CM Revanth Reddy :ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా పర్యటనలో చేసిన సంచలన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి పెను దుమారం రేపాయి. చింతకాని మండలం జగన్నాథపురంలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ‘రైతు ఆశీర్వాద సభ’కు సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేదిక నుంచే ఆయన భవిష్యత్తు ఎన్నికలపై భద్రాద్రి రాముడి సాక్షిగా చేసిన ప్రతిన, ప్రతిపక్షాలపై చేసిన ఘాటు విమర్శలు రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

ఈ చారిత్రాత్మక సభ వేదిక నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు తీపి కబురు అందించారు. వానాకాలం సీజన్ కు సంబంధించిన రైతు భరోసా తుది విడత నిధులు రూ.1009 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లోకి విడుదల చేశారు. ఈ నిధుల విడుదలతో కలిపి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం రూ.8,759 కోట్ల పెట్టుబడి సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసినట్లయింది. ఇప్పటిదాకా 74 లక్షల మంది రైతులకు చెందిన 1.45 కోట్ల ఎకరాల భూములకు విజయవంతంగా పెట్టుబడి సాయం అందించామని సీఎం ఈ సందర్భంగా సగర్వంగా ప్రకటించారు. తమ ప్రభుత్వం రైతు పక్షపాతి అని, గత ప్రభుత్వంలా వరి వేస్తే ఉరి అనకుండా, బోనస్ ఇస్తూ రైతులను రాజును చేయడమే లక్ష్యంగా పనిచేస్తోందని స్పష్టం చేశారు.

ఖమ్మం జిల్లాతో తనకున్నా అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. “నా రాజకీయ ఎదుగుదలలో ఖమ్మం జిల్లా ఒక గుండెకాయలా నిలిచింది” అని ఆయన పేర్కొన్నారు. గత పదేళ్ల బీఆర్ఎస్ రాక్షస పాలనను అంతం చేయడానికి 2023 జులైలో ఇక్కడే ఒక అద్భుతం జరిగిందని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో జనం ఉప్పెనలా తరలివచ్చారని గుర్తుచేశారు. సరిగ్గా 36 నెలల తర్వాత మళ్లీ అదే జులైలో ఇవాళ ప్రజాపాలనను ఆశీర్వదించడానికి రైతాంగం మళ్లీ ఉప్పెనలా తరలివచ్చిందని, బీఆర్ఎస్‌ను ఇక్కడ మళ్లీ మొలకెత్తనీయబోమని ప్రజలు ఒట్టు పెట్టారని సంతోషం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో బీఆర్ఎస్ డబ్బు మూటలను కాంగ్రెస్ తట్టుకోలేదని కొందరు అన్నా, 65 సీట్లు గెలుస్తామని చెప్పి మరీ 64 సీట్లు సాధించి చూపించామని, ఉప ఎన్నికల్లో మరో రెండు గెలిచి మా బలాన్ని నిరూపించుకున్నామని గుర్తుచేశారు.

భవిష్యత్తు ఎన్నికలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం రాముడి సాక్షిగా చేసిన శపథం సభలో హైలైట్‌గా నిలిచింది. “2029 జూన్‌ లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత రాష్ట్రంలో పార్లమెంట్ సీట్లు 25కు, అసెంబ్లీ సీట్లు 119 నుంచి 182కు పెరుగుతాయి. ఆ 182 స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే 117 సీట్లు గెలిచి, రెండోసారి సగర్వంగా ప్రజాపాలనను తీసుకొస్తుంది. భద్రాచలం రాముడీ మీద ఆన వేసి చెబుతున్నా.. ఇది రాసి పెట్టుకో కేసీఆర్” అని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రతిన పూనారు. ఇది కేవలం తన మాట కాదని, ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పూనిన ప్రతిన అని స్పష్టం చేశారు. కల్వకుంట్ల కౌరవ కుటుంబాన్ని వచ్చే కురుక్షేత్రంలో పాతాళానికి తొక్కేది మేమే అని ధీమా వ్యక్తం చేశారు.

Also Read : హైదరాబాద్‌లో బోనాల జాతర… ఎప్పటినుంచంటే?

విపక్ష నేతలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేత హరీశ్ రావుపై ఘాటు విమర్శలు చేశారు. హరీశ్ రావు బీజేపీలోకి వెళ్లేందుకు మంతనాలు జరుపుతున్నారో లేదో భద్రాచలం రాముడు, కేసీఆర్‍పై ఒట్టేసి చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సొంత సర్వేలో బీఆర్ఎస్ గెలవబోతోందని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన తీవ్రంగా ఖండించారు. వచ్చే ఎన్నికల్లో ఎన్ని సీట్లు ఉంటాయో, ఏ రిజర్వేషన్లు ఉంటాయో తెలియకుండానే ఎవరైనా సర్వేలు చేయిస్తారా అని ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ కూడా తమ పంతం నెగ్గించుకునేందుకు ప్రతిపక్షాలను చీల్చుతోందని దుయ్యబట్టారు.

కాళేశ్వరం ప్రాజెక్టు, కన్నెపల్లి పంప్ హౌస్‍ల విషయంలో బీఆర్ఎస్ నేతల డిమాండ్లపై సీఎం తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. కన్నెపల్లి పంప్‍లు ఆన్ చేస్తే భద్రాచలం రాముడి గుడి సహా 44 గ్రామాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని అధికారులే చెబుతుంటే, బీఆర్ఎస్ నేతలు వాటిని ఆన్ చేయాలని డిమాండ్ చేయడంపై మండిపడ్డారు. “మీ లుచ్చా రాజకీయాల కోసం భద్రాచలం రాముడు, గ్రామాలు మునగాలా?” అని ప్రశ్నించారు. కేసీఆర్ ఇంట్లో ఒకరంటే మరొకరికి పడదని, వారి రాజకీయాల కోసం ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రజల భద్రతే మా ప్రభుత్వానికి ముఖ్యమని స్పష్టం చేశారు.

ఉచిత కరెంట్ విషయంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దుష్ప్రచారాన్ని సీఎం ఎండగట్టారు. కాంగ్రెస్ వస్తే కరెంట్ ఉండదని కేసీఆర్, ఆయన కుటుంబం విష ప్రచారం చేశారని, కానీ ఇవాళ తాము ఉచిత కరెంట్ ఇస్తున్నామని గుర్తుచేశారు. “నేను కల్వకుంట్లోళ్లను అడుగుతున్నా.. ఉదయం, మధ్యాహ్నం, రాత్రి పూట ఎప్పుడైనా కరెంట్ వైర్‍ను పట్టుకోండి.. కాకిలా మాడి మసి అయిపోతారు. ఉచిత కరెంట్ కాంగ్రెస్ పేటెంట్ రైట్” అని సీఎం ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రజాప్రభుత్వంలో రైతులకు బేడీలు వేసే రోజులు పోయాయని, రైతులను రాజులను చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని స్పష్టం చేశారు.

తమ ప్రజాప్రభుత్వంలో రాష్ట్రంలో రామరాజ్యం తీసుకువస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. అభివృద్ధి, సంక్షేమం విషయంలో ఎవరికీ అన్యాయం జరగనివ్వబోమని అన్నారు. గత 30 నెలల్లో రైతుల కోసం వివిధ కార్యక్రమాల కోసం రూ.1 లక్ష 70 వేల కోట్లు ఖర్చు పెట్టామని, ఇంత ఖర్చు చేసిన ప్రభుత్వం దేశంలో మరే రాష్ట్రంలోనూ లేదని సగర్వంగా ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్‍కు గుండుసున్నా వస్తుందని చెప్పామని, అదే జరిగిందని, రాబోయే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయకేతనం ఎగురవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. చీమలదండై తరలివచ్చిన ప్రజలను చూసి తన గుండె పులకరించిపోయిందని, వారి నమ్మకాన్ని వమ్ము చేయబోమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Also Read : థియేటర్లలో అక్కినేని ఫ్యాన్స్ జాతర.. అఖిల్ ఖాతాలో మరో హిట్.. లెనిన్ మూవీ ఎలా ఉందంటే?

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.