
US Tariffs : రష్యా నుంచి చమురు దిగుమతులపై అమెరికా విధించాలనుకున్న సుంకాల నుంచి భారత్‌కు ఉపశమనం లభించింది. రష్యా నుంచి క్రూడాయిల్, గ్యాస్ కొనుగోలు చేసే భారత్‌తో పాటు మరో 5 దేశాలపై ఎలాంటి అదనపు సుంకాలు విధించడం లేదని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కీలక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ఆయన సంతకం చేశారు.
ఈ నిర్ణయంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు సరఫరా పెరిగి ధరలు అదుపులోకి రానుండటంతో, భారత్‌లోనూ ఇంధన ధరలు దిగివచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రపంచ మార్కెట్లో ఇంధన భారాన్ని తగ్గించే లక్ష్యంతో రష్యా నుంచి డీజిల్ దిగుమతి చేసుకునేందుకు అధ్యక్షుడు పుతిన్‌తో ఒప్పందం కుదిరిన వెంటనే ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. దీనికింద రష్యా నుంచి అమెరికా సహా అంతర్జాతీయ మార్కెట్లోకి లక్షల టన్నుల డీజిల్ సరఫరా కానుంది.
Also Read : ట్రంప్–పుతిన్ డీజిల్ డీల్.. జెలెన్స్కీకి బిగ్ షాక్
ఇటీవల అమెరికా పార్లమెంట్లో ఆమోదం పొందిన ‘ది లిండ్సే ఓ. గ్రాహం సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ 2026’ ప్రకారం రష్యా నుంచి ఇంధనం కొనే భారత్, చైనాలపై ఏకంగా 100% వరకు టారిఫ్‌లు విధించే వెసులుబాటు లభించింది. భారత్ తన మొత్తం ముడి చమురు అవసరాల్లో 88% పైగా దిగుమతుల మీదే ఆధారపడుతోంది. ఇందులో రష్యా వాటాయే దాదాపు 45% (రోజుకు 2.08 మిలియన్ బ్యారెళ్లు). ఒకవేళ ఈ ఆంక్షలు అమలైతే దేశీయంగా పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్ని తాకేవి.
అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతలు, హొర్ముజ్ జలసంధిలో రవాణా ఆటంకాల నేపథ్యంలో రష్యా సరఫరాలను అడ్డుకుంటే ధరలు మరింత భగ్గుమంటాయని గుర్తించిన వాషింగ్టన్, ఆంక్షలను పక్కనపెట్టింది. భారత ఇంధన భద్రత, మార్కెట్ లభ్యత ఆధారంగానే తమ నిర్ణయాలు ఉంటాయని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. తాజా పరిణామాలతో సరఫరా వ్యవస్థకు లైన్ క్లియర్ కావడంతో దేశంలో ఇంధన ధరల భారం దిగివచ్చి సామాన్యుడికి ఊరట దక్కనుంది.
Also Read : ఇరాన్‌పై ‘Mother Of All Bombs’? అమెరికా ‘MOAB’ వెనుక అసలు కథ









