
London : తెలంగాణకు చెందిన 25 ఏళ్ల భారతీయ విద్యార్థి ఒకరు లండన్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. లండన్‌లో ఒక పుట్టినరోజు వేడుకకు హాజరైన మరుసటి రోజు ఉదయమే అతను శవమై కనిపించాడు. అతను ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని అతని రూమ్‌మేట్ చెబుతున్నప్పటికీ, అతను ఎలా చనిపోయాడనే దానికి సంబంధించి అధికారిక కారణాలు ఇంకా తెలియరాలేదు.
మృతుడిని తెలంగాణలోని కామారెడ్డి జిల్లా తలమడ్ల గ్రామానికి చెందిన ఎస్. శ్రీనాథ్ రెడ్డిగా గుర్తించారు. శ్రీనాథ్ రెడ్డి తండ్రి మధుసూదన్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. అతను ఉన్నత చదువుల కోసం 14 నెలల క్రితమే లండన్‌కు వెళ్లాడు. లండన్‌లో ఉంటున్న ఒక బంధువు కుమారుడు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం శ్రీనాథ్ రెడ్డి మృతదేహాన్ని అతని రూమ్‌మేట్ మొదట చూశాడు. అయితే, శ్రీనాథ్ చనిపోయిన విషయాన్ని ఆ రూమ్‌మేట్ చాలా ఆలస్యంగా అతని స్నేహితులకు సమాచారం ఇచ్చాడు.
Also Read : సొంత ప్రభుత్వంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే తిరుగుబావుటా..బట్టబయలైన అంతర్గత అసంతృప్తి
Indian Student Dead In London
శ్రీనాథ్ రెడ్డి ఉరివేసుకుని చనిపోయాడని రూమ్‌మేట్ చెబుతున్నప్పటికీ, తన కొడుకు మరణం వెనుక ఉన్న అసలు పరిస్థితులు ఏంటో ఇప్పటికీ స్పష్టంగా తెలియడం లేదని తండ్రి మధుసూదన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోవడానికి ముందు రోజు రాత్రి కూడా శ్రీనాథ్ తమతో ఫోన్లో మాట్లాడాడని, ఎప్పటిలాగే చాలా సాధారణంగానే సంభాషణ సాగిందని ఆయన చెప్పారు. ఆ రాత్రి తన కొడుకు ఒక స్నేహితుడి బర్త్‌డే పార్టీకి కూడా వెళ్లాడని తెలిపారు.
లండన్‌లోని డె మోంట్‌ఫోర్ట్ యూనివర్సిటీలో శ్రీనాథ్ రెడ్డి మాస్టర్స్ డిగ్రీ చదువుతున్నాడని ఒక విరాళాల వెబ్‌సైట్ ద్వారా తెలిసింది. శ్రీనాథ్ రెడ్డి చాలా సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడని, అతని విదేశీ చదువుల కోసం కుటుంబ సభ్యులు ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవడంతో పాటు బంధువుల దగ్గర కూడా డబ్బులు అప్పుగా తెచ్చారని తెలిసింది.
తన కొడుకు మృతదేహాన్ని ఇండియాకు తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం చేయాలని తండ్రి మధుసూదన్ రెడ్డి చేతులు జోడించి వేడుకుంటున్నారు. శ్రీనాథ్ రెడ్డి భౌతికకాయాన్ని స్వదేశానికి రప్పించి, చివరి అంత్యక్రియలు నిర్వహించడానికి అయ్యే ఖర్చుల కోసం లండన్‌లోని స్నేహితులు, దాతలు ఆన్‌లైన్ ద్వారా విరాళాలు సేకరించడం ప్రారంభించారు.
Also Read : గచ్చిబౌలి ఫ్లైఓవర్‌పై ఘోర ప్రమాదం: బుల్లెట్‌ను ఢీకొట్టిన స్కూటీ.. ఇద్దరు స్పాట్!









