Petal Gahlot : పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ఐక్యరాజ్యసమితి వేదికగా భారత్ మరోసారి గట్టి సమాధానం ఇచ్చింది. కశ్మీర్, సింధు జలాల ఒప్పందం వంటి అంశాలను షరీఫ్ తన ప్రసంగంలో ప్రస్తావించడంతో.. భారత్ తరఫున పేటల్ గహ్లోత్ స్పందించారు. పాకిస్థాన్ ఉగ్రవాదంపై అనుసరిస్తున్న వైఖరిని ప్రశ్నిస్తూ.. సరిహద్దు దాటి ఉగ్రవాదం కొనసాగితే దాని ఫలితం ఉంటుందని హెచ్చరించారు. ఈసారి షరీఫ్‌కు సమాధానం ఇచ్చింది భారత విదేశాంగ శాఖకు చెందిన ఓ సీనియర్ నేత కాదు. ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత మిషన్‌లో ఫస్ట్ సెక్రటరీగా పనిచేస్తున్న పేటల్ గహ్లోత్. షెహబాజ్ షరీఫ్‌కు ఆమె యూఎన్‌లో సమాధానం ఇవ్వడం ఇది వరుసగా రెండోసారి.

Also Read : ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు సీనియర్ ఆర్మీ అధికారులతో సహా 14 మంది మృతి

పేటల్ గహ్లోత్ భారత విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన ఐఎఫ్‌ఎస్ అధికారి. ప్రస్తుతం న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత మిషన్‌లో ఫస్ట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. న్యూఢిల్లీలో జన్మించిన గహ్లోత్ 2015లో ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో చేరారు. ఆ తర్వాత విదేశాంగ శాఖతో పాటు విదేశాల్లోని భారత దౌత్య కార్యాలయాల్లో పనిచేశారు. 2020 నుంచి 2023 వరకు విదేశాంగ శాఖలోని యూరప్ వెస్ట్ విభాగంలో అండర్ సెక్రటరీగా పనిచేశారు. 2023 జూలైలో న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత మిషన్‌లో ఫస్ట్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టారు.

పేటల్ గహ్లోత్ ముంబైలోని సెయింట్ జేవియర్స్ కాలేజీ నుంచి పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, ఫ్రెంచ్ లిటరేచర్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. ఢిల్లీలోని లేడీ శ్రీరామ్ కాలేజీ ఫర్ ఉమెన్ నుంచి పొలిటికల్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందారు. దౌత్య వ్యవహారాలతో పాటు ఆమెకు సంగీతం అంటే కూడా చాలా ఇష్టం. గిటార్ వాయిస్తారు. సోషల్ మీడియాలో పలు పాటలను పాడుతూ, గిటార్ వాయిస్తూ చేసిన వీడియోలను కూడా షేర్ చేశారు. ఇటాలియన్ పాట బెల్లా చావోను ఆమె పాడిన వీడియోకు కూడా మంచి స్పందన వచ్చింది.

యూఎన్ సర్వసభ్య సమావేశంలో షెహబాజ్ షరీఫ్ సింధు జలాల ఒప్పందం గురించి ప్రస్తావించారు. పాకిస్థాన్‌కు రావాల్సిన నీటిని భారత్ ఆపడానికి లేదా మళ్లించడానికి ప్రయత్నిస్తే దాన్ని యుద్ధ చర్యగా పరిగణిస్తామని చెప్పారు. దీనికి స్పందించిన పేటల్ గహ్లోత్ ఉగ్రవాద అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. 9/11 దాడుల ప్రధాన సూత్రధారి ఒసామా బిన్ లాడెన్ పాకిస్థాన్‌లోని కీలక సైనిక శిక్షణా కేంద్రానికి సమీపంలో నివసించిన విషయాన్ని గుర్తు చేశారు. పాకిస్థాన్ సైన్యాన్ని షెహబాజ్ ప్రశంసించడాన్ని కూడా ఆమె ప్రశ్నించారు. పగలు భద్రత గురించి మాట్లాడుతున్న పాకిస్థాన్.. రాత్రి ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు.

2025 సెప్టెంబర్‌లో కూడా షెహబాజ్ షరీఫ్ యూఎన్ సర్వసభ్య సమావేశంలో భారత్‌పై ఆరోపణలు చేశారు. ఆ సమయంలో ఆపరేషన్ సిందూర్‌ను ప్రస్తావిస్తూ భారత్ తమపై ఎలాంటి కారణం లేకుండా దాడి చేసిందని షరీఫ్ ఆరోపించారు. అప్పుడు కూడా భారత్ తరఫున పేటల్ గహ్లోత్ స్పందించారు. షరీఫ్ ప్రసంగాన్ని తీవ్రంగా విమర్శిస్తూ.. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని గొప్పగా చూపిస్తోందని ఆరోపించారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో పాకిస్థాన్ వ్యవహరించిన తీరును కూడా ఆమె ప్రస్తావించారు. ఒసామా బిన్ లాడెన్‌కు పాకిస్థాన్‌లో ఆశ్రయం లభించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ సమయంలో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన ఘర్షణలో మూడో దేశం జోక్యం చేసుకుందన్న వాదనను కూడా గహ్లోత్ తిరస్కరించారు. ఇరు దేశాల మధ్య ఉన్న సమస్యలను రెండు దేశాలే చర్చించుకోవాలన్న భారత్ వైఖరిని స్పష్టం చేశారు.

Also Read : ఇటలీ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. బుర్ఖా, నిఖాబ్‌పై బ్యాన్!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.