
భారతదేశంలో డిజిటల్ చెల్లింపుల విప్లవాన్ని తెచ్చిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ మర్చంట్ డిస్కౌంట్ రేట్(MDR) ఛార్జీల ప్రతిపాదనపై చర్చ జరుగుతోంది. అసలు ఈ MDR అంటే ఏమిటి? దీనిని ఎవరు చెల్లిస్తారు? ఈ డబ్బు ఎవరి జేబుల్లోకి వెళ్తుంది? అలాగే సామాన్య వినియోగదారులపై దీని ప్రభావం ఎంత వరకు ఉంటుందనే విషయాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ వివాదంపై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఉన్న సందేహాలపై క్లారిటీ ఇచ్చింది.
వినియోగదారులకు యూపీఐ సేవలు ఎప్పటిలాగే పూర్తిగా ఫ్రీ. అయితే ఈ MDR అనేది ఒక పన్ను. సెస్ లేదా సర్ఛార్జ్ కాదని, ఇది కేవలం చెల్లింపుల ప్రాసెసింగ్ ఖర్చు మాత్రమేనని అధికారులు తెలిపారు. అంతేకాకుండా నగరాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో జరిగే దాదాపు 96% యూపీఐ లావాదేవీలపై ఎలాంటి ఛార్జీలు వర్తించవు. వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి జరిగే అన్ని రకాల యూపీఐ బదిలీలు ఎంత అయినా కూడా ఉచితం. అయితే రూ.2 వేల వరకు జరిగే వ్యాపార లావాదేవీలపై ఎలాంటి ఛార్జీ లేదు. యూపీఐ QR ద్వారా నెలకు రూ.1 లక్ష వరకు లావాదేవీలు అందుకునే చిన్న వ్యాపారులకు జీరో MDR వర్తిస్తుంది. RuPay డెబిట్ కార్డ్ లావాదేవీలు యథాతథంగా ఛార్జీలు లేకుండా కొనసాగుతాయి.
Also Read : 13 కోట్ల ఓట్లు తొలగించారా.. జ్ఞానేశ్ కుమార్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్!
MDR ఎక్కడ వర్తిస్తుంది?
రూ.2 వేల కంటే ఎక్కువ విలువైన కొన్ని నిర్దిష్ట వ్యాపార లావాదేవీలకు మాత్రమే 0.4% MDR వర్తిస్తుంది. అలాగే రూ.75 వేలు దాటిన పెద్ద లావాదేవీలకు గరిష్ట MDR పరిమితి రూ.300గా ఉంటుంది. రైల్వేలు, టెలికాం, ఇంధనం, భీమా, వ్యవసాయ ఉత్పత్తుల వంటి కీలక రంగాలలో రూ.2 వేలకు పైబడిన లావాదేవీలపై ఫ్లాట్‌గా రూ.5 మాత్రమే విధిస్తారు. ఈ ఛార్జీని వ్యాపారులు వినియోగదారుల పైకి నెట్టకుండా బ్యాంకులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Also Read : క్రియేటర్లకు యూట్యూబ్ గుడ్ న్యూస్.. కొత్త AI టూల్స్
ఈ డబ్బు ఎక్కడికి వెళ్తుంది?
వసూలు చేసిన MDR ఛార్జీలు ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా వెళ్లదు. ఈ ఆదాయం లావాదేవీలను సురక్షితంగా, వేగంగా పూర్తి చేయడానికి కష్టపడే వ్యవస్థల మధ్య పంపిణీ అవుతుంది. ఉదాహరణకు రూ.5 వేల విలువైన లావాదేవీపై పడే రూ.20 MDR పంచుతారు. అది 40% కస్టమర్ బ్యాంక్, 30% వ్యాపారి బ్యాంక్ / పేమెంట్ గేట్‌వే, 20% వినియోగదారుడు వాడే యూపీఐ యాప్, 10% యాప్‌ను స్పాన్సర్ చేసే PSP బ్యాంకుకు పంపుతారు. ఇందులో ప్రభుత్వ ఆదాయం సున్న. అందువల్ల ఈ ఆదాయం ప్రభుత్వానికి కాకుండా, లావాదేవీని ప్రాసెస్ చేయడంలో, మద్దతు ఇవ్వడంలో సపోర్ట్ చేసిన సంస్థలకు చెందాలి.
యూపీఐ ద్వారా జరుగుతున్న లావాదేవీల సంఖ్య రోజురోజుకూ కోట్లలో పెరిగిపోతోంది. ఈ సేవలు ఎప్పుడూ ఆగిపోకుండా, సురక్షితంగా కొనసాగాలంటే కంపెనీలకు, బ్యాంకులకు తగినంత ఆదాయం అవసరం. అందుకే ఈ కొత్త ఛార్జీల విధానాన్ని ప్రతిపాదించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. లావాదేవీలు వేగంగా, హ్యాంగ్ అవ్వకుండా జరగడానికి అవసరమైన సాంకేతిక వ్యవస్థను బలోపేతం చేస్తారు. ఆన్లైన్ దొంగతనాలు, సైబర్ దాడులను తిప్పికొట్టడం, యూజర్ల డబ్బుకు పూర్తి భద్రత కల్పించడం కోసం ఉపయోగిస్తారు. చెల్లింపులు ఆగిపోయినప్పుడు లేదా సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు వినియోగదారులకు త్వరిత పరిష్కారం అందించడం కోసం వినియోగిస్తారు. చిన్న గ్రామాల్లో కూడా యూపీఐ సేవలు అందుబాటులోకి తీసుకురావడానికి ఉపయోగిస్తారు. అయితే ఇంటర్నెట్ లేకపోయినా వాడే యూపీఐ 123పే, క్రెడిట్ ఆన్ యూపీఐ వంటి ఆధునిక సేవలను మరింత మందికి చేర్చడానికి ఉపయోగిస్తారు.
విదేశాల్లో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలపై వ్యాపారుల నుంచి వసూలు చేసే మర్చంట్ రుసుముల విషయాలపై ఆర్థిక శాఖ ప్రస్తావించింది. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో అమల్లో ఉన్న రేట్లను పరిశీలిస్తే.. బ్రెజిల్లో లావాదేవీపై సుమారు 0.22% నుండి 0.33% వరకు, ఇండోనేషియాలో 0.30%, చైనా, దక్షిణాఫ్రికాలలో దాదాపు 0.40% వరకు వసూలు చేస్తున్నారు. దక్షిణ కొరియా, సింగపూర్లలో ఈ ఛార్జీలు మరికాస్త ఎక్కువగా ఉండగా, ఆస్ట్రేలియాలో ప్రతి లావాదేవీకి 0.30 ఆస్ట్రేలియన్ డాలర్లు లేదా 0.50% వరకు ఛార్జ్ చేస్తారు. అలాగే థాయ్‌లాండ్‌లో గరిష్టంగా 10 బాత్‌ల వరకు, అమెరికాలో 0.50% వరకు ఛార్జీలను అనుమతిస్తున్నారు.









