Hanuman Temple : మహారాష్ట్రలోని పర్భానీ జిల్లాలో శనివారం మధ్యాహ్నం ఒక ఘోర ప్రమాదం సంభవించింది. జిల్లాలోని మానవత్ తాలూకా పరిధిలో గల యశ్వాడి గ్రామంలోని ప్రసిద్ధ త్రిమూర్తి హనుమాన్ దేవాలయ సభామండపం పైకప్పు (స్లాబ్) ఒక్కసారిగా కుప్పకూలింది. శనివారం కావడంతో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా ఉన్న సమయంలో ఈ దుర్ఘటన చోటుచేసుకోవడంతో అక్కడ తీవ్ర విషాదం నిండింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఆరుగురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది.
ఛత్రపతి శంభాజీనగర్ (ఔరంగాబాద్) నుండి సుమారు 190 కిలోమీటర్ల దూరంలో ఉన్న యశ్వాడి గ్రామంలోని ఈ హనుమాన్ ఆలయంలో గత కొన్ని రోజులుగా సభామండపానికి సంబంధించిన నిర్మాణ పనులు జరుగుతున్నాయి. శనివారం మధ్యాహ్నం 3:30 గంటల సమయంలో భక్తులు ఆలయ గర్భగుడి వెలుపల నిలబడి ప్రార్థనలు చేసుకుంటుండగా, నిర్మాణంలో ఉన్న బయటి హాలు (సభామండపం) పైకప్పు కొంత భాగం అకస్మాత్తుగా భక్తులపై కూలిపడింది. కాంక్రీట్ శిథిలాలు భారీ ఎత్తున పడటంతో భక్తులు వాటి కింద నలిగిపోయారు.

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, గ్రామస్తులు,ఆలయ సిబ్బంది హుటాహుటిన స్పందించి సహాయక చర్యలు ప్రారంభించారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, జిల్లా యంత్రాంగం,విపత్తు నిర్వహణ బృందాలు యుద్ధప్రాతిపదికన ఘటనా స్థలానికి చేరుకున్నాయి. శిథిలాల కింద చిక్కుకున్న సుమారు 20 నుండి 30 మంది భక్తులను రక్షించేందుకు జేసీబీలు, గ్యాస్ కట్టర్ల సహాయంతో సహాయక చర్యలు ముమ్మరం చేశారు. గాయపడిన బాధితులను వెంటనే పర్భానీ జిల్లా సివిల్ ఆసుపత్రికి, జాల్నాలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు సమాచారం.
మరోవైపు, పర్భానీ జిల్లాలోని సేలు తాలూకా పరిధిలో గల రావల్గావ్ గ్రామంలోని ఒక పురాతన హనుమాన్ ఆలయంలో కూడా శనివారం ఉదయం ఇలాంటి ప్రమాదమే జరిగింది. అక్కడ పాత ఆలయ కాంక్రీట్ స్లాబ్ కూలి రావల్గావ్‌కు చెందిన ఉత్తమ్ రావు లహనే (65) అనే వృద్ధుడు అక్కడికక్కడే మరణించగా, మరో ఐదుగురు భక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఇటీవలి వర్షాల కారణంగా పాత కాంక్రీట్ కట్టడం బలహీనపడటమే రావల్గావ్ ప్రమాదానికి ప్రాథమిక కారణంగా భావిస్తున్నారు. కాగా, యశ్వాడి గ్రామంలో నిర్మాణంలో ఉన్న సరికొత్త మండపం కూలిపోవడానికి గల కచ్చితమైన సాంకేతిక కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.