హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనాల శోభాయాత్ర నేడు ప్రారంభమైంది. ఈ క్రమంలో సిటీ పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మూడో రోజు నుంచే విగ్రహాల నిమజ్జనం ప్రశాంతంగా సాగుతుండగా.. చివరి రోజు బాలాపూర్ గణేష్ నుంచి జరిగే ప్రధాన శోభాయాత్రను విజయవంతం చేసేందుకు పోలీసులు పటిష్టమైన భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. జీహెచ్‌ఎంసీ, విద్యుత్, జలమండలి వంటి విభాగాలతో సమన్వయం చేసుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సర్వం సిద్ధం చేశారు.

మండపాల ఆన్‌లైన్ నమోదు విధానం ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 14,929 మండపాలకు అనుమతులు మంజూరు చేశారు. వీటిని ‘జియో ట్యాగింగ్’ చేయడంతో పాటు భద్రతా సూచనల పోస్టర్లను అతికించారు. ఇప్పటివరకు దాదాపు 32,878 విగ్రహాల నిమజ్జనం పూర్తయింది. శోభాయాత్ర సాఫీగా సాగేందుకు రోడ్ల మరమ్మతులు, విద్యుత్ తీగల తొలగింపు, చెట్ల కొమ్మల కత్తిరింపులు పూర్తి చేశారు.

Also Read : దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులో బిగ్ షాక్

బంజారాహిల్స్‌లోని ప్రధాన కంట్రోల్ రూమ్‌కు అనుసంధానిస్తూ ఊరేగింపు మార్గాల్లో 10 వేల సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఆకాశం నుంచి పర్యవేక్షించేందుకు 24 డ్రోన్లు, విగ్రహాల లెక్కింపు కోసం 100 వరకు హైరైజ్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. ఎత్తైన భవనాలపై వైర్‌లెస్ సెట్లు, బైనాక్యులర్లతో సిబ్బందిని మోహరించారు. హుస్సేన్ సాగర్, ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, మొఘల్‌పురా వద్ద ప్రత్యేక కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు.

జలాశయాల వద్ద ప్రమాదాలు జరగకుండా ఆర్మీ, పర్యాటక శాఖలకు చెందిన గజ ఈతగాళ్లను, రెస్క్యూ బోట్లను సిద్ధంగా ఉంచారు. విద్యుత్ అంతరాయం కలగకుండా జనరేటర్లు, రాత్రి వేళల్లో నిఘా కోసం వాచ్ టవర్లు, వైద్య సేవల కోసం అంబులెన్సులు, అగ్నిమాపక శకటాలను అందుబాటులో ఉంచారు. వాహనాలు చెడిపోతే ట్రాఫిక్ నిలిచిపోకుండా ఉండేందుకు ప్రధాన కూడళ్ల వద్ద మెకానిక్‌లు, డ్రైవర్లను సిద్ధం చేశారు.

శాంతిభద్రతల పరిరక్షణ కోసం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో దాదాపు 20 వేల మంది పోలీసులు విధుల్లో ఉన్నారు. ఇతర జిల్లాల నుంచి అనుభవజ్ఞులైన 8,142 మంది సిబ్బందిని రప్పించి వివిధ జోన్లకు కేటాయించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ఆర్ఏఎఫ్ (RAF), సీఆర్‌పీఎఫ్ (CRPF) కేంద్ర బలగాలను మోహరించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు వంటి జనసమ్మర్థ ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు.

Also Read : తెలుగు రాష్ట్రాలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు.. కారణమిదే!