
Vijay Antony : తమిళ స్టార్ హీరో, మ్యూజిక్ డైరెక్టర్ విజయ్ ఆంటోనీ తన అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. వైవిధ్యమైన కథలతో టాలీవుడ్, కోలీవుడ్‌లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. త్వరలోనే చిత్ర పరిశ్రమకు గుడ్‌బై చెప్పబోతున్నట్లు హింట్ ఇచ్చారు. రానున్న మూడేళ్ల తర్వాత తాను చెన్నై మహానగరాన్ని శాశ్వతంగా వదిలి, ఒక పల్లెటూరిలో స్థిరపడిపోతానని మీడియా సమావేశంలో బహిరంగంగా ప్రకటించారు.
విజయ్ ఆంటోనీ హీరోగా, శశి దర్శకత్వంలో గతంలో వచ్చిన ‘పిచ్చైకారన్’ (తెలుగులో ‘బిచ్చగాడు’) సినిమా ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ లో ఇప్పుడు ‘నూరు సామి’ అనే కొత్త సినిమా తెరకెక్కింది. జూన్ 19వ తేదీన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్‌లో విజయ్ ఆంటోనీ తన మనసులోని మాటను పంచుకున్నారు.
మీడియా సమావేశంలో విజయ్ ఆంటోనీ మాట్లాడుతూ.. “నేను ఎప్పుడూ చాలా సాదాసీదా జీవన విధానాన్ని (సింపుల్ లైఫ్‌స్టైల్) ఇష్టపడతాను. కేవలం నా వృత్తి, సినిమాల వల్లే ప్రస్తుతం చెన్నై నగరంలో నివసించాల్సి వస్తోంది. ప్రముఖ జోహో (Zoho) సాఫ్ట్‌వేర్ సంస్థ అధినేత శ్రీధర్ వెంబు గారు తన విలాసవంతమైన నగర జీవితాన్ని వదిలేసి ‘తెన్‌కాశీ’ అనే గ్రామంలో ఎలాగైతే సాధారణ జీవితం గడుపుతున్నారో, నేను కూడా అలాగే భవిష్యత్తులో స్థిరపడాలని బలంగా నిశ్చయించుకున్నాను” అని తెలిపారు.
తాజా చిత్రం షూటింగ్ అనుభవాలను పంచుకుంటూ.. “మా సినిమా షూటింగ్ ఎక్కువ భాగం ‘కల్లకురూచి’ అనే గ్రామీణ ప్రాంతంలో జరిగింది. అక్కడి వాతావరణం, ప్రజల ఆత్మీయత నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. నేటి కాలంలో చాలామంది పల్లెటూరి ప్రజలు మాల్స్, నగర ఆకర్షణల వైపు మొగ్గు చూపుతున్నారు. కానీ నిజానికి నగరాల్లో అంత ప్రత్యేకత ఏమీ లేదు. గ్రామాల్లో దొరికే స్వచ్ఛమైన గాలి, మనుషుల మధ్య ఉండే అనుబంధాలు, ప్రశాంతత మరెక్కడా దొరకవు. పల్లెటూరి జీవితమే అసలైన జీవితం” అని విజయ్ ఆంటోనీ పేర్కొన్నారు. ఆయన మాటలను బట్టి చూస్తే, వచ్చే మూడేళ్లలో ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసి, ఆ తర్వాత వెండితెరకు పూర్తిగా దూరం కానున్నట్లు స్పష్టమవుతోంది.









