
హైదరాబాద్‌లో బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట కోసం భక్తులు, నగరవాసులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. గత 31 ఏళ్లుగా ఘనంగా సాగుతున్న ఈ వేలం పాట ప్రతిఏటా కొత్త రికార్డులను సృష్టిస్తోంది. ఈ ఏడాది కూడా 21 కిలోల బాలాపూర్ లంబోదరుడి ప్రసాదాన్ని దక్కించుకోవడానికి పలువురు ప్రముఖులు, భక్తులు తీవ్ర పోటీ పడుతున్నారు. ఈ వేలం పాట ముగిసిన వెంటనే బాలాపూర్ గణేషుడి సుదీర్ఘ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభమవుతుంది.
Also Read : ఖైరతాబాద్ బడా గణేశుడి శోభాయాత్ర షురూ.. అడుగడుగునా అంబరాన్నంటిన భక్తజన కోలాహలం!
ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానున్న బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం పాట
₹35 లక్షల చొప్పున డిపాజిట్ చేసి వేలంలో పాల్గొనడానికి అర్హత సాధించిన 9 మంది భక్తులు
ఈ ఏడాది రూ. 40 లక్షల మార్కును దాటుతుందని భావిస్తున్న ఉత్సవ సమితి నిర్వాహకులు
పూరీ జగన్నాథ ఆలయ నమూనా మండపంలో నవరాత్రులు పూర్తి… pic.twitter.com/cnaKopSwgt
— RTV (@RTVnewsnetwork) September 25, 2026
బాలాపూర్ లడ్డూ వేలం కేవలం రూ.450తో ప్రారంభమై నేడు రూ.35 లక్షల మార్కుకు చేరుకుంది. 1994లో మొదటిసారిగా కొలను మోహన్ రెడ్డి రూ.450కి ఈ లడ్డూను వేలంలో పాడుకున్నారు. నాటి నుంచి నేటి వరకు ప్రతీ ఏటా లడ్డూ ధర పెరుగుతూ వస్తోంది. 2002లో కందాడ మాధవరెడ్డి రూ.1.05 లక్షలకు పాడుకోవడంతో లడ్డూ ధర లక్షల మార్కును తాకింది. ఆ తర్వాత 2015లో కళ్లెం మదన్‌మోహన్‌రెడ్డి రూ.10.32 లక్షలకు వేలంలో దక్కించుకోవడంతో పది లక్షల మార్కును దాటింది.
గడిచిన మూడేళ్లలో ఈ వేలం పాట వేగంగా కొత్త శిఖరాలకు చేరుకుంది. 2023లో దాసరి దయానంద్‌రెడ్డి రూ.27 లక్షలకు లడ్డూను దక్కించుకోగా, 2024లో కొలను శంకర్‌రెడ్డి రూ.30.01 లక్షలకు పాడుకున్నారు. ఇక గత ఏడాది 2025లో లింగాల దశరథ్ గౌడ్ ఏకంగా రూ.35 లక్షలు వెచ్చించి బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకుని ఆల్ టైమ్ రికార్డు సృష్టించారు. ఒక్క 2020లో మాత్రమే కరోనా మహమ్మారి కారణంగా వేలం పాట నిర్వహించలేదు.
మూడు దశాబ్దాల కాలంలో వందల రూపాయిల నుంచి మొదలై రూ.35 లక్షలకు చేరిన ఈ లడ్డూ వేలం పాట ప్రాముఖ్యత ఏటికేటికీ పెరుగుతోంది. ఈ లడ్డూను దక్కించుకుంటే సకల శుభాలు కలుగుతాయని, వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తామని భక్తుల విశ్వాసం. అయితే ఈసారి 2026 వేలం పాటలో గత ఏడాది నమోదైన రూ.35 లక్షల రికార్డు బ్రేక్ అవుతుందా లేదా అనే అంశంపై తీవ్ర ఆసక్తి నెలకొంది.
Also Read : చార్మినార్, ఎంజే మార్కెట్ మీదుగా ట్యాంక్‌బండ్‌కు.. 18.5 కిలోమీటర్ల మేర బాలాపూర్ ఘనంగా ఊరేగింపు!









