siya Goyal

Siya Goyal : కేతన్ అగర్వాల్ హత్య కేసులో ఊహించని మలుపులు వెలుగులోకి వస్తున్నాయి. సియా గోయల్ ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ఈ హత్య వెనుక భారీ కుట్ర పన్నినట్లు పోలీసులు ఇప్పటికే గుర్తించారు. అయితే ఫిబ్రవరిలో కేతన్‌తో నిశ్చితార్థం జరిగిన తర్వాత, సుమారు నాలుగు నెలల క్రితమే సియా తన ప్రియుడు చేతన్‌ను సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులో రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.

నవంబర్‌లో కేతన్, సియాల పెళ్లి జరగాల్సి ఉండగా.. జూన్ 18న లోహగడ్ కోటపై నుండి కిందపడి కేతన్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. సియాకు ఈ పెళ్లి ఇష్టం లేకపోవడంతోనే ప్రియుడితో కలిసి ఈ హత్యకు ప్లాన్ చేసిందని పోలీసులు గుర్తించారు. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద వీరిద్దరూ చేసుకున్న పెళ్లి సర్టిఫికేట్ నిజమేనా అని నిర్ధారించుకోవడానికి పూణే రూరల్ పోలీసులు ప్రస్తుతం ఆ రిజిస్ట్రార్ ఆఫీస్ రికార్డులను తనిఖీ చేస్తున్నారు. ఈ పెళ్లికి సాక్షులుగా సంతకాలు చేసిన సియా కాలేజీ స్నేహితులిద్దరిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. అలాగే, వీరిద్దరూ పెళ్లి దండలతో ఉన్న ఫోటోలను తమ ప్రైవేట్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ నుండి డిలీట్ చేయగా, వాటిని రికవర్ చేయడానికి సైబర్ టీమ్ ప్రయత్నిస్తోంది.

అయితే, ఈ హత్యను అంత అర్జంట్‌గా ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానికి ఒక బలమైన కారణం బయటపడింది. నవంబర్‌లో ఉదయ్‌పూర్‌లో భారీ ఎత్తున డెస్టినేషన్ వెడ్డింగ్ చేయడానికి కేతన్ కుటుంబ సభ్యులు ప్లాన్ చేశారు. అందుకోసం సియాకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఐడీ కార్డులు, డాక్యుమెంట్లను వారు అడిగారు. ఒకవేళ ఆ డాక్యుమెంట్లు ఇస్తే తాము రహస్యంగా చేసుకున్న పెళ్లి విషయం ఎక్కడ బయటపడుతుందోనని సియా భయపడింది. లీగల్‌గా దొరికిపోతామనే భయంతోనే, పెళ్లి దాకా వెళ్లకుండా కేతన్‌ను ముందే ముగించేయాలని ప్రియుడితో కలిసి స్కెచ్ వేసింది. జూన్ 18న కేతన్, సియాలు కోటపైకి వెళ్లగా.. చేతన్ వారిని వెంబడించి లోయలోకి నెట్టేసి హత్య చేశాడని పోలీసులు నిర్ధారించారు. ప్రస్తుతం నిందితులిద్దరూ జైలులోనే ఉన్నారు.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.