
రైలు ప్రయాణికులకు అలర్ట్. ఇకపై ట్రైన్లో లేదా రైల్వే ప్లాట్‌ఫార్మ్‌లలో స్పీకర్ పెట్టి ఫోన్లో గట్టి గట్టిగా మాట్లాడినా.. పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి వీడియోలు చూసినా.. ఆడియో సాంగ్ విన్నా చుక్కలు చూడాల్సిందే. దక్షిణమధ్య రైల్వే ఈ వ్యవహారంపై కఠినంగా వ్యవహరించనుంది. దీనికోసం కొత్తగా గట్టి రూల్ తీసుకొచ్చింది. దాని ప్రకారం.. నిబంధనలను ఉల్లంఘిస్తే.. జైలుకు వెళ్లడం ఖాయం.. ఫైన్ కట్టడం కూడా తప్పదు. ఇప్పుడు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ట్రైన్ జర్నీ సౌకర్యవంతంగా ఉండటంతో చాలా మంది దానినే ఎక్కువగా ఇష్టపడతారు. ప్రశాంతంగా ఉండటంతో పాటు ఎలాంటి ఇంబ్బంది లేకుండా హ్యాపీగా జర్నీ సాగిపోతుందనే నమ్మకంతో లాంగ్ జర్నీలు చేస్తుంటారు. కానీ కొన్ని ట్రైన్లలో మాత్రం పరిస్థితులు అలా ఉండవు. ఏకంగా సంతను పోలి ఉంటాయి. పెద్ద పెద్ద ఫోన్ సౌండ్లతో కొందరు రచ్చరచ్చ చేస్తుంటారు. ఇకపై అలా ట్రైన్లలో ప్రవర్తిస్తే అంతే సంగతులు. రైళ్లలో ప్రయాణించేటప్పుడు తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో సౌత్-వెస్ట్రన్ రైల్వే కొత్త ఆదేశాలు జారీ చేసింది.
ఇకపై ట్రైన్లలో లేదా రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ఎవరైనా మొబైల్లో గట్టి గట్టిగా అరుస్తూ మాట్లాడటం చేసినా.. అలాగే ఫోన్ స్పీకర్ పెట్టి పాటలు వినడం, వీడియోలు లేదా రీల్స్ చూడటం లాంటివి చేసినా రైల్వే అధికారులు కఠిన చర్యలు తీసుకోనున్నారు. అప్పటికీ వినకపోతే.. భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. రైల్వే చట్టంలోని నిబంధనల ప్రకారం.. పబ్లిక్‌గా తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తిస్తే రైల్వే యాక్ట్ సెక్షన్ 145 కింద కేసు నమోదు చేస్తారు. అలాగే రూ.1,000 వరకు ఫైన్ వేసే ఛాన్స్ ఉంది. పరిస్థితి అదుపుతప్పితే 6 నెలల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది.









