High Court : తెలంగాణలోని ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలకు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం (హైకోర్టు)లో భారీ ఊరట లభించింది. ప్రభుత్వం ఇటీవల అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన జీవో నెంబర్ 9 (GO Ms No. 9) లోని కీలక మార్గదర్శకాలపై హైకోర్టు మధ్యంతర స్టే విధిస్తూ సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం ఫీజు రియింబర్స్‌మెంట్‌ నిధులు విడుదల చేసే వరకు కాలేజీల యాజమాన్యాలు విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయరాదంటూ సదరు జీవోలో పెట్టిన నిబంధనలను న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. ఈ స్టే ఆదేశాలు జూన్ 30 (వచ్చే మంగళవారం) వరకు వర్తిస్తాయని ధర్మాసనం స్పష్టం చేసింది.
ఈ విచారణ సందర్భంగా ప్రభుత్వంపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. “ప్రభుత్వం తరఫున కోట్లాది రూపాయల బకాయిలు విడుదల చేయకుండా, కాలేజీలు తమ రోజువారీ నిర్వహణను ఎలా కొనసాగిస్తాయి? విద్యార్థుల నుంచి కూడా ఫీజులు వసూలు చేయవద్దని ఆంక్షలు విధించడం ఎంతవరకు సమంజసం?” అని కోర్టు నిలదీసింది. బడ్జెట్ సమావేశాలు ముగిసినప్పటికీ, ఫీజు రియింబర్స్‌మెంట్‌ పథకానికి సంబంధించి బడ్జెట్‌లో ఎంత మొత్తాన్ని కేటాయించారు, ఆ నిధుల విడుదల ప్రక్రియ ఎందుకు ఆలస్యమవుతోంది అనే అంశాలపై సమగ్ర వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ప్రభుత్వం నుంచి రావాల్సిన కోట్ల రూపాయల బకాయిలు నిలిచిపోవడం వల్ల ప్రైవేట్ కాలేజీల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని యాజమాన్యాలు కోర్టు దృష్టికి తీసుకెళ్లాయి. ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బందికి నెలనెలా జీతాలు చెల్లించడం, భవన అద్దెలు, కరెంట్ బిల్లుల వంటి రోజువారీ కనీస నిర్వహణ ఖర్చులు భరించడం యాజమాన్యాలకు లెక్సగా మారిందని పేర్కొన్నాయి. ఈ క్రమంలో కోర్టు జోక్యం చేసుకుని స్టే విధించడంపై ప్రైవేట్ విద్యాసంస్థల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, ఈ వివాదంలో విద్యార్థుల పక్షాన కూడా కోర్టులో ఇంప్లీడ్ పిటిషన్లు దాఖలయ్యాయి. ప్రభుత్వం, కాలేజీల యాజమాన్యాల మధ్య నడుస్తున్న ఈ ఫీజుల పోరాటంలో తాము నలిగిపోతున్నామని విద్యార్థుల తరఫు న్యాయవాది ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల నిలిపివేత వల్ల ముఖ్యంగా ఇంజనీరింగ్, డిగ్రీ తదితర కోర్సుల్లో 2, 3, 4వ సంవత్సరాలు చదువుతున్న విద్యార్థులు సర్టిఫికెట్లు రాక, పరీక్షలకు కూర్చోలేక తీవ్రంగా నష్టపోతున్నారని, ఈ కొత్త నిబంధనలు కేవలం ఈ ఏడాది చేరే కొత్త విద్యార్థులకే వర్తించేలా చూడాలని ఆయన ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.
తీవ్ర వాదోపవాదాల అనంతరం స్పందించిన ప్రభుత్వ విశ్లేషకులు, ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు ఒక కీలక హామీ ఇచ్చారు. రాబోయే ఆగస్టు 15వ తేదీ లోపు ప్రైవేట్ కాలేజీలకు చెల్లించాల్సిన ఫీజు రియింబర్స్‌మెంట్‌ పెండింగ్ బకాయిలన్నింటినీ పూర్తిగా క్లియర్ చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వ ప్రకటనపై కాలేజీల యాజమాన్యాలు సానుకూలంగా స్పందిస్తూ.. ఒకవేళ ఆగస్టు 15 లోపు బకాయిలు మొత్తం చెల్లిస్తే, తాము దాఖలు చేసిన పిటిషన్లను వెనక్కి తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని కోర్టుకు వెల్లడించాయి.
హైకోర్టు ఈ కేసు తదుపరి విచారణను జూన్ 30వ తేదీ మంగళవారానికి వాయిదా వేసింది. ఈ లోగా ఫీజు రియింబర్స్‌మెంట్‌ బడ్జెట్ కేటాయింపులు, బకాయిల చెల్లింపుల రోడ్‌మ్యాప్‌కు సంబంధించిన పూర్తి వివరాలను, నివేదికలను కోర్టు ముందు ఉంచాలని ప్రభుత్వానికి కరాఖండిగా ఆదేశించింది. అప్పటివరకు కాలేజీల యాజమాన్యాలపై బలవంతపు ఆంక్షలు చెల్లవని స్పష్టం చేయడంతో, మంగళవారం రాబోయే తుది మార్గదర్శకాలపై విద్యార్థుల్లో, విద్యాసంస్థల్లో ఉత్కంఠ నెలకొంది.
MADHUKAR VYDHYULA
మధుకర్‌ వైద్యుల 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.