Donald Trump : రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాలకు అమెరికా షాక్ ఇచ్చేలా ఓ కీలక బిల్లును తీసుకొచ్చింది. రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించడంతో పాటు.. రష్యా నుంచి ఆయిల్, గ్యాస్ కొనే దేశాలపై భారీ టారిఫ్‌లు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి ఇచ్చే బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం తెలిపింది. లిండ్సే ఓ. గ్రాహమ్ శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026 పేరుతో ఉన్న ఈ బిల్లుకు 262 మంది సభ్యులు అనుకూలంగా ఓటు వేయగా.. 159 మంది వ్యతిరేకంగా ఓటు వేశారు. ఇప్పుడు ఈ బిల్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వద్దకు వెళ్లింది. ఆయన సంతకం చేస్తే ఇది చట్టంగా మారుతుంది.

ఈ బిల్లులోని నిబంధనల ప్రకారం.. రష్యా నుంచి పెద్ద మొత్తంలో చమురు లేదా సహజ వాయువు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా అధ్యక్షుడు 100 శాతం వరకు టారిఫ్ విధించవచ్చు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న పెద్ద దేశాల్లో భారత్, చైనా ఉన్నాయి. దీంతో ఈ బిల్లు భారత్‌పై కూడా ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఓ ముఖ్యమైన విషయం ఉంది. భారత్‌పై ఇప్పటికే 100 శాతం టారిఫ్ విధించలేదు. ఈ బిల్లు కేవలం అలాంటి టారిఫ్ విధించే అధికారాన్ని అమెరికా అధ్యక్షుడికి ఇస్తుంది. ట్రంప్ ఆ అధికారాన్ని ఉపయోగించినప్పుడే భారత్‌పై కొత్త టారిఫ్ అమల్లోకి వస్తుంది.

Also Read : AIకి కిల్‌ స్విచ్‌.. ప్రమాదం వస్తే పూర్తిగా ఆపేయాల్సిందేనా?

రష్యా నుంచి చమురు, గ్యాస్ అమ్మడం ద్వారా ఆ దేశానికి భారీగా ఆదాయం వస్తోంది. ఉక్రెయిన్‌తో యుద్ధం కొనసాగిస్తున్న రష్యాకు ఈ ఆదాయం ఉపయోగపడుతోందని అమెరికా భావిస్తోంది. అందుకే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేసే దేశాలపై ఒత్తిడి పెంచాలని అమెరికా చూస్తోంది. రష్యా నుంచి ఆయిల్ కొనడం తగ్గిస్తే.. ఆ దేశానికి వచ్చే ఆదాయం కూడా తగ్గుతుందని అమెరికా ఉద్దేశం. ఒకవేళ ట్రంప్ ఈ అధికారాన్ని ఉపయోగించి భారత్‌పై 100 శాతం వరకు టారిఫ్ విధిస్తే.. అమెరికాకు భారత్ నుంచి వెళ్లే వస్తువులపై భారీగా సుంకం పడుతుంది. దీంతో అమెరికా మార్కెట్‌లో భారత వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. అయితే టారిఫ్ విధిస్తారా? ఎంత శాతం విధిస్తారు? ఎప్పుడు విధిస్తారు? అనే విషయాలు ఇంకా అమెరికా అధ్యక్షుడి నిర్ణయంపై ఆధారపడి ఉంటాయి.

ఈ బిల్లులో రష్యా అధికారులు, బ్యాంకులు, ఆర్థిక సంస్థలపై మరిన్ని ఆంక్షలు విధించే నిబంధనలు కూడా ఉన్నాయి. అలాగే రష్యా చమురు ఎగుమతులకు సహాయం చేస్తున్న ‘షాడో ఫ్లీట్’గా పిలిచే నౌకలపైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. పాశ్చాత్య దేశాల ఆంక్షలను తప్పించుకుని రష్యా చమురు రవాణా చేయడానికి ఈ నౌకలు ఉపయోగపడుతున్నాయని అమెరికా చెబుతోంది. ఈ బిల్లులో రష్యాతో పాటు ఇరాన్‌కు సంబంధించిన నిబంధనలు కూడా ఉన్నాయి. ఇరాన్‌పై ప్రస్తుతం ఉన్న కొన్ని ఆంక్షలను మరో ఐదేళ్ల పాటు కొనసాగించే అంశం కూడా ఇందులో ఉంది. ఈ బిల్లును అమెరికా సెనేట్ ఆగస్టు 7న 86-11 ఓట్లతో ఇప్పటికే ఆమోదించింది. అయితే టారిఫ్‌లకు సంబంధించిన నిబంధనలపై ప్రతినిధుల సభలో కొంతకాలం చర్చలు జరిగాయి. ఇప్పుడు ప్రతినిధుల సభ కూడా బిల్లును ఆమోదించింది.

ట్రంప్‌కు టారిఫ్‌లు విధించే విషయంలో ఎక్కువ అధికారం ఇవ్వడంపై కొంతమంది డెమొక్రాటిక్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ అధికారం అమెరికా మిత్రదేశాలపై కూడా ఉపయోగించే అవకాశం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. టారిఫ్‌ల వల్ల అమెరికాలో వస్తువుల ధరలు పెరిగి సాధారణ ప్రజలపై కూడా భారం పడొచ్చని అన్నారు. మరోవైపు ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్‌స్కీ ఈ బిల్లుకు మద్దతు తెలిపారు. రష్యాపై ఆర్థిక ఒత్తిడి పెంచేందుకు ఈ చర్య ఉపయోగపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read : ఉదయం 6 గంటలకే ఊస్టింగ్ మెయిల్స్.. ఉద్యోగులకు ఒరాకిల్ ఊహించని షాక్.. వివరాలివే!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.