
High Court : రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్ గూడ గ్రామంలో గత కొన్ని రోజులుగా తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్న వివాదాస్పద భూముల వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సదరు భూములలో ప్రభుత్వం గానీ, అధికారులు గానీ ఎలాంటి తదుపరి చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేస్తూ న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. బహదూర్ గూడలోని సర్వే నంబర్లు 3, 4ల పరిధిలో ఉన్న 28 ఎకరాల భూమిపై స్పష్టత వచ్చే వరకు ప్రస్తుత పరిస్థితినే (Status Quo) కొనసాగించాలని ఆదేశించడంతో, విచారణ ఎదుర్కొంటున్న బాధితులైన నలుగురు రైతులకు హైకోర్టులో భారీ ఊరట లభించింది.
ఈ కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే.. బహదూర్ గూడ గ్రామంలోని సర్వే నంబర్లు 3,4 పరిధిలో ఉన్న 28 ఎకరాల భూమి తమదేనని, గత 30 ఏళ్లుగా తాము అక్కడ సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని పేర్కొంటూ నలుగురు రైతులు హైకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘకాలంగా తమ ఆధీనంలో ఉన్న భూములను ప్రభుత్వం బలవంతంగా స్వాధీనం చేసుకునేందుకు యత్నిస్తోందని వారు ఆరోపించారు. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వినిపించిన బలమైన వాదనలతో ఏకీభవించిన హైకోర్టు, రైతుల సాగు హక్కులకు భంగం వాటిల్లకుండా ప్రభుత్వం తదుపరి చర్యలు చేపట్టకుండా స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read : CURE పరిధిలో ఇందిరమ్మ ఇళ్లు: రూ.10 వేల టోకెన్ రుసుముతో దరఖాస్తులు..
విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (AG) సుదర్శన్ రెడ్డి న్యాయస్థానంలో తీవ్ర వాదనలు వినిపించారు. పిటిషనర్లు పేర్కొంటున్న ఆ 28 ఎకరాల భూములు వారివి కాదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రైతులు ఆధారాలుగా చూపిస్తున్న పట్టదారు పాస్ పుస్తకాలపై ఎలాంటి సంబంధిత అధికారుల సంతకాలు లేవని ఏజీ స్పష్టం చేశారు. ప్రభుత్వం కేవలం సర్వే నంబర్లు 28, 62 పరిధిలో ఉన్న ప్రభుత్వ భూములకు మాత్రమే రక్షణగా ఫెన్సింగ్ వేసిందని, రైతులు పేర్కొంటున్న సర్వే నంబర్లు 3, 4 లో ఉన్న భూముల జోలికి ప్రభుత్వం గానీ, అధికారులు గానీ అసలు వెళ్లలేదని కోర్టుకు వివరించారు.
కాగా, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉన్న ఈ భూముల స్వాధీనం ,ఫెన్సింగ్ వ్యవహారం శనివారం వేకువజామున తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తమ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటోందని ఆరోపిస్తూ స్థానిక రైతులు గత కొద్దిరోజులుగా నిరసన దీక్షలు చేపట్టారు. అయితే, పోలీసుల భారీ బందోబస్తుతో అధికారులు, హైడ్రా (HYDRA) సిబ్బంది శనివారం తెల్లవారుజామునే రంగంలోకి దిగి, రైతుల దీక్షా శిబిరాన్ని తొలగించి చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు ప్రయత్నించడం స్థానికంగా పెద్ద కలకలం రేపింది.
ఈ క్రమంలో అధికారుల చర్యలను ప్రతిఘటించిన స్థానిక రైతులకు, పోలీసులకు మధ్య పెద్ద ఎత్తున తోపులాట, ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఆందోళనల నేపథ్యంలో పోలీసులు కఠినంగా వ్యవహరించి, నిరసన తెలిపిన స్థానిక రైతులు, వారికి మద్దతుగా నిలిచిన ప్రతిపక్ష బీఆర్ఎస్ ,భాజపా నేతలతో సహా సుమారు 36 మందిపై కేసులు నమోదు చేశారు. ప్రభుత్వం ఒకవైపు పోలీసు బలగాలతో చర్యలు వేగవంతం చేసినప్పటికీ, బాధితులైన నలుగురు రైతులు తక్షణమే చట్టపరమైన రక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించడంతో ఈ గొడవ న్యాయస్థానానికి చేరింది.
హైకోర్టు ప్రస్తుతానికి స్టే విధించడంతో బహదూర్ గూడలో ఉద్రిక్తతలు కొంతవరకు సడలినప్పటికీ, ఈ భూముల అసలు యాజమాన్య హక్కుల పై పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సి ఉంది. రూ. వందల కోట్ల విలువైన ఈ భూముల విషయంలో ప్రభుత్వం, రైతుల మధ్య వివాదం ఇంకా ముగియలేదు. హైకోర్టు ఆదేశాల ప్రకారం అధికారులు అక్కడ ఫెన్సింగ్ పనులను నిలిపివేయగా, తదుపరి విచారణలో కోర్టు ఎలాంటి తుది తీర్పునిస్తుందోనని స్థానిక రైతాంగం తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తోంది.
Also Read : చిన్నవయసులో ఉద్యోగ ఒత్తిడి.. అర్థరాత్రి నగ్నంగా పరుగెట్టి చెరువులో దూకి..









