jd vance

JD Vance : స్విట్జర్లాండ్‌లో జరిగిన అమెరికా-ఇరాన్ శాంతి చర్చల ప్రారంభంలో ఒక వింతైన దౌత్యపరమైన సంఘటన చోటుచేసుకుంది. వాషింగ్టన్‌తో ఖతార్‌కు ఎంతో కాలంగా మంచి సంబంధాలు ఉన్నప్పటికీ, అలాగే ఈ చర్చల్లో కీలక మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నప్పటికీ.. ఖతార్ ప్రధాన మంత్రి షేక్ మహ్మద్ బిన్ అబ్దుల్‌రెహమాన్ అల్ థానీ అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వెన్స్‌ను దాటుకుంటూ వెళ్ళిపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఇటీవలే కుదిరిన ఇస్లామాబాద్ అవగాహనా ఒప్పందం (MoU) ప్రకారం.. మొదటి రౌండ్ చర్చల కోసం అమెరికా, ఇరాన్, ఖతార్, పాకిస్తాన్ దేశాల ప్రతినిధులు ఆదివారం బర్గెన్‌స్టాక్ రిసార్ట్‌లో
సమావేశమయ్యారు. ఆ సమయంలో అక్కడి రిసెప్షన్ ఏరియాలో జేడీ వెన్స్ మరికొందరు అధికారులతో కలిసి నిలబడి ఉన్నారు. ఖతార్ ప్రధాని షేక్ మహ్మద్ అక్కడికి వస్తూ.. జేడీ వెన్స్‌కు కనీసం నమస్కారం కూడా చేయకుండా నేరుగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, అక్కడి ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వైపు వెళ్ళిపోయారు. వారిని ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకుని, కరచాలనం చేశారు. అమెరికాకు అత్యంత ఆప్తమిత్రుడిగా ఉండే ఖతార్ దేశ ప్రధాని ఇలా ప్రవర్తించడం అక్కడున్న వారందరినీ ఆశ్చర్యపరిచింది.

మరోవైపు చర్చలు ప్రారంభం కావడానికి ముందే ఇరాన్ ప్రతినిధులు కూడా చాలా కఠినమైన వైఖరిని ప్రదర్శించారు. అమెరికా అధికారులతో కలిసి గ్రూప్ ఫోటో దిగడానికి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ, ముఖ్య చర్చల ప్రతినిధి మహ్మద్ బాకర్ గాలిబాఫ్ నిరాకరించారు. ఆ తర్వాత జేడీ వెన్స్‌తో పాటు అమెరికా ప్రత్యేక ప్రతినిధులు స్టీవ్ విట్‌కాఫ్, జారెడ్ కుష్నర్ ఉన్న గదిలోకి ఇరాన్ విదేశాంగ మంత్రి వచ్చారు. అయితే ఆయన కూడా అమెరికా అధికారులను కాదని, కేవలం పాకిస్తాన్ ప్రధాని షరీఫ్‌ను మాత్రమే కలిసి వెళ్ళిపోయారు.

తాము ఫోటో దిగడానికి నిరాకరించడం వెనుక ఒక స్పష్టమైన వ్యూహం ఉందని ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్రచారం చేస్తోంది. అయితే అమెరికా అధికారులు మాత్రం దీనిని ఖండించారు. ఈ ఫోటో సెషన్‌కు ఇరాన్ ముందే ఒప్పుకుందని, దాన్ని కవర్ చేయడానికి వారి సొంత మీడియాను కూడా తెచ్చుకున్నారని న్యూయార్క్ పోస్ట్ పత్రిక వెల్లడించింది.

కేవలం 80 నిమిషాలకే

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఇరాన్‌కు ఇచ్చిన హెచ్చరికల వల్ల ఈ చర్చల్లో మొదటి నుంచే ఉద్రిక్తతలు కనిపించాయి. చర్చలు ప్రారంభమైన కేవలం 80 నిమిషాలకే ఇరాన్ ప్రతినిధులు అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు వార్తలు వస్తున్నాయి. 60 రోజుల కాల్పుల విరమణ, మరికొన్ని కీలక అంశాలతో కూడిన 14 పాయింట్ల ఒప్పందంపై గత వారమే సంతకాలు జరిగినప్పటికీ.. ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం నిల్వలు, అణు కార్యక్రమాల లాంటి పెద్ద సమస్యలు ఇంకా అలాగే మిగిలిపోయాయి.

 

 

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.