
World’s Most Potent Air Forces : ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన స్వతంత్ర వైమానిక దళాల జాబితాలో భారత వైమానిక దళం (IAF) మూడో స్థానానికి చేరుకుని సరికొత్త చరిత్ర సృష్టించింది. అంతర్జాతీయ రేటింగ్స్ సంస్థ వరల్డ్ డైరెక్టరీ ఆఫ్ మోడర్న్ మిలిటరీ ఎయిర్‌క్రాఫ్ట్ (WDMMA) విడుదల చేసిన గ్లోబల్ రేటింగ్స్‌లో భారత్ ఏకంగా 69.4 ‘ట్రూ వ్యాల్యూ రేటింగ్’ (TvR) స్కోరును సాధించింది. అయితే ప్రపంచంలోని అన్ని రకాల సైనిక విమానయాన విభాగాలను (ఆర్మీ, నేవీ, మరీన్స్) కలిపి చూస్తే భారత వైమానిక దళం ఆరో స్థానంలో ఉంది. ఈ గ్లోబల్ ర్యాంకింగ్‌లో భారత్ తన పొరుగు దేశమైన చైనాను సైతం అధిగమించడం విశేషం.
ప్రపంచవ్యాప్తంగా తన ఆధిపత్యాన్ని చాటుకుంటూ భారత వైమానిక దళం ఈ గొప్ప విజయాన్ని సాధించింది. ప్రపంచంలోనే మూడో అత్యంత శక్తివంతమైన వైమానిక దళంగా ఎంపికై భారత్ తన ప్రతిష్టను ప్రపంచ వేదికపై మరోసారి చాటుకుంది. గ్లోబల్ రేటింగ్స్‌లో సాధించిన 69.4 అత్యుత్తమ స్కోరు ఆధారంగానే భారత్ చైనా కంటే మెరుగైన స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ పరిణామం భారత సైనిక రక్షణ రంగంలో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది.
ఈ రేటింగ్స్‌లో చైనా వైమానిక దళానికి 63.8 స్కోరు మాత్రమే లభించడంతో అది నాలుగో స్థానానికి పరిమితమైంది. కేవలం ఎక్కువ సంఖ్యలో యుద్ధ విమానాలు ఉన్నంత మాత్రాన వైమానిక దళం యొక్క అసలైన బలాన్ని అంచనా వేయలేమని ఈ ర్యాంకింగ్స్ స్పష్టం చేస్తున్నాయి. వైమానిక దళం ఎంత ఆధునికమైనది, దళంలో ఎలాంటి సమతుల్యత ఉంది. యుద్ధ సమయంలో ఎంత వేగంగా స్పందించగలదు అనే అంశాలే అసలైన సైనిక శక్తికి ప్రామాణికమని ఈ ఫలితాలు నిరూపించాయి.
ఈ ప్రపంచ ర్యాంకింగ్‌ను ఒక ప్రత్యేకమైన గ్లోబల్ వాల్యుయేషన్ సిస్టమ్ ద్వారా రూపొందించారు. ఇందులో కేవలం యుద్ధ విమానాల సంఖ్యనే కాకుండా, అందులోని ఆధునిక సాంకేతికత, విమానాల సక్రమ నిర్వహణ (Maintenance) వంటి అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. వీటితో పాటు లాజిస్టిక్ సపోర్ట్, పైలట్ల శిక్షణ, విమాన దళం మొత్తం వ్యూహాత్మక సమతుల్యత వంటి అంశాలకు ఇందులో అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.
Also Read : మా భూభాగంపై అడుగుపెడితే ఊహించని రీతిలో బదులిస్తాం.. ఇరాన్ ఘాటు వ్యాఖ్యలు
భారత వైమానిక దళం వద్ద ప్రస్తుతం అత్యాధునిక యుద్ధ విమానాలు, రవాణా విమానాలు, హెలికాప్టర్లతో కూడిన అత్యంత సమర్థవంతమైన దళం ఉంది. దీనివల్ల విమానాలను మెరుగ్గా నిర్వహించడం, పైలట్లకు సమర్థవంతమైన శిక్షణ ఇవ్వడం,అత్యవసర పరిస్థితుల్లో వేగంగా చర్యలు చేపట్టడం ఐఏఎఫ్‌కు సులువవుతోంది. భారత సరిహద్దు భద్రతలో ఈ దళం కీలక పాత్ర పోషిస్తోంది.
గత కొన్నేళ్లుగా కొత్త యుద్ధ విమానాలు, అత్యాధునిక హెలికాప్టర్లను దళంలో చేర్చడంతో పాటు పాత విమానాలను కూడా నిరంతరం అప్‌గ్రేడ్ చేయడం జరిగింది. భారత్ అనుసరిస్తున్న ఈ సమగ్ర వ్యూహమే వైమానిక దళాన్ని మరింత శక్తివంతంగా మారుస్తోంది. ఇది దేశ వైమానిక భద్రతను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడంలో కీలక శక్తిగా పనిచేస్తోంది.
ఈ గ్లోబల్ జాబితాలో అమెరికా వైమానిక దళం (USAF) 242.9 గరిష్ట స్కోరుతో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. అమెరికా వద్ద అన్ని రకాల అత్యాధునిక విమానాలు సరైన నిష్పత్తిలో ఉన్నాయి. అంతేకాకుండా వారి వద్ద విమానాల సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. అమెరికా ఉపయోగిస్తున్న విమానాల్లో అత్యధిక భాగం వారి స్వదేశీ సాంకేతికతతో నిర్మించినవే కావడం గమనార్హం.
డబ్ల్యూడీఎమ్‌ఎమ్‌ఏ (WDMMA) విడుదల చేసిన ఈ ప్రస్తుత జాబితాలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 103 దేశాలను చేర్చారు. ఇందులో కేవలం ప్రధాన వైమానిక దళాలే కాకుండా, వివిధ దేశాల ఆర్మీ, నేవీ , మరీన్ కోర్ విభాగాలకు చెందిన వైమానిక విభాగాలు కూడా ఉన్నాయి. మొత్తంగా 129 సైనిక వైమానిక సేవల పరిధిలోని 48 రకాల సైనిక విమానాల పనితీరు , సామర్థ్యాన్ని సమీక్షించి ఈ ర్యాంకింగ్స్‌ను ఖరారు చేశారు.
Also Read : దుబాయ్ లో వైభవం.. అంగరంగ వైభవంగా బోనాల పండుగ!









