
MLA : విధులకు హాజరుకాకుండానే నెలకు రూ.70 వేలకు పైగా జీతం తీసుకున్నారన్న ఆరోపణలతో కర్ణాటకలో ఓ వైద్యురాలిపై విచారణ మొదలైంది. బాగల్‌కోట్‌లోని నమ్మ క్లినిక్‌లో మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ అంకిత యరగల్.. అదే సమయంలో ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పీజీ కోర్సు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆమె బాగల్కోట్ ఎమ్మెల్యే ఉమేశ్ మెటీకి మేనకోడలు. డాక్టర్ అంకిత యరగల్పై విధులకు గైర్హాజరు కావడం, అనుమతి లేకుండా ఒకేసారి రెండు చోట్ల విధులు నిర్వహించినట్లు చూపించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై బాగల్కోట్ జిల్లా పంచాయతీ సీఈవో గజానన్ బాలే విచారణ చేపట్టారు.
Also Read : కేంద్రం సంచలనం.. పీఎఫ్ వేతన పరిమితి రూ.25 వేలకు పెంపు
అయితే విచారణకు డాక్టర్ అంకిత హాజరుకాలేదు. దీంతో సెప్టెంబర్ 18న ఉదయం 10 గంటలకు మరోసారి విచారణకు హాజరుకావాలని సీఈవో నోటీసులు జారీ చేశారు. బాగల్కోట్ జిల్లా పంచాయతీ కార్యాలయంలోని 11వ గదిలో విచారణ జరుగుతుందని నోటీసులో పేర్కొన్నారు. అధికారుల నోటీసు ప్రకారం.. డాక్టర్ అంకిత మార్చి 3 నుంచి సెప్టెంబర్ వరకు వంబే కాలనీలోని నమ్మ క్లినిక్‌కు విధులకు హాజరుకాలేదని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఆ క్లినిక్‌లో మెడికల్ ఆఫీసర్ లేకపోవడంతో అక్కడికి వచ్చే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని అధికారులు తెలిపారు. అదే సమయంలో ఆమె ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో పీజీ వైద్య విద్యను కొనసాగిస్తూ.. నమ్మ క్లినిక్‌లో ప్రభుత్వానికి సంబంధించిన మెడికల్ ఆఫీసర్‌గా జీతం తీసుకున్నట్లు అధికారులు ఆరోపిస్తున్నారు.
ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో పనిచేసే వైద్యులు పాటించాల్సిన నిబంధనలకు ఇది విరుద్ధంగా ఉండొచ్చని అధికారులు పేర్కొన్నారు. అలాగే నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ)కు సంబంధించిన వైద్యుల వృత్తి నైతిక నిబంధనలను కూడా ఉల్లంఘించినట్లు ఆరోపణలు ఉన్నాయని నోటీసులో తెలిపారు. ఈ వ్యవహారాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. వృత్తిపరమైన తప్పిదాలకు పాల్పడినట్లు తేలితే డాక్టర్ అంకితపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. అవసరమైతే ఈ విషయాన్ని కర్ణాటక మెడికల్ కౌన్సిల్, నేషనల్ మెడికల్ కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలిపారు.
అనుమతి లేకుండా రెండు బాధ్యతలు నిర్వహించిన కాలంలో ఆమెకు చెల్లించిన మొత్తం జీతం లేదా గౌరవ వేతనాన్ని కూడా నిబంధనల ప్రకారం తిరిగి వసూలు చేసే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు. మరోవైపు ఎస్ఎన్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆమెకు పీజీ చదువుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు నోటీసులో పేర్కొన్నారు. అయితే ఆ అనుమతి ఉన్నప్పటికీ నమ్మ క్లినిక్‌లో ఆమె తన విధులకు హాజరుకాలేదని అధికారులు తెలిపారు. సెప్టెంబర్ 18న జరిగే తదుపరి విచారణకు కూడా డాక్టర్ అంకిత హాజరుకాకపోతే.. ఆమె వివరణ తీసుకోకుండానే అధికారులు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సీఈవో హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. జిల్లా ఆరోగ్య అధికారి రాజ్‌కుమార్ యరగల్ డాక్టర్ అంకితను ఇప్పటికే విధుల నుంచి తొలగించినట్లు సమాచారం.
Also Read : ఉదయం 6 గంటలకే ఊస్టింగ్ మెయిల్స్.. ఉద్యోగులకు ఒరాకిల్ ఊహించని షాక్.. వివరాలివే!









