దేశవ్యాప్తంగా ఉన్న ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ పెన్షనర్ల కనీస నెలవారీ పెన్షన్ పెంపుపై మరోసారి ముమ్మరంగా చర్చ ప్రారంభమైంది. ప్రస్తుతం నెలకు రూ.1,000 మాత్రమే పొందుతున్న నిరుపేద పెన్షనర్లకు ఈ మొత్తాన్ని రూ.7,500కు పెంచాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఈ నేపథ్యంలో నవంబర్ 19న జరగనున్న ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కీలక బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదన చర్చకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ పెంపుపై ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఖరారు వెలువడలేదని.. పెన్షనర్లు తుది నిర్ణయం వచ్చే వరకు ఆగాల్సి ఉంటుందని స్పష్టమవుతోంది.

ప్రస్తుతం అమలులో ఉన్న కనీస పెన్షన్ రూ.1,000ని కేంద్ర ప్రభుత్వం 2014 సెప్టెంబర్ నెలలో నిర్ణయించింది. గత పదేళ్ల కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు, వైద్య ఖర్చులు, ఇళ్ల అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో రిటైర్మెంట్ తర్వాత కేవలం ఈ పెన్షన్ ఆధారంగానే జీవించే వృద్ధులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నెలకు లభించే రూ.1,000తో మందులు, ఆహారం వంటి ప్రాథమిక అవసరాలు కూడా తీరడం లేదని పెన్షనర్ల సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అందుకే కనీస పెన్షన్‌ను రూ.7,500కి పెంచడంతో పాటు దానికి అదనంగా కరువు భత్యం కూడా అందించాలని కార్మిక సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.

ఈ సమస్యల పరిష్కారానికై గుజరాత్‌లోని గిర్ వేదికగా నవంబర్ 19న EPFO సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ 240వ సమావేశం జరగనుంది. సాధారణంగా ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో జరిగే ఈ సమావేశాన్ని చాలా ఏళ్ల తర్వాత మరో రాష్ట్రంలో నిర్వహించడం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో కనీస పెన్షన్ పెంపు ప్రతిపాదనలపై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు EPFO పరిధిలోని ఉద్యోగుల వేతన పరిమితిని రూ.15,000 నుంచి రూ.25,000కు పెంచే యోచన కూడా ఉండటంతో సామాజిక భద్రతా పథకాలపై సానుకూల వాతావరణం నెలకొంది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా కూడా ఈ డిమాండ్లను సానుకూలంగా సమీక్షిస్తున్నామని చెప్పారు.

నవంబర్ 19న జరిగే EPFO సమావేశంలో ప్రతిపాదిత పెంపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉండటంతో లక్షలాది మంది పెన్షనర్లు ఈ భేటీ కోసం తీవ్ర ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. రూ.7,500 పెన్షన్‌తో పాటు డీఏ చెల్లింపుపై తుది నిర్ణయం తీసుకుంటే వృద్ధులకు పెద్ద ఊరట లభిస్తుంది. అయితే బోర్డు సమావేశంలో చర్చ జరగడం వేరు, పెన్షన్ పెంపునకు ప్రభుత్వం నుంచి అధికారిక ఆమోదం లభించడం వేరు.. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తుది ప్రకటన చేసే వరకు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలకు రాకూడదని నిపుణులు సూచిస్తున్నారు.