
Dhanush : సౌత్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడో ఆసక్తికరమైన పోరు మొదలైంది. గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో రీసెంట్గా ఒక భారీ పాన్ ఇండియా సినిమా (వర్కింగ్ టైటిల్: గాడ్ ఆఫ్ వార్) అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. సుబ్రహ్మణ్య స్వామి బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా రాబోతుందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. అయితే, ఇప్పుడు ఇదే కాన్సెప్ట్‌తో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబోకు గట్టి పోటీనిస్తూ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ రంగంలోకి దిగారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న సరికొత్త సినిమా తమిళ్ మురుగన్ ఫస్ట్ లుక్ పోస్టర్ శుక్రవారం నాడు విడుదలై సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో ధనుష్ ఒక పెద్ద ఏనుగుపై కూర్చుని, చేతిలో మురుగన్ దేవుడి పవర్ఫుల్ ఆయుధమైన వేల్ పట్టుకుని, ఒక భారీ సైన్యం ముంవదు చాలా గంభీరంగా కనిపిస్తున్నారు. తమిళనాడులో మురుగన్ దేవుడిని తమిళ దేవుడు అని ఎంతో భక్తితో కొలుస్తారు. తెలుగు రాష్ట్రాల కంటే తమిళులకు మురుగన్‌పై ఉండే ఎమోషన్ వేరు. అందుకే ఈ నేటివిటీని వెట్రిమారన్ లాంటి రా అండ్ రస్టిక్ డైరెక్టర్ తనదైన స్టైల్లో చూపించబోతుండటంతో, ఇటు ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు ఇది గట్టి పోటీగా మారబోతోందని సినీ వర్గాల్లో ఒక రేంజ్లో చర్చ నడుస్తోంది.
Also Read : అర్జున్ దాస్ vs శాండీ మాస్టర్.. సూపర్ హీరో బాబు ఫస్ట్ లుక్ వచ్చేసింది!
ధనుష్, వెట్రిమారన్ కలయికలో వస్తున్న ఐదో సినిమా ఇది. ఇంతకుముందు వీరిద్దరి కాంబోలో వచ్చిన పొల్లాదవన్, ఆడుకలం, వడ చెన్నై, అసురన్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయాలు సాధించాయి. నిజానికి వీరు వడ చెన్నై 2: అన్బువిన్ ఎళుచ్చి సినిమాను చేయాల్సి ఉంది, కానీ దాన్ని పక్కనపెట్టి మరీ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను లైన్లోకి తెచ్చారు. ఈ సినిమా కథను అరివుమతి రాయగా, సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందనేది ఇంకా ప్రకటించలేదు.
మరోవైపు ధనుష్ చేతిలో మరికొన్ని ఆసక్తికరమైన సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి తాత్కాలికంగా OM అని పేరు పెట్టిన భారీ చిత్రం. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో ధనుష్‌తో పాటు మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాకు కూడా సాయి అభ్యంకరే సంగీతం అందిస్తుండటం విశేషం. ఈ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ 2026 అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది.
ఇక ధనుష్ గత సినిమాల విషయానికి వస్తే.. ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో చేసిన తేరే ఇష్క్ మే సినిమా ఒక లవ్ బ్రేకప్ తర్వాత శంకర్ అనే వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయనే కథతో తెరకెక్కింది. ప్రస్తుతం ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే 1991 గల్ఫ్ యుద్ధం నేపథ్యంతో వచ్చిన కార అనే తమిళ్ సినిమా కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ యుద్ధం వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా దెబ్బతింది, ఇంధన సంక్షోభం ఎలా వచ్చిందనే అంశాలను ఆ సినిమాలో చాలా బాగా చూపించారు. మొత్తానికి ఒకే దేవుడి కాన్సెప్ట్‌తో ఇటు ఎన్టీఆర్-త్రివిక్రమ్, అటు ధనుష్-వెట్రిమారన్ బాక్సాఫీస్ బరిలో నిలవనుండటంతో ఈ సరికొత్త వార్ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.
Also Read : నేను బైసెక్సువల్.. బిగ్ బాస్ బ్యూటీ సంచలన కామెంట్స్!









