Madhumita :  ఈ రోజుల్లో చాలామంది సోషల్ మీడియాలో తమ స్టేటస్‌ను చూపించుకోవడానికి ఖరీదైన కార్లు, బంగారు నగలు, డబ్బుల కట్టలు చూపిస్తూ రీల్స్ చేస్తున్నారు. తమ దగ్గర ఎంత డబ్బు, ఎంత ఆస్తి ఉందో చూపిస్తూ వీడియోలు పెడుతున్నారు. ఇలాంటి వీడియోలకు కూడా భారీగా వ్యూస్ వస్తుంటాయి. అయితే ఇదే కొన్నిసార్లు ప్రమాదంగా మారొచ్చు. తమిళనాడులో ఓ మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్ విషయంలో ఇలానే జరిగింది. తన కూతురిపై డబ్బులు చల్లుతూ వీడియో తీసిన ఆమె ఇంట్లో.. కొన్ని గంటలకే ఏకంగా రూ.కోటి విలువైన వస్తువులు చోరీకి గురయ్యాయి.

మధుమిత అనే మహిళా ఇన్‌ఫ్లుయెన్సర్ తరచూ తన సోషల్ మీడియా ఖాతాల్లో నగలు, డబ్బులు, ఇంటికి సంబంధించిన వీడియోలు పెడుతూ ఉంటుంది. కొన్ని రోజుల క్రితం ఆమె పెట్టిన ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అందులో రూ.500 నోట్ల కట్టలు చూపించడంతో పాటు ఒంటినిండా బంగారు నగలు ధరించింది. అంతేకాదు.. తన కూతురిపై నోట్లను చల్లుతూ డబ్బును ప్రదర్శించింది. ఈ వీడియోను లక్షల మంది చూశారు.

Also Read : IAS ఉద్యోగానికి గుడ్‌బై.. రాజకీయాల్లోకి దివ్య మిట్టల్!

అయితే ఆ వీడియోను చోరులు కూడా చూసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మధుమిత తన భర్తతో కలిసి బయటకు వెళ్లిన సమయంలో ఇదే అదనుగా భావించిన దొంగలు ఇంట్లోకి చొరబడ్డారు. ఇంట్లో ఉన్న బంగారు నగలు, వజ్రాల హారం, రూ.50 వేల నగదును తీసుకుని పారిపోయారు. చోరీకి గురైన మొత్తం వస్తువుల విలువ దాదాపు రూ.కోటి ఉంటుందని సమాచారం.

బయటకు వెళ్లి ఇంటికి తిరిగి వచ్చిన మధుమితకు ఇంట్లో చోరీ జరిగిన విషయం తెలిసి షాక్‌కు గురైంది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దొంగలను పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అయితే ఈ కేసులో పోలీసుల ముందున్న ప్రధాన ప్రశ్న.. ఇంట్లో సీసీటీవీ కెమెరాలు ఉన్నప్పటికీ దొంగలు ఎలా లోపలికి వచ్చారు? ఇంట్లో నగలు, డబ్బులు ఎక్కడ ఉంటాయనే విషయం వారికి ఎలా తెలిసింది? అనేది ఈ ఘటన తర్వాత మధుమిత తన సోషల్ మీడియా ఖాతాలను కూడా తొలగించినట్లు సమాచారం.

Also Read : 10 ఏళ్ల బాలిక కోరిక.. జడ్జి సంచలన తీర్పు!

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.