bjp

తెలంగాణ బీజేపీ అంతర్గత వ్యవహారాలపై పార్టీ అధిష్ఠానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటీవల జరిగిన పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, టీబీజేపీ ముఖ్యనేతలకు పార్టీ జాతీయ నేత, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జ్ నితిన్ నబీన్ అత్యంత సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. గ్రూపు రాజకీయాలు, కుల సమీకరణాలపైనే దృష్టి పెడితే సహించేది లేదని ఆయన తీవ్ర స్వరంతో హెచ్చరించారు.

రాష్ట్రంలో కొందరు నేతలు ప్రజా సమస్యలను వదిలేసి కుల రాజకీయాలకు తెరలేపడంపై నితిన్ నబీన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నేతలంతా తమలో ఉన్న కుల పిచ్చిని వెంటనే బంద్ చేయాలని, ఇలాగే ఉంటే పార్టీ ఏమాత్రం ముందుకు పోదని స్పష్టం చేశారు. ఇప్పటికైనా నేతలు మారాలని, ఏ ఒక్క వ్యక్తి కంటే పార్టీయే సుప్రీం అని గుర్తు చేస్తూ ‘పార్టీ ఫస్ట్.. లీడర్ నెక్స్ట్’ అనే సూత్రాన్ని ప్రతి ఒక్కరూ వంటబట్టించుకోవాలని ఆదేశించారు.

రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ప్రకారం బీజేపీ అధికారంలోకి రావడానికి అద్భుతమైన స్కోప్ ఉందని, కానీ నాయకత్వ లోపాలు, సమన్వయ లోపం వల్లే మనమే విఫలం అవుతున్నామని ఆయన అభిప్రాయపడ్డారు. ఢిల్లీ స్థాయిలో కూర్చున్నా రాష్ట్రంలో ఎవరేమి చేస్తున్నారో, ఎవరి పనితీరు ఎలా ఉందో తన దగ్గర పూర్తి రిపోర్ట్ ఉందని నేతలకు చురకలు అంటించారు. ఇవాళ తాను చెబుతున్న మాటలను, తేదీని గుర్తు పెట్టుకోవాలని, భవిష్యత్తులో మనం అధికారంలోకి వచ్చాక ఈ రోజును ఖచ్చితంగా గుర్తు చేసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు.

Also Read : హైదరాబాద్ టాప్ రెస్టారెంట్లలో ఈగలు, బొద్దింకలు.. తింటే పైకి పోవడమే!

రాబోయే రోజుల్లో నేతలంతా ఏసీ రూమ్‌లకే పరిమితం కాకుండా గ్రౌండ్ లెవెల్‌కి వెళ్లి ప్రజా సమస్యలపై గట్టిగా ఫైట్ చేయాలని నితిన్ నబీన్ దిశానిర్దేశం చేశారు. పై నుంచి ఎవరో వస్తారని ఎదురుచూడకుండా, క్షేత్రస్థాయిలో మీరే ఒక బలమైన పొలిటికల్ నరేటివ్ క్రియేట్ చేయాలని పిలుపునిచ్చారు. ఇందుకోసం నేతలకు నెల రోజుల డెడ్‌లైన్ విధించారు. రాబోయే నెల రోజుల్లో రాష్ట్రంలో పార్టీకి అనుకూల వాతావరణాన్ని సృష్టించాలని టాస్క్ ఇచ్చారు.

స్థానిక నేతలు క్షేత్రస్థాయిలో గట్టిగా శ్రమిస్తే, ఆ తర్వాత హైకమాండ్ నుంచి ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో, ఎలాంటి మద్దతు ఇవ్వాలో తాము చూసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యంగా పని చేయాలని తేల్చి చెప్పారు.

ప్రస్తుతం తెలంగాణలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల మధ్య వివిధ అంశాలపై పొలిటికల్ వార్ నడుస్తున్న తరుణంలో, బీజేపీ ప్రధాన ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తోంది. అయితే పార్టీలోని అంతర్గత విభేదాలు, నేతల మధ్య గ్రూపు తగాదాలు క్యాడర్‌ను అయోమయంలో పడేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నితిన్ నబీన్ ఇచ్చిన ఘాటు వార్నింగ్ , నెల రోజుల డెడ్‌లైన్ తర్వాత టీబీజేపీ ముఖ్యనేతలు తమ పంథా మార్చుకుని కలిసికట్టుగా ప్రజల్లోకి వెళ్తారా లేదా అనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

Also Read : లండన్‌లో తెలంగాణ విద్యార్థి మృతి.. బర్త్‌డే పార్టీకి వెళ్లిన కొన్ని గంటలకే

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.