Peddi Sudarshan Reddy :మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో హనుమకొండలోని రోహిణి ఆసుపత్రికి తరలించారు. అకస్మాత్తుగా కార్డియాక్ అరెస్ట్‌కు గురైన ఆయనకు అత్యవసర చికిత్స అందించిన అనంతరం, మెరుగైన వైద్యసేవల కోసం గ్రీన్ ఛానెల్ ద్వారా హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ఈ వార్త తెలియగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బిఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై చికిత్స అందించిన కార్డియాలజిస్ట్ డాక్టర్ మమతా రెడ్డి వివరాలను వెల్లడించారు. ఆసుపత్రికి తీసుకువచ్చిన సమయంలో ఆయన తీవ్రమైన గుండెపోటు (హార్ట్ స్ట్రోక్)తో ఉన్నారని, దాదాపు 10 సార్లు సీపీఆర్ (CPR) చేసిన తర్వాత ఆయన స్పందించారని తెలిపారు. రక్తాన్ని గుండె, ఊపిరితిత్తులకు తీసుకెళ్లే ఫల్మనరీ ఆర్టరీలో రక్తం గడ్డకట్టడం వల్ల బ్లాక్స్ ఏర్పడ్డాయని, వాటిని కరిగించడానికి ప్రత్యేక ఇంజెక్షన్లు ఇచ్చి యాంజియోగ్రామ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆయన పల్స్ నార్మల్‌గా ఉనప్పటికీ, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ (లంగ్ ఇన్ఫెక్షన్) ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. వైద్యసేవలకు ఆయన శరీరం సహకరిస్తోందని, నిలకడగా ఉన్నారని తెలిపిన వైద్యులు.. ప్రాథమిక చికిత్స అనంతరం కుటుంబ సభ్యుల అభిప్రాయం మేరకు వెంటిలేటర్ సాయంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు పంపాలని నిర్ణయించారు. సోషల్ మీడియాలో ఆయన ఆరోగ్యంపై వస్తున్న తప్పుడు ప్రచారాలను, వదంతులను ఎవరూ నమ్మవద్దని డాక్టర్ మమతా రెడ్డి విజ్ఞప్తి చేశారు.

ఈ విషయం తెలిసిన వెంటనే బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్‌లు హుటాహుటిన హనుమకొండలోని రోహిణి ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ చికిత్స పొందుతున్న సుదర్శన్ రెడ్డిని పరామర్శించి, ఆయన భార్య , కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి చికిత్స వివరాలను, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ఆరోగ్యం క్రమంగా మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పార్టీ ముఖ్య నేత అస్వస్థతకు గురయ్యారన్న వార్తతో పెద్ద సంఖ్యలో బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రి ప్రాంగణానికి తరలివచ్చారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, నాగరాజులు కూడా ఆసుపత్రికి వచ్చి సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని పరామర్శించారు. రాజకీయాభిప్రాయాలకు అతీతంగా స్థానిక ప్రజాప్రతినిధులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

మరోవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై తక్షణమే స్పందించారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిని అత్యవసరంగా హైదరాబాద్ తరలించేందుకు గ్రీన్ ఛానెల్ (Green Channel) ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఆసుపత్రి నుంచి హైదరాబాద్ వెళ్లే మార్గంలో ఎక్కడా అంబులెన్స్ ఆగకుండా ప్రత్యేక పోలీస్ పెట్రోలింగ్, ఎస్కార్ట్ వాహనాల నడుమ ప్రయాణం సాగేలా ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో కేటీఆర్, హరీశ్ రావు కూడా తమ కాన్వాయ్‌లో అంబులెన్స్ వెంటే హైదరాబాద్‌కు బయల్దేరారు. హనుమకొండ నుంచి అత్యంత వేగంగా, ప్రత్యేక వైద్య బృందం సంరక్షణలో వెంటిలేటర్ సదుపాయం ఉన్న అంబులెన్స్‌లో ఆయనను సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తీసుకువచ్చారు. మార్గమధ్యంలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా పోలీసులు ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టారు.

ప్రస్తుతం హైదరాబాద్ యశోద ఆసుపత్రిలోని నిపుణులైన గుండె , క్రిటికల్ కేర్ వైద్యుల బృందం పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స అందిస్తోంది. ఆసుపత్రి వద్ద ఆయన అభిమానులు, బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వేచి చూస్తున్నారు. ఆయన త్వరగా పూర్తిగా కోలుకుని సాధారణ స్థితికి రావాలని పలువురు ప్రముఖులు, మద్దతుదారులు ఆకాంక్షిస్తున్నారు.

MADHUKAR VYDHYULA
వి. మధుకర్‌ 25 ఏళ్లుగా జర్నలిజంలో ఉన్నారు.1996 లో ఈ వృత్తిలోకి అడుగుపెట్టిన మధుకర్‌ మొదట విలేకరిగా వివిధ పత్రికల్లో పనిచేశారు. అనంతరం సబ్‌ ఎడిటర్‌ గా ప్రజాశక్తిలో ఏడాది పనిచేశారు. సూర్య దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ ఇన్‌చార్జ్‌గా నాలుగున్నరేళ్లు పనిచేశారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో సండేమ్యాగ్జిన్‌, ఫీచర్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ చీఫ్‌ ఎడిటర్‌గా 13 ఏళ్లు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో రెండున్నరేళ్లుగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్,ఫీచర్స్‌, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.