
Dk Aruna :ఖైరతాబాద్ ఉపఎన్నిక విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ డీకే అరుణ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే ఉపఎన్నిక జరగకుండా కాంగ్రెస్ నేతలతో కోర్టుల్లో పిటిషన్లు వేయిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె సీఎం రేవంత్‌రెడ్డికి నేరుగా సవాల్ విసిరారు. సీఎం రేవంత్ కు తమ పాలనపై అంతగా నమ్మకం ఉంటే.. కాంగ్రెస్‌లో చేరిన ఫిరాయింపు ఎమ్మెల్యేలతో వెంటనే రాజీనామా చేయించి, ఉపఎన్నికల్లో పోటీకి దింపాలని డిమాండ్ చేశారు. నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీకే అరుణ మాట్లాడారు.
ఖైరతాబాద్ ఉపఎన్నికను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ ఎందుకు వెనుకడుగు వేస్తోందని చెప్పాలని ఆమె ప్రశ్నించారు. ప్రజల్లో తమ ప్రభుత్వానికి ఆదరణ ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారని, అదే నిజమైతే ఎన్నికలకు ఎందుకు భయపడుతున్నారని నిలదీశారు. రేవంత్‌రెడ్డీ.. మీ పాలనపై మీకు నమ్మకం ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించండి. మళ్లీ ఎన్నికలకు వెళ్లండి. ప్రజలు ఎవరిని గెలిపిస్తారో తేలిపోతుంది అని డీకే అరుణ సవాల్ చేశారు.
ఓటమి భయంతోనే ఖైరతాబాద్ ఉపఎన్నికను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల్లోకి వెళ్లే ధైర్యం కాంగ్రెస్‌కు లేదని విమర్శించారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపైనా డీకే అరుణ మండిపడ్డారు. గతంలో పార్టీ ఫిరాయింపులను తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత అదే విధానాన్ని అనుసరిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలు ప్రస్తుతం తాము ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నామో చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ లోపాయికారీ ఒప్పందంతో పనిచేస్తున్నాయని డీకే అరుణ ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి అభివృద్ధిని దెబ్బతీశాయని విమర్శించారు. ప్రజలు ఈ రెండు పార్టీలకు తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని అన్నారు. ఖైరతాబాద్‌లో గతంలో బీజేపీ గెలిచిందని గుర్తుచేసిన డీకే అరుణ.. రాబోయే ఎన్నికల్లోనూ అక్కడ బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి నిధులు అందిస్తోందని ఆమె చెప్పుకొచ్చారు.
కాగా ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేందర్ పార్టీ మార్పు వ్యవహారంలో హైకోర్టు అనర్హత వేటు వేయడంతో ఆ స్థానం ఖాళీ అయింది. అనంతరం సెప్టెంబర్ 28న అసెంబ్లీ కార్యదర్శి గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి ఖైరతాబాద్ సీటు ఖాళీగా ప్రకటించారు. దీంతో ఉపఎన్నికకు మార్గం సుగమమైనప్పటికీ.. తాజాగా కాంగ్రెస్ నేత పి. విజయారెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ కొత్త మలుపు తీసుకొచ్చింది. 2023 ఎన్నికల ఫలితాన్ని సవాల్ చేస్తూ విజయారెడ్డి గతంలో దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్ ఇంకా హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. ఈ పిటిషన్ తేలే వరకు ఖైరతాబాద్ ఉపఎన్నికకు నోటిఫికేషన్ ఇవ్వబోమని ఎన్నికల సంఘం హైకోర్టుకు తెలిపింది. ఈ అంశంపై తదుపరి విచారణ అక్టోబర్ 6న జరగనుంది.









