
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఐటీ రంగాన్ని సంచలన నిర్ణయం తీసుకుంది. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోవడానికి ఏకంగా 60 వేల మందికి ‘వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్’ ప్రకటించి టెక్ ప్రపంచంలో తీవ్ర సంచలనం సృష్టించింది. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. అయితే హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌పై దీని ప్రభావం ఏ స్థాయిలో ఉండబోతోందని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు.
మైక్రోసాఫ్ట్ అంతర్గత గ్రేడింగ్ సిస్టమ్ ప్రకారం లెవల్ 70 అంతకంటే తక్కువ స్థాయిలో ఉన్న ఉద్యోగులు ఈ స్వచ్ఛంద నిష్క్రమణ ప్లాన్‌కు అర్హులుగా నిర్ణయించారు. ఈ ఆఫర్ పొందడానికి ఉద్యోగి వయస్సుతో గానీ, కంపెనీలో పనిచేసిన అనుభవంతో గానీ, లేదా వారి పనితీరుతో గానీ ఎలాంటి సంబంధం లేకపోవడం విశేషం. అయితే ఈ ఆఫర్ కంపెనీలోని అన్ని విభాగాలకూ వర్తించదు. సేల్స్, సెక్యూరిటీ, మార్కెటింగ్, కొన్ని కీలకమైన ఇంజినీరింగ్ విభాగాల నుంచి కంపెనీ ఉద్యోగులను తీయడం లేదు. కానీ కోపైలట్, కోర్ ఏఐ, విండోస్ + డివైజెస్, ఎక్స్‌బాక్స్, ఫైనాన్స్, హెచ్ఆర్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను మాత్రం ఈ ఆఫర్ ద్వారా బయటకు పంపుతుంది.
Also Read : కూరగాయల మార్కెట్‌ను తలపిస్తున్న చైనా గోల్డ్ మార్కెట్.. పసిడి కొనుగోళ్లలో రికార్డుల మోత.. కారణమిదే!
భారత్ వ్యాప్తంగా మైక్రోసాఫ్ట్‌కు దాదాపు 23,000 మంది ఉద్యోగులు ఉన్నారు. బెంగళూరు, చెన్నై, గురుగ్రామ్, నోయిడా, ముంబై వంటి ప్రధాన నగరాల్లో ఆఫీసులు ఉన్నప్పటికీ హైదరాబాద్ క్యాంపస్ అత్యంత కీలకమైనది. అమెరికాలోని రెడ్మండ్ ప్రధాన కార్యాలయం తర్వాత మైక్రోసాఫ్ట్‌కు అత్యంత భారీ ఇంజినీరింగ్ హబ్ హైదరాబాద్‌లోనే ఉంది. ఇక్కడ ఒక్క చోటే దాదాపు 10,000 మందికి పైగా సిబ్బంది టెక్నాలజీ, క్లౌడ్, కార్పొరేట్ సపోర్ట్ విభాగాల్లో పనిచేస్తున్నారు. హైదరాబాద్‌లోని విండోస్, కోపైలట్, ఏఐ సపోర్ట్ విభాగాల్లో ఉన్న ఉద్యోగులకు ఈ ప్లాన్ వర్తించే అవకాశం ఉంది. ఈ ప్లాన్ ద్వారా ఎంతమంది హైదరాబాద్ టెక్కీలు బయటకు వెళ్తారనేది రాబోయే రోజుల్లో స్పష్టం కానుంది.
కంపెనీ నేరుగా ఉద్యోగులను ఉద్యోగాల్లోంచి తీసివేసి వివాదాల్లో చిక్కుకోవడానికి బదులుగా ఈ ప్రత్యేక మార్గాన్ని ఎంచుకుంది. భవిష్యత్తులో వేరే కెరీర్ వైపు వెళ్లాలనుకునే వారికి లేదా కొత్త అవకాశాలు వెతుక్కునే వారికి ఒక గౌరవప్రదమైన మార్గాన్ని ఇవ్వడానికే ఈ ఆఫర్ తెచ్చామని మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ ఆమీ కొలెమాన్ వివరించారు. ఈ ఆఫర్ కింద బయటకు వెళ్లే వారికి కంపెనీ స్టాండర్డ్ సెవరెన్స్ రూపంలో ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు కొత్త ఉద్యోగం వెతుక్కునేందుకు అవసరమైన సపోర్ట్ ఇస్తామని హామీ ఇచ్చింది.
అంతేకాకుండా మైక్రోసాఫ్ట్ అంతర్గతంగా కోపైలట్ వంటి ఏఐ టూల్స్ వినియోగాన్ని విపరీతంగా పెంచేసింది. ఏఐ వాడకం వల్ల తక్కువ మందితోనే ఎక్కువ పని పూర్తవుతుండటంతో కంపెనీకి అదనపు సిబ్బంది అవసరం తగ్గింది. ఏఐపై భారీగా పెట్టుబడులు పెడుతున్న కంపెనీ అందుకు తగ్గట్టుగా ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణ చేస్తోంది. కంపెనీలు వేగంగా ఏఐ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నాయి. ఆ కారణం చేతనే ఈ లేఆఫ్‌లు జరుగుతున్నాయి. ఆకస్మికంగా ఉద్యోగం ఊడదీసే కంటే సెవరెన్స్ ప్యాకేజీ ఇచ్చి సాగనంపడం ఉద్యోగులకు కాస్త ఉపశమనమే అయినప్పటికీ హైదరాబాద్‌తో సహా భారత్‌లోని ఐటీ రంగంపై ఇది ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.
Also Read : జూనియర్ కాలేజీల అఫిలియేషన్‌పై వివాదం: ఇంటర్ బోర్డు క్లారిటీ









