Dehradun : డెహ్రాడూన్‌లో దారుణం జరిగింది. ఓ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు వరకట్న వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న దారుణ ఘటన వెలుగు చూసింది. తనను అదృష్టహీనురాలంటూ అత్తమామలు నెలల తరబడి మానసికంగా వేధించారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె చనిపోయే ముందు రికార్డ్ చేసిన కన్నీటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

డెహ్రాడూన్‌కు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న దోయివాలా ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు సృష్టి కంథారికి, ప్రభుత్వ ఉద్యోగే అయిన సౌరభ్ రతురితో గత ఏడాది నవంబర్‌లో వివాహం జరిగింది. పెళ్లయిన నాటి నుంచి కట్నం కోసం తన కూతురిని భర్త, అత్తమామలు శారీరకంగా, మానసికంగా వేధించారని, ఆమెను పదే పదే అదృష్టహీనురాలు, అరిష్టమని అర్థం అంటూ అవమానించారని మృతురాలి తల్లి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

తాను ఉరివేసుకునే ముందు సృష్టి కంథారి 90 సెకన్ల పాటు ఒక వీడియోను రికార్డ్ చేశారు. అందులో ఆమె ఏడుస్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ కనిపించారు. వీడియో ప్రారంభించిన 35 సెకన్ల తర్వాత ఆమె మాట్లాడటం మొదలుపెట్టింది. “సారీ మమ్మీ, నేను ఇలా వెళ్లిపోతున్నాను.. అన్నీ చాలా విచిత్రంగా మారిపోయాయి. నేను గత ఆరు నెలలుగా ఇది భరిస్తున్నాను.. ఇకపై నేను భరించలేను. వారి ఆలోచన విధానం ఎప్పటికీ మారదు. మా పెళ్లి తర్వాత జరిగిన ప్రతిదానికీ నన్ను నిందిస్తున్నారు. నన్ను మన్‌హూస్ అని పిలుస్తున్నారు” అంటూ ఆమె గుండెలు పగిలేలా ఏడ్చిన ఆ వీడియోతోనే ముగిసింది.

బుధవారం నాడు ఆమె ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా, ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన దోయివాలా సర్కిల్ ఆఫీసర్ వందన వర్మ మాట్లాడుతూ.. సృష్టి భర్త సౌరభ్, అత్త పర్విన, మరదలు చారులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలిపారు.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసు బృందం, ఎఫ్‌ఎస్‌ఎల్ బృందం ఘటనా స్థలాన్ని పరిశీలించాయని, పోస్టుమార్టం నిర్వహించామని ఆమె వెల్లడించారు. బాధితురాలికి ఎనిమిది నెలల క్రితమే వివాహం జరిగిందని, ఆమె ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కాగా, భర్త కూడా ప్రభుత్వ ఉద్యోగేనని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

Vamshi Krishna
కందారపు వంశీకృష్ణ ఏడేళ్లుగా జర్నలిజంలో ఉన్నారు. డిజిటల్ మీడియాలో ముందుగా HMTVలో రెండేళ్లు పనిచేశారు. అనంతరం TV5లో ఏడాది, V6లో రెండున్నరేళ్లు పనిచేశారు. తర్వాత పల్లవి టీవీలో చేరి అక్కడ 6 నెలలు పనిచేశారు. ప్రస్తుతం ఆర్టీవీలో ఏడాదిన్నరగా పనిచేస్తున్నారు. బ్రేకింగ్స్, పొలిటికల్, నేషనల్, స్పోర్ట్స్, సినిమా తదితర కేటగిరీల వార్తలు ఎక్కువగా రాస్తుంటారు.