
Hyderabad Bonalu 2026 : హైదరాబాద్ సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువెత్తు రూపంగా నిలిచే చారిత్రాత్మక ఆషాఢ బోనాల జాతర ఉత్సవాల ముహూర్తం ఖరారైంది. భాగ్యనగరంలో ఈ ఏడాది (2026) బోనాల మహోత్సవాలు జులై 16వ తేదీ నుండి ప్రారంభమై, ఆగస్టు 13వ తేదీ వరకు నెల రోజుల పాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమన్వయ సమీక్షా సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా మంత్రి ఆషాఢ బోనాల జాతర అధికారిక పోస్టర్, బ్రోచర్‌ను ఆవిష్కరించి, ఉత్సవాల విజయవంతానికి పిలుపునిచ్చారు.
ఈ ఉత్సవాలు తెలంగాణ గంగా-జమున తెహజీబ్ (లౌకిక స్ఫూర్తి)కి ప్రతీకగా నిలుస్తాయని, హిందూ-ముస్లిం ఐక్యత యావత్ దేశానికి ఆదర్శమని మంత్రి కొనియాడారు. సాంప్రదాయం ప్రకారం, జులై 16న లంగర్ హౌస్ కూడలి నుంచి ప్రారంభమయ్యే ఘటాల ఊరేగింపుతో గోల్కొండ కోటలోని జగదాంబికా మహంకాళి అమ్మవారికి తొలి బోనాన్ని సమర్పిస్తారు. గోల్కొండ కోట పరిధిలో జూలై 16, 19, 23, 26, 30 మరియు ఆగష్టు 2, 6, 9, 13 తేదీల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు, రథం ఊరేగింపు, తొట్టెలు మరియు మెట్ల పూజలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్నారు.
నెల రోజుల పాటు సాగే ఈ ఉత్సవాల సమగ్ర షెడ్యూల్‌ను పరిశీలిస్తే.. జులై 16న గోల్కొండ బోనాలతో వేడుకలు ప్రారంభం కాగా, జులై 19న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల మహోత్సవానికి అంకురార్పణ జరుగుతుంది. జులై 26న నగరంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తారు. అనంతరం ఆగస్టు 2న సుప్రసిద్ధ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి (లష్కర్) బోనాలు, ఆగస్టు 9న చారిత్రాత్మక లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారితో పాటు పాతబస్తీలోని అన్ని ప్రధాన ముత్యాలమ్మ, మహంకాళి ఆలయాల్లో బోనాల జాతర జరుగుతుంది. చివరగా ఆగస్టు 10న అమ్మవారి భవిష్యవాణి (రంగం) వినిపించడం, ఘటాల సాగనంపుటతో ఉత్సవాలు ముగుస్తాయి.
లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా రూ.20 కోట్ల నిధులను కేటాయించింది. ఈ నిధుల ద్వారా నగరంలోని అన్ని చిన్న, పెద్ద ఆలయాలకు ఆర్థిక సాయం అందించడంతో పాటు పరిసర ప్రాంతాలలో మౌలిక వసతులను మెరుగుపరుస్తారు. ముఖ్యంగా దర్శనానికి వచ్చే భక్తుల కోసం ట్రాఫిక్ నియంత్రణ, క్యూ లైన్లు, బారికేడ్ల ఏర్పాటు, తాగునీటి సరఫరా, నిరంతర విద్యుత్, పారిశుద్ధ్య నిర్వహణ వంటి పనులను జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్ శాఖలు సమన్వయంతో పూర్తి చేయాలని మంత్రి కాలపరిమితిని నిర్దేశించారు.
భక్తుల రక్షణ, భద్రత దృష్ట్యా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కోట ప్రాంగణంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఆలయాల పరిసరాలలో సీసీ కెమెరాల నిఘాను పెంచడంతో పాటు అనుమానితుల ఫొటోలతో కూడిన వాల్ పోస్టర్లను ప్రదర్శిస్తూ భక్తులను అప్రమత్తం చేయనున్నారు. వేసవి, వర్షాకాలాల నేపథ్యంలో మొబైల్ టాయిలెట్లు, వైద్య శిబిరాలు, ప్రత్యేక ఓఆర్‌ఎస్ కేంద్రాలు మరియు 108 అంబులెన్స్ సేవలను నిరంతరం అందుబాటులో ఉంచనున్నారు. అలాగే విద్యుత్ వైరింగ్ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు.
ఈ ఉత్సవాల్లో దైవానికే అంకితమైన శివసత్తులకు బోనాల సమర్పణ సమయంలో అన్ని ప్రభుత్వ శాఖలు ప్రత్యేకంగా సహకరించాలని మంత్రి సూచించారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, బాలింతల సౌకర్యార్థం ప్రత్యేక లైన్లు మరియు సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. భాగ్యనగర వైభవాన్ని, సంస్కృతిని చాటిచెప్పే ఈ ఆషాఢ బోనాల జాతరను భక్తులందరూ ఎంతో సంతోషంతో, ప్రశాంతమైన వాతావరణంలో దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
Also Read : థియేటర్లలో అక్కినేని ఫ్యాన్స్ జాతర.. అఖిల్ ఖాతాలో మరో హిట్.. లెనిన్ మూవీ ఎలా ఉందంటే?









