 ఎకరాల్లో ఉందా లేదా అనే విషయాన్ని స్పష్టం చేయాలని చెప్పారు. అందులో 388 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని ఆరోపణలు వస్తున్నా.. ఈ విషయాన్ని కేసీఆర్‌ ఎందుకు చెప్పలేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.

ఫామ్‌హౌస్‌లో ప్రభుత్వ భూమి ఉన్నట్లు విచారణలో తేలితే.. ఆ భూమిని పేదలకు పంచుతామని సీఎం ప్రకటించారు. 22ఏ నిషేధిత భూముల అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా రేవంత్‌రెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ కుటుంబానికి సంబంధించిన భూముల వివరాలను కూడా సీఎం సభలో ప్రస్తావించారు. సిద్దిపేటలో కేసీఆర్‌ కుటుంబానికి 67.5 ఎకరాలు ఉన్నాయని చెప్పారు. కేటీఆర్‌ కుటుంబానికి 123 ఎకరాలు, హరీశ్‌రావు కుటుంబానికి 30 ఎకరాలు, కల్వకుంట్ల కవిత కుటుంబానికి 37 ఎకరాలు, జోగినపల్లి సంతోష్‌రావు కుటుంబానికి 79 ఎకరాలు, నవీన్‌రావుకు 52 ఎకరాలు, కొండల్‌రావుకు 48 ఎకరాలు ఉన్నాయని రేవంత్‌రెడ్డి తెలిపారు.

Also Read : ఈశ్వర్ సాయి, మాధురి రాథోడ్ కేసులో సంచలనం.. భార్య శరణ్య ఆత్మహత్యాయత్నం ?

కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణలోని 9 జిల్లాల్లో 24 మండలాలు, 31 గ్రామాల్లో కలిపి 439 ఎకరాల భూమి ఉందని సీఎం పేర్కొన్నారు. కేటీఆర్‌ జన్వాడ ఫామ్‌హౌస్‌ అంశంపైనా రేవంత్‌రెడ్డి మాట్లాడారు. కేటీఆర్‌ ఫామ్‌హౌస్‌పై తాను ఎందుకు బాంబులు వేస్తానని ప్రశ్నిస్తూ.. నేనేమైనా బిన్‌లాడెన్‌నా అని వ్యాఖ్యానించారు. ఎన్నికల సమయంలో స్టీఫెన్‌సన్‌కు నజరానా ఇచ్చారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. రూ.50 కోట్ల విలువైన భూమిని కేవలం రూ.1.53 కోట్లకే రెగ్యులరైజ్‌ చేశారని అన్నారు. గంగుల, ఎర్రబెల్లి, సుధీర్‌రెడ్డి కలిసి 650 ఎకరాల ప్రభుత్వ భూమిని కొనుగోలు చేశారని సీఎం ఆరోపించారు. మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి 50 ఎకరాల ఫామ్‌హౌస్‌లో 11.5 ఎకరాల ఇనాం భూమి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. అలాగే పైలట్‌ రోహిత్‌రెడ్డి అజీజ్‌నగర్‌లో అసైన్డ్‌ భూమిలో ఫామ్‌హౌస్‌ నిర్మించుకున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఒక కుటుంబానికి సాధారణంగా కుష్కి భూమి 54 ఎకరాలు, తరి భూమి 27 ఎకరాలు ఉండాలని సీఎం చెప్పారు. అయితే కేసీఆర్‌కు ఉన్న భూమంతా తరి భూమేనని రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

ఎల్బీనగర్‌లో జీవో 118 పరిధిలో ఉన్న ప్రజలకు త్వరలో శుభవార్త చెబుతామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ఈ నియోజకవర్గంలో జీవో 118 పరిధిలో ఉన్న స్థలాలను రెగ్యులరైజ్‌ చేస్తామని చెప్పారు. జీవో 118 కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను నిర్ణీత గడువులో పరిష్కరిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఎల్బీనగర్‌ ప్రాంతంలో సుమారు 9,500 మంది ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారని రేవంత్‌రెడ్డి తెలిపారు.

Also Read : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. 110 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. వివరాలివే!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.