భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో జియో ప్లాట్‌ఫామ్స్ మెగా ఐపీఓ సరికొత్త రికార్డులను తిరగరాసింది. రూ.30,213 కోట్ల భారీ లక్ష్యంతో పబ్లిక్ ఇష్యూకి వచ్చిన జియో ఐపీఓ, ప్రారంభమైన మొదటి రోజే కేవలం కొద్ది నిమిషాల్లోనే 100 శాతానికి పైగా సబ్‌స్క్రిప్షన్ సాధించి పెట్టుబడిదారులను షాకింగ్‌కు గురిచేసింది. దేశంలోనే అతిపెద్ద మెగా ఐపీఓలలో వేగంగా వంద శాతం బిడ్డింగ్ పూర్తయిన ఇష్యూగా ఇది సంచలన రికార్డును నెలకొల్పింది. మొత్తం ఆఫర్ చేసిన 19.75 కోట్ల షేర్లకు గాను ఏకంగా 20.03 కోట్ల షేర్లకు బిడ్లు దాఖలు కావడం, జియో బ్రాండ్‌పై మదుపర్లకు ఉన్న అపారమైన నమ్మకాన్ని, విపరీతమైన క్రేజ్‌ను స్పష్టం చేస్తోంది.

ఈ భారీ పబ్లిక్ ఇష్యూకు పెద్ద పెద్ద సంస్థాగత పెట్టుబడిదారుల నుంచి ఊహించని రీతిలో రెస్పాన్స్ లభించింది. క్యూఐబీ కోటా ఏకంగా 3.25 రెట్లు సబ్‌స్క్రైబ్ కావడం విశేషం. అదే సమయంలో నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల కోటా 26 శాతం, చిన్న రిటైల్ ఇన్వెస్టర్ల పోర్షన్ 23 శాతం వరకు తొలి గంటలోనే పూర్తి అయ్యాయి. గతంలో మార్కెట్‌ను ఊపేసిన పెద్ద ఐపీఓలతో పోలిస్తే ఇది వేగవంతమైన రికార్డు. ఉదాహరణకు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ ఐపీఓ మొదటి రోజు మధ్యాహ్నం 2 గంటలకు, ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ తొలిరోజు ముగిసే సమయానికి, హ్యుందాయ్ మోటార్స్ మొదటి రోజు కేవలం 18 శాతం మాత్రమే బుక్ అయ్యాయి. కానీ వాటన్నింటికంటే పరిమాణంలో ఎంతో భారీగా ఉన్న జియో ప్లాట్‌ఫామ్స్ మాత్రం మార్కెట్ ప్రారంభమైన ఉదయమే ఫుల్ అయిపోయి దలాల్ స్ట్రీట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించింది.

ఈ చారిత్రాత్మక ఘట్టంపై జియో ప్లాట్‌ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాశ్ అంబానీ ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ఐపీఓ విజయవంతం కావడంపై ఆయన స్పందిస్తూ, జియో ప్రయాణంలో ఈ రోజు ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైందని తెలిపారు. డిజిటల్ సేవల విస్తరణ, మొబైల్ డేటా నాణ్యత పెంపు, హోమ్ బ్రాడ్‌బ్యాండ్, ఫిక్స్డ్ వైర్‌లెస్ యాక్సెస్ నెట్‌వర్క్‌లను మరింత బలపరచడంపై కంపెనీ ప్రధానంగా దృష్టి పెట్టిందని తెలిపారు. ప్రపంచ సాంకేతిక దిగ్గజాలైన మెటా, గూగుల్ వంటి సంస్థలు జియోలో ముఖ్యమైన భాగస్వాములుగా ఉండటం భారత్ డిజిటల్ భవిష్యత్తుకు ఉన్న అపార అవకాశాలను ప్రతిబింబిస్తోందని తెలిపారు.