
Bandi Bhagirath : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పోక్సో కేసులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌కు న్యాయస్థానంలో తాత్కాలిక ఉపశమనం లభించింది. దాదాపు నెల రోజులకు పైగా చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న భగీరథ్‌కు హైదరాబాద్ మల్కాజ్‌గిరిలోని పోక్సో ప్రత్యేక కోర్టు ఏడు రోజుల పాటు మధ్యంతర (తాత్కాలిక) బెయిల్ మంజూరు చేసింది. భగీరథ్ తన చివరి సెమిస్టర్ పరీక్షలకు హాజరుకావాల్సి ఉన్నందున, పరీక్షలు రాసుకునేందుకు వీలుగా కోర్టు ఈ బెయిల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల 28 వరకు అమల్లో ఉండే ఈ తాత్కాలిక బెయిల్ కోసం న్యాయస్థానం పలు కఠినమైన షరతులను కూడా విధించింది. కోర్టు ఉత్తర్వుల అనంతరం ఆయన చర్లపల్లి జైలు నుండి విడుదలయ్యారు.
అసలేం జరిగిందంటే..?
హైదరాబాద్ శివారులోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో గత మే 8వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో బండి భగీరథ్‌పై ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది. ఒక మైనర్ బాలిక తల్లి ఇచ్చిన రాతపూర్వక ఫిర్యాదు ఆధారంగానే పోలీసులు ఈ పోక్సో కేసు నమోదు చేశారు. బాధితురాలి తల్లి తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. 2025 డిసెంబర్ 31వ తేదీ రాత్రి, 17 ఏళ్ల తన కుమార్తెపై బండి భగీరథ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు అత్యాచారం చేశాడని ఆరోపించారు. ఈ ఫిర్యాదును పోలీసులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
అరెస్ట్ జైలు రిమాండ్
ఈ కేసులో నాటకీయ పరిణామాల మధ్య కూకట్ పల్లి డీసీసీ రితిరాజ్ ఆదేశాలతో ఐదు బృందాలుగా రంగంలోకి దిగిన పేట్ బషీరాబాద్ పోలీసులు.. మే 16వ తేదీ రాత్రి బండి భగీరథ్‌ను అరెస్ట్ చేశారు. అనంతరం మేడ్చల్ జిల్లా జడ్జి నివాసంలో ఆయనను హాజరుపరచగా, న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించారు. దాంతో పోలీసులు భగీరథ్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు. అప్పటినుంచి దాదాపు నెలరోజుల పాటు ఆయన జైలులోనే రిమాండ్ ఖైదీగా ఉన్నారు.
పోలీసు కస్టడీ – సీన్ రీకన్స్ట్రక్షన్
ఈ కేసు దర్యాప్తులో మరిన్ని కీలక ఆధారాలు సేకరించేందుకు పోలీసులు మల్కాజిగిరి కోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం భగీరథ్‌ను 3 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. కస్టడీలో భాగంగా పేట్ బషీరాబాద్ పోలీసులు ఆయనను చర్లపల్లి జైలు నుంచి మొయినాబాద్‌లోని ‘అరణ్య ఫామ్ హౌస్’కు తీసుకువెళ్లారు. నేరం జరిగినట్లుగా ఆరోపణలు ఉన్న ఆ ప్రాంతంలో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ (ఘటనా స్థల పునర్నిర్మాణం) నిర్వహించారు. ఈ కస్టడీ గడువు ముగిసిన తర్వాత, భగీరథ్ తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై కోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. పరీక్షల నిమిత్తం మల్కాజ్గిరి కోర్టు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్ మంజూరు చేయడంతో భగీరథ్ జైలు నుండి బయటకు వచ్చారు.
ముఖ్యమంత్రి మిత్ర ధర్మాన్ని పాటించారు..ఆర్.ఎస్. ప్రవీణ్ సంచలన వ్యాఖ్యలు
పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌కు మల్కాజ్గిరి కోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది.అయితే ఈ విషయంపై బీఆర్ఎస్ (BRS) నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా తీవ్రమైన సంచలన వ్యాఖ్యలు చేశారు. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలపై కేసు విచారణ కొనసాగుతుండగానే ఆయనకు ఈ బెయిల్ లభించడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. అధికారులు భగీరథ్‌ను జైలు నుండి విడుదల చేయగా, ఆయన ఇవాళ ఉదయం ఫార్చూనర్ కారులో దర్జాగా చర్లపల్లి జైలు నుండి తన ఇంటికి వెళ్లిపోయాడని ఆరోపించారు.
“ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు.. మీరు మిత్ర ధర్మాన్ని చక్కగా పాటించారు” అంటూ ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. హోంమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని పోలీసులు, ప్రాసిక్యూటర్లు నిందితుడి బెయిల్ పిటిషన్‌ను కోర్టులో గట్టిగా వ్యతిరేకించకపోవడం వల్లే భగీరథ్‌కు నిన్న రాత్రే బెయిల్ మంజూరు అయిందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ మహిళల, మైనర్ బాలికల ధన మాన ప్రాణాలు సురక్షితంగా ఉన్నాయని ప్రజలు ఇంకా నమ్ముతున్నారా? అంటూ ప్రవీణ్ కుమార్ ఈ సందర్భంగా తీవ్ర ప్రశ్నలు సంధించారు.









