
Mudragada : కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం (73) అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో ఫోన్‌లో చర్చించిన తర్వాతే సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు. ముద్రగడ పద్మనాభం గతంలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా ప్రజలకు చేసిన సేవలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ గౌరవం కల్పిస్తోంది.
మరోవైపు, ముద్రగడ అంత్యక్రియల సమయంలో ఆయన కుమార్తె క్రాంతిని పద్మనాభం అనుచరులు అడ్డుకున్నారు. తండ్రిని కడసారి చూసేందుకు వచ్చిన ఆమెను వారు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసుల రక్షణతో ఆమె కిర్లంపూడి చేరుకున్నారు. దూరం నుంచే తండ్రిని చివరిసారి చూసుకున్న క్రాంతి, అనుచరుల నిరసనల మధ్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. తండ్రిని చూసేందుకు వచ్చిన కుమార్తెపై అనుచరులు నినాదాలు చేయడం అక్కడ చర్చనీయాంశంగా మారింది.
Also Read : ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు… బిగ్ ట్విస్ట్ ఇచ్చిన ముద్రగడ ఫ్యామిలీ!
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తండ్రికి, కుమార్తె క్రాంతికి మధ్య విబేధాలు తలెత్తాయి. తాను చనిపోతే క్రాంతి రావొద్దని ముద్రగడ అప్పట్లోనే స్పష్టంగా చెప్పినట్లు తెలుస్తోంది. అందుకే, తండ్రిని కడసారి చూసేందుకు వచ్చిన క్రాంతిని ముద్రగడ అనుచరులు అడ్డుకుని గో బ్యాక్ క్రాంతి అంటూ నినాదాలు చేశారు.
ప్రారంభంలో ప్రత్తిపాడు వద్ద పోలీసులు ఆమెను అడ్డుకుని, కుటుంబ సభ్యులు వద్దని చెబుతున్నారని చెప్పి పంపించే ప్రయత్నం చేశారు. అయితే, క్రాంతి విజ్ఞప్తి మేరకు పోలీసులు చివరికి ఆమెను ముద్రగడ నివాసానికి అనుమతించారు. నివాళులు అర్పించిన వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోవాలని పోలీసులు సూచించారు. పోలీసుల బందోబస్తు మధ్య క్రాంతి తన తండ్రికి నివాళులు అర్పించి తిరిగి వెళ్ళిపోయారు.
ముద్రగడ 1953 జనవరి 22న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో జన్మించారు. ఆయనకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. 1978లో జనతా పార్టీ తరపున ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, ఆ తర్వాత 1982లో టీడీపీలో చేరారు. 1983, 1985, 1989 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి, మొత్తం నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా బాధ్యతలు నిర్వర్తించారు. ఎన్టీఆర్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ కేబినెట్‌లో మంత్రిగా కూడా పనిచేశారు.
Also Read : ఏఓ శ్రీహరి హత్య కేసులో బిగ్ ట్విస్ట్: నిందితుడు హరికృష్ణ కుటుంబం ఆత్మహత్య!









