Donald Trump
Donald Trump

అమెరికాలో నవంబర్ 3న మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. దీంతో భారతీయ-అమెరికన్లపై ట్రంప్ కన్ను పడినట్లు కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ఇండియన్-అమెరికన్లు తనకు ఓటు వేయరనే భయంతో ఏకంగా వారి ఓట్లను తొలగించే దిశగా ట్రంప్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమెరికాలో 21 లక్షల మంది భారతీయ-అమెరికన్ ఓటర్లు ఉన్నారని నివేదికలు చెబుతున్నాయి. ట్రంప్ అనుసరించే కఠినమైన వైఖరులు, భారతీయులపై చేసే వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా వీరు మొదటి నుంచీ ప్రత్యర్థి అయిన డెమోక్రటిక్ పార్టీకే మద్దతుగా నిలుస్తున్నారు.

గత 2024 అధ్యక్ష ఎన్నికలలో కూడా దాదాపు 65 శాతం మంది భారతీయ సంతతికి చెందిన ప్రజలు డెమోక్రటిక్ అభ్యర్థి అయిన కమలా హారిస్‌‌కు ఓట్లు వేశారని సర్వేలు చెబుతున్నాయి. అయితే ఈసారి అదే కనుక జరిగితే ట్రంప్(Donald Trump) గెలిచే అవకాశాలు తక్కువగా ఉంటాయని తెలుస్తోంది. అందుకే కావాలని ట్రంప్ కేవలం భారతీయులను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. రిపబ్లికన్ పార్టీ అధికారంలో ఉన్న 26 రాష్ట్రాల్లో దాదాపు లక్ష మందికి పైగా భారత సంతతి ఓటర్ల పేర్లను తొలగించినట్లు సమాచారం.

Also Read : డొనాల్డ్ ట్రంప్‌కు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్.. చర్చలు కాదని దాడులకు దిగితే ఇక యుద్ధమే!

అమెరికాలో ఓటింగ్ ప్రక్రియను మరింత సురక్షితంగా మార్చడానికి.. అర్హత లేని వారి పేర్లను తొలగించడానికే ఈ తనిఖీలు చేస్తున్నామని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. అయితే సేవ్ అమెరికా యాక్ట్ ప్రకారం పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి జనన ధృవీకరణ పత్రం లేదా పాస్‌పోర్ట్ సమర్పించడాన్ని తప్పనిసరి చేశారు. పోలింగ్ కేంద్రంతో పాటు పోస్టల్ ఓటింగ్‌కు కూడా ఈ కఠిన నిబంధనలను వర్తింపజేస్తున్నారు. అయితే డెమోక్రటిక్ నాయకులు మాత్రం ఇది ఎన్నికల మోసాన్ని నిరోధించడం కాదని.. అర్హులైన పౌరులను ఓటు వేయకుండా అడ్డుకుని మధ్యంతర ఎన్నికలను ప్రభావితం చేయడానికి ట్రంప్ వేస్తున్న కుట్ర అని ఆరోపిస్తున్నారు.

మరొకవైపు ట్రంప్ ప్రజాదరణ దారుణంగా పడిపోతోంది. ఏపీ-ఎన్‌ఓఆర్‌సి సర్వే ప్రకారం కేవలం 30 శాతం మంది అమెరికన్లు మాత్రమే ఆయన పనితీరుపై సంతృప్తిగా ఉన్నారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడంలో ట్రంప్ విఫలమయ్యారని 65 శాతానికి పైగా ప్రజలు భావిస్తున్నారు. ఈ వ్యతిరేకత తమపై పడుతుందనే భయంతో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థులే ట్రంప్ నుంచి దూరంగా జరుగుతున్నారు. కొందరైతే తమ ప్రచార వెబ్‌సైట్ల నుంచి అమెరికా ఫస్ట్ ఎజెండా ప్రస్తావనను తొలగించడమే కాకుండా ఆయనతో వేదికలు షేర్ చేసుకోవడానికి కూడా వెనుకాడుతున్నారని తెలుస్తోంది.

అమెరికా రాజ్యాంగం ప్రకారం సెనేట్ సభ్యుల పదవీకాలం 6 ఏళ్లు అయినప్పటికీ.. ప్రతి రెండేళ్లకు మూడో వంతు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. కాంగ్రెస్ సభ్యుల పదవీకాలం రెండేళ్లే ఉంటుంది. అందుకే అధ్యక్ష ఎన్నికల మధ్యలో వచ్చే ఈ ఎన్నికలను మధ్యంతర ఎన్నికలు అని పిలుస్తారు. ఈ ఎన్నికలు రాబోయే రెండేళ్లపాటు అమెరికా చట్టసభలపై ఎవరి ఆధిక్యం ఉంటుందో తేలుస్తాయి. ప్రస్తుతం సెనేట్‌లో 35 స్థానాలకు, ప్రతినిధుల సభలో 435 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం రిపబ్లికన్లు సెనేట్‌లో 53, ప్రతినిధుల సభలో 218 స్థానాలతో ముందంజలో ఉన్నారు. ఒకవేళ ఈ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ మెజార్టీ కోల్పోతే ట్రంప్ ప్రభుత్వం రాబోయే రోజుల్లో తనకిష్టమైన బిల్లులను చట్టాలుగా మార్చడం ఇక కష్టమే.

Also Read : H-1B వీసాదారులకు బిగ్ షాక్.. ట్రంప్ సర్కార్ సంచలన నిర్ణయం!