
India : ఒకప్పుడు ప్రతి భారతీయ విద్యార్థి కల అమెరికా వెళ్లడమే ఉండేది. ఐఐటీ చదివిన వారైనా, సాధారణ కాలేజీ విద్యార్థులైనా సరే.. ఒక్కసారి అమెరికా వీసా వస్తే జీవితం సెట్ అయిపోతుందని అనుకునేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. అమెరికా ఎంబసీల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోవడం, అక్కడి కఠినమైన వలస నిబంధనల వల్ల విసిగిపోయిన చాలా మంది భారతీయ విద్యార్థులు ఇప్పుడు అమెరికాకు బై-బై చెప్పేస్తున్నారు. ఈ మారుతున్న రోజుల్లో విద్యార్థులకు యూరోపియన్ డ్రీమ్ కొత్త ట్రెండ్‌గా మారింది. జర్మనీ, ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ వంటి యూరప్ దేశాలు ఇప్పుడు భారతీయ విద్యార్థుల కొత్త కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. ఈ దేశాల్లో చదువు ఖర్చు అమెరికాతో పోలిస్తే చాలా తక్కువ మాత్రమే కాకుండా, చదువు పూర్తయ్యాక ఉద్యోగం వెతుక్కోవడానికి అక్కడి ప్రభుత్వాలు సులభంగా, ఎక్కువ కాలం పాటు ‘వర్క్ పర్మిట్’ ఇస్తున్నాయి. అమెరికా వీసా దొరుకుతుందో లేదో తెలియని గందరగోళం కంటే, యూరప్ వైపు వెళ్లడమే బెటర్ అని విద్యార్థులు భావిస్తున్నారు.
గత కొంతకాలంగా అమెరికా ఇమిగ్రేషన్ పాలసీలు చాలా కఠినంగా మారాయి. ట్రంప్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రూల్స్ ఇంకా కఠినతరమయ్యాయి. పరిస్థితి ఎలా ఉందంటే.. భారతీయ విద్యార్థులు వీసా ఇంటర్వ్యూ స్లాట్ కోసం నెలల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. కొన్నిసార్లు కాలేజీల్లో అడ్మిషన్ల సమయం అయిపోతున్నా వీసా స్లాట్ దొరకడం లేదు. దీనికి తోడు సోషల్ మీడియా అకౌంట్లను తనిఖీ చేయడం, చిన్న చిన్న కారణాలకే వీసాలను రిజెక్ట్ చేస్తుండటంతో విద్యార్థులు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. లక్షలాది రూపాయలు ఖర్చు చేసిన తర్వాత కూడా వీసా వస్తుందో రాదో తెలియని పరిస్థితి ఉండటంతో విద్యార్థులు ప్రత్యామ్నాయాల వైపు చూస్తున్నారు.
Also Read : లండన్‌లో తెలంగాణ విద్యార్థి మృతి.. బర్త్‌డే పార్టీకి వెళ్లిన కొన్ని గంటలకే
ఇప్పుడు అంత ఈజీ కాదు
చదువు పూర్తయిన తర్వాత అమెరికాలో ఉద్యోగం దొరకడం కూడా ఇప్పుడు అంత ఈజీ కాదు. అమెరికాకు F-1 వీసాపై వెళ్లే విద్యార్థులకు OPT కింద కొంతకాలం పనిచేసే అవకాశం వస్తుంది. కానీ ఆ తర్వాత అక్కడ స్థిరపడటానికి అవసరమైన H-1B వీసా రావడం అనేది ఒక లాటరీలా మారిపోయింది. కంపెనీలకు కూడా విదేశీ విద్యార్థులను స్పాన్సర్ చేయడం భారీ ఖర్చుతో కూడుకున్న పనిగా, చట్టపరమైన ఇబ్బందులతో కూడినదిగా మారింది. దీంతో కంపెనీలు స్థానిక అమెరికన్లకే మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాయి. అంతంత ఖరీదైన చదువుల కోసం తీసుకున్న లోన్లు కట్టాలంటే వెంటనే ఉద్యోగం కావాలి, కానీ అమెరికాలో అది ఇప్పుడు కష్టంగా మారింది.
అమెరికా కాకపోతే మరి ఎక్కడికి వెళ్లాలి? దానికి సమాధానమే యూరప్. జర్మనీ, ఫ్రాన్స్ వంటి దేశాలు ఈ అవకాశాన్ని చక్కగా వాడుకుంటున్నాయి. జర్మనీలోని చాలా పబ్లిక్ యూనివర్సిటీలలో ట్యూషన్ ఫీజు అస్సలు ఉండదు, అంటే అక్కడ చదువు దాదాపు ఉచితం. దీనితో పాటు, యూరప్‌లోని చాలా దేశాలు చదువు పూర్తయిన తర్వాత ఉద్యోగం వెతుక్కోవడానికి 18 నుండి 24 నెలల వరకు స్టే-బ్యాక్ సమయాన్ని ఇస్తున్నాయి. అక్కడ వీసా ప్రాసెస్ కూడా అమెరికా అంత గందరగోళంగా ఉండదు. పైగా పీఆర్ రావడం కూడా చాలా సులభం.
భారతీయ విద్యార్థులు అమెరికా వైపు చూడకపోవడంతో అక్కడి యూనివర్సిటీలకు పెద్ద దెబ్బ తగులుతోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థకు భారతీయ విద్యార్థులు ఏడాదికి దాదాపు 9 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని అందిస్తున్నారు. వీసాల కొరత, విద్యార్థుల సంఖ్య తగ్గడం వల్ల చాలా అమెరికన్ కాలేజీలు భారీ ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికైనా వీసా నిబంధనలను సడలించకపోతే, ప్రపంచంలోని అత్యుత్తమ ప్రతిభావంతులను అమెరికా ఎప్పటికీ కోల్పోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Also Read : పాకిస్తాన్లో భారీ భూకంపం!









